కిడ్నీ బాధితులకు రూ.10వేల పెన్షన్‌ ఇస్తాం : వైఎస్‌ జగన్‌

2 Jan, 2019 12:35 IST|Sakshi

వైఎస్‌ జగన్‌ను కలిసిన కిడ్నీ బాధితులు

సాక్షి, శ్రీకాకుళం : అధికారంలోకి వచ్చిన తర్వాత కిడ్నీ బాధితులకు నెలకు రూ.10వేల పెన్షన్‌ అందిస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను లోహరబంధ పరిధిలోని ఏడు గ్రామాల కిడ్నీ బాధితులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను జననేతకు విన్నవించుకున్నారు. కిడ్నీ బాధితులకు ఎలాంటి పెన్షన్‌లు ఇవ్వడం లేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని మొరపెట్టుకున్నారు. రోగులకు సరిపడా డయాలసిస్‌ సెంటర్‌లు కూడా లేవని చెప్పారు. కిడ్నీ, తిట్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు వివక్షత చూపిస్తున్నారని జననేతకు చెప్పుకున్నారు.

 వారి సమస్యలపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. వంశధార మహేంద్రతనయ నుంచి మంచి నీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ హామీల పట్ల కిడ్నీ బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

ఇచ్చాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర
ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 336వ రోజు పాదయాత్ర ఇచ్చాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జననేతకు ఇచ్చాపురం ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది.

మరిన్ని వార్తలు