జార్ఖండ్‌లో బీజేపీకి ఎల్జేపీ ఝలక్‌

13 Nov, 2019 03:47 IST|Sakshi

50 చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తామన్న చిరాగ్‌ పాశ్వాన్‌

ఏజేఎస్‌యూతో సీట్ల పంపిణీలోనూ విభేదాలు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఎన్‌డీఏ చిరకాల మిత్రపక్షం శివసేనతో విభేదాలు తెచ్చుకున్న బీజేపీకి..జార్ఖండ్‌లోనూ తలబొప్పి కడుతోంది. సీట్ల పంపకంలో తేడాలు రావడంతో కన్నెర్ర చేసిన లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) 50 స్థానాల్లో అభ్యర్థులను ఉంచుతామంటూ ప్రకటించి, బీజేపీకి షాకిచ్చింది. మరో మిత్రపక్షం ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏజేఎస్‌యూ) కూడా మరిన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి, బీజేపీపై ఒత్తిడి పెంచింది. ఈనెల 30వ తేదీ నుంచి రాష్ట్రంలోని 81 సీట్లకు ఐదు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా కేవలం ఒకే ఒక్క స్థానంలో బరిలోకి దిగిన ఎల్‌జేపీ ఆ ఒక్కటీ గెలవలేకపోయింది. కానీ, ఈసారి ఎన్నికల్లో ఆరు స్థానాల్లో పోటీ చేస్తామంటూ ముందుకు రాగా బీజేపీ తిరస్కరించింది. దీంతో ఎల్‌జేపీ యువ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌..‘ఎల్‌జేపీ జార్ఖండ్‌లో సొంతంగా 50 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించింది. అభ్యర్థుల మొదటి జాబితాను సాయంత్రం విడుదల చేస్తాం’అంటూ మంగళవారం ట్విట్టర్‌లో ప్రకటించారు. రాష్ట్రంలో గణనీయ ప్రభావం చూపగలిగిన బీజేపీ మరో మిత్రపక్షం ఏజేఎస్‌యూ 2014 ఎన్నికల్లో పోటీ చేసిన 8 స్థానాల్లో 5 చోట్ల విజయం సాధించింది.

ఈసారి ఈ పార్టీ 19 స్థానాలను కోరుకోగా బీజేపీ 9 కంటే ఎక్కువ ఇచ్చేందుకు ససేమిరా అంది. ఆగ్రహించిన పార్టీ నాయకత్వం.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ లక్ష్మణ్‌ గిలువా పోటీ చేస్తున్న చక్రధర్‌పూర్‌ స్థానంతోపాటు 12 చోట్ల పోటీగా తమ అభ్యర్థులను బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. దిగివచ్చిన కాషాయదళం, ఏజేఎస్‌యూ నేతలతో చర్చలు జరిపేందుకు అంగీకరించింది.

మరిన్ని వార్తలు