గుడియా.. నాచ్‌నేవాలీ..చాక్లెట్‌ ఫేస్‌.. శూర్పణఖ..

24 Apr, 2019 07:42 IST|Sakshi

ఈ ఎన్నికల సీజన్‌లో రాంపూర్‌లో సాయంత్రాలు కలర్‌ఫుల్‌గా ఉంటాయి (జయప్రద తరచూ పార్టీలు మారడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎస్పీ నేత ఫిరోజ్‌ఖాన్‌)

ప్రియాంక పప్పూకి పప్పి
– మహేశ్‌ శర్మ, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి

మాయావతిని మా కూటమిలో చేర్చుకోవాలంటే ఆమె చాలా పెద్ద జాగానే ఆక్రమిస్తారు. పైపెచ్చు ఆమె పార్టీ గుర్తు ఏనుగు కూడా.. (రెండేళ్ల క్రితం ఎస్పీ, బీఎస్పీ కలయికపై అఖిలేశ్‌ యాదవ్‌ను  ప్రశ్నించినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలివి. ఇప్పుడు అదే మాయావతితో ఆయన పొత్తు పెట్టుకున్నారు)

మాయావతి రోజూ ముఖానికి ఫేషియల్‌ చేస్తారు. జుట్టుకు రంగు వేసుకొని యువతిలా కనిపించాలని తాపత్రయపడతారు.  60 ఏళ్లు వచ్చినా, ఇంకా ఆమె జుట్టు నల్లగానే ఉండడానికి  కారణం అదే.
– సురేంద్రనాథ్‌ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే

ఒక వేశ్య కూడా తనకు చెల్లించిన ప్రతి పైసాకు ప్రతిఫలాన్ని అందించి చిత్తశుద్ధి ప్రదర్శిస్తుంది. కానీ మాయావతి అలా కాదు. ఆమె పార్టీ టికెట్లు ఎవరు డబ్బులెక్కువగా ఇస్తే వారికి ఇస్తారు. ఎవరైనా టికెట్‌ కోసం కోటి రూపాయలు ఇస్తామంటే.. మరొకరొచ్చి రెండు కోట్లు ఇస్తామంటే వారికే ఇస్తారు.
– దయాశంకర్‌ సింగ్, బీజేపీ ఉత్తరప్రదేశ్‌ శాఖ ఉపాధ్యక్షుడు

ఆకాశంలో సగం. ఓటర్లలో సగం. అయినా చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదు. ఉన్నవాళ్లని గౌరవించే సంస్కృతీ లేదు. మహిళలు రాజకీయాలకి పనికిరారా? రాజకీయాల్లో పోటీ చేసే మహిళలపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకునే పురుషుల సంఖ్య ఈ మధ్య ఎక్కువైపోతోంది. ఉత్తరప్రదేశ్‌లో అలనాటి అందాల నటి జయప్రద లోదుస్తులపై రామ్‌పూర్‌ నియోజకవర్గంలో ఆమె ప్రత్యర్థి, ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్‌ వెకిలిగా వ్యాఖ్యానిస్తే ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజమ్‌ రెండాకులు ఎక్కువే చదివారు. ‘అలీ బజరంగ బలీ మావే. అనార్కలి మాకు అవసరం లేద’న్నారు. ఇలా తండ్రీ కొడుకు జయప్రదను టార్గెట్‌ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందిరాగాంధీ నుంచి ప్రియాంక గాంధీ వరకు, జయప్రద నుంచి హేమమాలిని వరకు రాజకీయాల్లోకి వచ్చిన మహిళలందరూ వేధింపులు వెటకారాలు ఎదుర్కొన్న వారే. వాళ్లెంత పవర్‌ఫుల్‌ నాయకురాళ్లయినా కావచ్చు. వారికి జనంలో వీరాభిమానులు ఉండచ్చు. కానీ ఎన్నికలు వచ్చే వేళకి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, ఇతర నాయకులకు నోరు పారేసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది.

ఆజం వెకిలితనం..
నిన్నటికి నిన్న జయప్రదను ఉద్దేశించి ఆజంఖాన్‌ అన్న మాటలు విన్న వాళ్లంతా షాక్‌కు లోనయ్యారు. మరీ ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ నివ్వెరపోయారు. ‘జయప్రదను నేనే రామ్‌పూర్‌కి తీసుకువచ్చా. ఆమె శరీరాన్ని తాకకుండా నేనే అందరినీ అడ్డుకునే వాడిని. దానికి మీరే సాక్ష్యం. ఆమె అసలు రంగు తెలుసుకోవడానికి మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ రంగు అండర్‌వేర్‌ ధరిస్తుందని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నా’ అని నోరు పారేసుకున్నారు. తాను రాజకీయ రంగానికి పరిచయం చేసిన జయప్రద బీజేపీకి మారి రామ్‌పూర్‌ నుంచి బరిలోకి దిగడంతో ఆజంఖాన్‌ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆరెస్సెస్‌ నిక్కర్‌ రంగుతో జయప్రద లోదుస్తుల్ని పోలిక పెడుతూ ఈ వెకిలి కామెంట్లు చేశారు.

ఈ వ్యాఖ్యలపై ప్రతీ ఒక్కరూ తీవ్రంగా ప్రతిస్పం దించినా కనీసం ఆయన క్షమాపణ కూడా కోరడానికి సిద్ధంగా లేరంటేనే తలబిరుసు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఆజంఖాన్‌  గతంలోనూ ఒక ఎన్నికల ర్యాలీలో జయప్రదని ‘నాట్యగత్తె’ అంటూ చులకన చేశారు. జయప్రద సినిమా రంగం నుంచి రావడమే కాదు, ఆమె కుటుంబ నేపథ్యాన్ని కూడా లాగి నోటికి ఎంత మాట వస్తే అంత మాట వాడేశారు ఆజంఖాన్‌. ఆయన కుమారుడు కూడా ‘అలీ బజరంగ బలీ మావే (హిందూ, ముస్లిం ఓట్లు మావే). అనార్కలి (సినీ రంగం నుంచి వచ్చిన నాట్యగత్తె జయప్రద) అక్కర్లే)దంటూ ఎన్నికల సభలో నినదించారు.

ఇందిరమ్మ.. మూగబొమ్మ
దేశ తొలి మహిళా ప్రధాని, గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన ఐరన్‌ లేడీ ఇందిరాగాంధీకి కూడా ఈ తరహా వ్యాఖ్యలు ఎదుర్కోక తప్పలేదు. ఆమె రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో గూంగీ గుడియా (మూగ బొమ్మ) అని సోషలిస్టు నేత రామ్‌ మనోహర్‌ ఏకంగా ఒక పేరే పెట్టేశారు. ప్రధాని అయ్యే తొలినాళ్లలో ఆమె తక్కువగా మాట్లాడేవారన్న విమర్శలుండేవి. అసలు ఇందిరకు ప్రధాని అయ్యే అర్హత లేదని విపక్షాలు చీటికిమాటికి ఎత్తి చూపుతుండేవి.

చూడ్డానికి అందంగా ఉంటుంది..
2014 ఎన్నికల సమయంలో ఎస్పీ నాయకుడు అమర్‌సింగ్‌ మథుర బీజేపీ అభ్యర్థి హేమమాలినిపై విరుచుకుపడ్డారు. ఆమె చూడ్డానికి అందంగా బొమ్మలా ఉంటుంది తప్ప ఆమెకు ఎవరూ ఓట్లెయ్యరంటూ ప్రచారం చేశారు. అమర్‌సింగ్‌కి బాలీవుడ్‌తో మంచి సంబంధ బాంధవ్యాలే ఉన్నాయి. హేమమాలినికి మంచి స్నేహితుడిగా కూడా గుర్తింపు ఉంది. ఎన్నికలొచ్చే సరికి స్నేహితులు కూడా శత్రువుల్లా మారి ఇలా మనసును తూట్లు పొడుస్తారా అని బాధపడటం మినహా హేమమాలిని ఏం చేయలేకపోయారు.

నుదుటి కుంకుమపైనా కామెంట్లు
కొద్ది రోజుల క్రితమే పీపుల్స్‌ రిపబ్లికన్‌ పార్టీ నేత జైదీప్‌ కవాడే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లక్ష్యంగా షాకింగ్‌ కామెంట్లే చేశారు. ఓ వీడియోను రూపొం దించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘గడ్కరీ పక్కన కూర్చొని స్మృతి ఇరానీ రాజ్యాంగాన్ని మార్చాలని చెబుతుంటారు. కానీ మీకో విషయం తెలియాలి. ఆమె తన భర్తల్ని మార్చినప్పుడల్లా ఆమె నుదుటిపై ఉన్న బొట్టు సైజు పెద్దదవుతూ ఉంటుంది. అలా అని నాతో ఒకరు చెప్పారు’ అంటూ తీవ్రంగా అవమానించారు.  

చాక్లెట్‌ ఫేస్‌ ప్రియాంక..
కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకగాంధీ బాధ్యతలు చేపట్టగానే ఆమెని టార్గెట్‌ చేస్తూ బీజేపీ నాయకుడు కైలాష్‌ విజయవార్గియా కాంగ్రెస్‌ పార్టీలో సమర్థులైన నాయకులు లేక ఇలాంటి చాక్లెట్‌ ఫేస్‌లను తెస్తున్నారంటూ ప్రియాంకపై విరుచుకుపడ్డారు. ఆయన ట్వీట్‌ తర్వాత బీజేపీ మద్దుతుదారులు ప్రియాంకపై అసభ్యకరమైన మీమ్‌లు, ట్వీట్లు పెట్టారు. దీంతో బిహార్‌లో కొందరిని అరెస్ట్‌ చేశారు కూడా.

నిండు సభలో చీర లాగారు..
ఎన్నికల సమయంలో ప్రచార హడావుడిలో ఏదో నోరు జారడం కాదు, చట్టసభల సాక్షిగా మహిళల్ని అవమానించిన ఘటనలూ ఉన్నాయి.  తమిళులకు జయలలిత అంటే ఎంత ఆరాధ్య దైవమో చెప్పనక్కర్లేదు. డీఎంకే శాసనసభ్యులు ఏకంగా దుశ్శాసన పర్వానికి దిగి.. ఆమె చీరలాగారు. చట్టసభల చరిత్రలో ఇదో చీకటి రోజు. ఇక పార్లమెంటులో మన తెలుగు ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరిని శూర్పణఖ అని ప్రత్యర్థి పార్టీల నేతలు తిట్టిపోసిన విషయమూ తెలిసిందే.

మహిళలు బాధితులుగా మారే అవకాశాలు రాజకీయాల్లో చాలా ఎక్కువ. ఇది తీవ్రంగా ఖండించాల్సిన అంశం. ఈ తరహా ధోరణి మన ప్రజాస్వామ్య వ్యవస్థని బలహీనం చేయడమే కాదు, మహిళా రాజకీయవేత్తల హక్కుల్ని కూడా కాలరాస్తుంది. అలాంటి చెత్త కామెంట్లు చేసే వారిని ఖండించడానికి మాటలు సరిపోవు. ఇలాంటి విపరీత ధోరణుల్ని అడ్డుకునే ప్రయత్నం ఎన్నికల సంఘం కూడా చేయకపోవడం శోచనీయం.
– బృందా కారత్, సీపీఎం నాయకురాలు

తిరగబడుతున్న యువతరం
ఎన్నికల వేళ మహిళల్ని టార్గెట్‌ చేస్తుంటే సీనియర్‌ లీడర్లు నిస్సహాయతతో పంటి బిగువన భర్తిస్తున్నారు కానీ కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న వారు మాటకి మాట విసురుతున్నారు. బీజేపీ నాయకురాలు, ఫ్యాషన్‌ డిజైనర్‌ కూడా అయిన షైనా ఎన్‌సీ ‘మహిళల్ని చిన్నచూపు చూస్తే ఏ మాత్రం సహించకూడదు. వారు బయటకి వచ్చి వెంటనే ఫిర్యాదు చెయ్యాలి. సోషల్‌ మీడియాలో నన్ను అవమానిస్తూ 587 వరకు మెసేజ్‌లు వచ్చాయి. నేను వాళ్ల పాపాన వారే పోతారులే అని ఊరుకోలేదు. పోలీసుస్టేషన్‌కి వెళ్లి కంప్లయింట్‌ చేశాను’ అని వెల్లడించారు. చట్టసభల్లోనూ, బయటా, మహిళలు పనిచేసే ప్రతీ చోటా మాటల ద్వారా మానసికంగా గాయం చేసి పైశాచికత్వాన్ని బయట పెట్టుకునే మగ పిశాచాలకు తగిన బుద్ధి చెప్పేలా చట్టాలు ఉండాలి అని షైనా అంటున్నారు. మహిళా సాధికారత గురించి పెద్ద లెక్చర్లు ఇస్తూ, వారి ఓట్లు కొల్లగొట్టడానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టే పార్టీల నేతలే మహిళలపై నోరు పారేసుకుంటుంటే ఎవరైనా ఏం చెయ్యాలి. చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్‌ బిల్లును కూడా అటకెక్కించేసిన ఈ పార్టీలు మహిళా సాధికారత కోసం ఏమైనా చేస్తారనుకుంటే పొరపాటే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు