కేరళలో పార్టీల బలాబలాలు

22 Mar, 2019 15:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఏప్రిల్‌ 23వ తేదీన పోలింగ్‌ జరుగనున్న 20 లోక్‌సభ స్థానాలకుగాను 18 లోక్‌సభ స్థానాల్లో  సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్‌ అండ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌కు మధ్యనే బహుముఖ పోటీ నెలకొని ఉంది. తిరువనంతపురం, పట్టణంతిట్ట లోక్‌సభ నియోజకవర్గాల్లోనే బీజేపీ బలం పుంజుకున్న కారణంగా త్రిముఖ పోటీ కనిపిస్తోంది. 

శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోని అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించడం ద్వారా ఈ రెండు నియోజక వర్గాల్లో హిందువులను బీజీపీ ఆకర్షించింది. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించడానికి ముందే, మార్చి 6న ఎల్‌డీఎఫ్‌ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ కూటమిలో సీపీఎం 16 సీట్లకు పోటీ చేస్తుండగా, నాలుగు సీట్లకు సీపీఐ పోటీ చేస్తోంది. భాగస్వామ్య పక్షాలైన జనతాదళ్‌ (సెక్యులర్‌), లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ తరపున ఎవరూ పోటీ చేయడం లేదు. 
అంతర్గత కలహాల వల్ల కాంగ్రెస్‌ పార్టీ తన 16 మంది అభ్యర్థులను ఖరారు చేయడానికి మరో పది రోజులు పట్టింది. మిగతా నాలుగు సీట్లలో కూటమిలోని ‘ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌’ రెండు సీట్లకు, ఆర్‌ఎస్పీ, కేరళ కాంగ్రెస్‌ (మణి) పార్టీ చెరో సీటుకు పోటీ చేస్తున్నాయి. ఈ లెక్కన సీపీఏం, కాంగ్రెస్‌ పార్టీలు 12 సీట్లలో ముఖాముఖి తలపడనున్నాయి. బీజేపీ కూడా సీనియర్ల పోటీ కారణంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో జాప్యం చేసింది. శబరిమల ఆలయం ఉన్న పట్టణంతిట్ట నియోజక వర్గం మినహా మిగతా 19 స్థానాలకు బీజేపీ అధిష్టానం గురువారం అభ్యర్థులను ప్రకటించింది. గెలిచే అవకాశాలున్న తిరువనంతపురం సీటుకు మిజోరం మాజీ గవర్నర్‌ కుమ్మనం రాజశేఖరన్‌ను కేటాయించారు. 

వాస్తవానికి 16 సీట్లకే బీజేపీ పోటీ చేస్తుండగా, నాలుగు సీట్లను తన మిత్రపక్షమైన భారత ధర్మ జన సేనకు కేటాయించారు. నాలుగింటిలో ఆ పార్టీ కేవలం రెండు సీట్లలోనే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కాసర్‌గఢ్, పాలక్కాడ్, అలప్పూజ, కొట్టాయం ప్రాంతాల్లోనే బీజేపీకి కాస్త పట్టుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయత్వంలోని కూటమి ఏకంగా 12 సీట్లను గెలుచుకోగా, మిగతా సీట్లను వామపక్షాల కూటమి గెలుచుకుంది. ఆ తర్వాత 2016లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం కూటమి అధికారంలోకి వచ్చింది. కన్నూరు, వడకర, కోజికోడ్, పట్టణంతిట్ట, తిరువనంతపురం నియోజకవర్గాల్లో పోటీ నువ్వా, నేనా అన్నట్టు రసవత్తరంగా మారింది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు