కవితపై పోటీకి... ఏ ‘రామ్‌’డొస్తాడో!

14 Mar, 2019 01:05 IST|Sakshi

టీజేఎస్‌ చీఫ్‌ పోటీచేస్తానంటే మద్దతిచ్చే యోచనలో కాంగ్రెస్

నామా పార్టీ మారితే ఖమ్మం సీటు

సిట్టింగ్‌ ఎంపీ శ్రీనివాస్‌ రెడ్డిని పిలిచి టికెట్‌ ఇవ్వడంపైనా దృష్టి

మల్కాజ్‌గిరి బరిలో రేవంత్‌.. భువనగిరి నుంచి కేవీఆర్‌ లేదంటే మధుయాష్కీ

పాలమూరు నుంచి డీకే అరుణ.. పార్టీ మారితే జితేందర్‌రెడ్డికి చాన్స్‌

పెద్దపల్లి రేసులో మాజీ మంత్రి చంద్రశేఖర్‌.. ఏడు స్థానాలపై కుదిరిన ఏకాభిప్రాయం

ఈనెల 15న అభ్యర్థుల ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్‌ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. లోక్‌సభ అభ్యర్థులపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న స్క్రీనింగ్, ఎన్నికల కమిటీ సమావేశాల్లో కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఖరారు చేయాలనే కోణంలో పనిచేస్తోంది. దీంతో ఇప్పటికే ప్రచారంలో ఉన్న పేర్లలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్, మల్కాజ్‌గిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్, భువనగిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ దూకుడును ఏ నియోజకవర్గంలో ఎవరు తట్టుకోగలరనే అంచనాలతో జాబితాను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 15న జరగనున్న ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం 16, 17 తేదీల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆచి.. తూచి
లోక్‌సభకు పోటీచేసే ఆశావహుల జాబితా ఎక్కువగా ఉండటంతో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే క్రమంలో కాంగ్రెస్‌ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క సహా పలువురు ముఖ్యనేతలు.. ఆశావహుల జాబితాను ఢిల్లీ పెద్దల సమ క్షంలో వడపోస్తున్నారు. నిజామాబాద్‌ స్థానాన్ని ఎవరికి కేటాయించాలనే విషయంలో పెద్ద కసరత్తు చేస్తున్నారు. కేసీఆర్‌ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌ నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ‘రామ్‌–రామ్‌’ మంత్రాన్ని ప్రయోగించాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్‌.. నిజామాబాద్‌ నుంచి పోటీలో దిగితే ఆయనకు మద్దతు ప్రకటించాలని యోచిస్తున్నారు. వీలుంటే కోదండరామ్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దించాలనే ప్రతిపాదన ఉన్నా.. అది సాధ్యం కాదనే అంచనాతో మద్దతు ప్రకటన గురించి సంప్రదింపులు జరుగుతున్నాయి. పోటీకి ఆయన ఆసక్తి చూపని పక్షంలో జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే గంగారామ్‌ను బరిలో దింపనున్నారు. దళిత నాయకుడికి జనరల్‌ సీటు ఇచ్చామనే కోణంలో సామాజిక అస్త్రాన్ని.. కవితపై ప్రయోగించాలని యోచిస్తున్నారు. ఈ రెండింటిలో కోదండరామ్‌ బరిలో ఉంటే మద్దతు తెలపడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

మళ్లీ బరిలో రేవంత్‌ 
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లోక్‌సభ బరిలో ఉండే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నుంచి పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగినా చివరి నిమిషంలో ఆయన పేరును మల్కాజ్‌గిరి స్థానానికి కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలిస్తోంది. ఆయన కూడా పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమనే సంకేతాలను ఇప్పటికే ఇచ్చారు. రేవంత్‌ కాని పక్షంలో కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, హైదరాబాద్‌ నగర మాజీ మేయర్‌ బండా కార్తీకరెడ్డిల్లో ఒకరికి కేటాయిస్తారని తెలుస్తోంది.

ఇక, భువనగిరి స్థానాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ ఆశిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువ ఉన్నాయనే కారణంతో ఆయన భువనగిరి వైపు మొగ్గు చూపుతున్నా.. చివరి నిమిషంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి తన సోదరుడు వెంకటరెడ్డి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే, తొలుత నల్లగొండ స్థానానికి వెంకటరెడ్డి పేరు పరిశీలించినా భువనగిరి వైపే ఆయన మొగ్గు చూపుతున్నారని, నల్లగొండలో పోటీకి జానారెడ్డి కూడా ఆసక్తిగా లేరని, ఈ పరిస్థితుల్లో పటేల్‌ రమేశ్‌రెడ్డి లేదంటే ఉత్తమ్‌ పద్మావతిల్లో ఒకరికి అవకాశం రావచ్చని తెలుస్తోంది.  
 
నామా పార్టీలోకి వస్తే.. 
ఖమ్మం నుంచి గాయత్రిరవి, రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిల పేర్లను ఇప్పటివరకు పరిశీలనలోకి తీసుకున్నా తాజాగా మరో ఇద్దరు పేర్లు తెరపైకి వచ్చాయని గాంధీభవన్‌ వర్గాలు చెపుతున్నాయి. ఇక్కడ గతంలో టీడీపీ ఎంపీగా పనిచేసిన నామానాగేశ్వరరావు కాంగ్రెస్‌లోకి వస్తే ఆయనకు టికెట్‌ ఇవ్వాలని, లేదంటే టీఆర్‌ఎస్‌ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి టికెట్‌ రాని పక్షంలో ఆయన్ను పార్టీలోకి తీసుకుని టికెట్‌ ఇచ్చే ప్రతిపాదనలను కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. మహబూబ్‌నగర్‌ విషయంలో డీకే అరుణ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. అరుణ కాని పక్షంలో.. టీఆర్‌ఎస్‌ టికెట్‌ రాదని భావిస్తున్న సిట్టింగ్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి పార్టీలోకి వస్తే పోటీ చేయించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది.

ఆదిలాబాద్‌లో సోయం బాపూరావు సతీమణి భారతీబాయి తెరపైకి వచ్చింది. గతం నుంచీ పరిశీలనలో ఉన్న నరేశ్‌ జాధవ్, రమేశ్‌ రాథోడ్‌ల పేర్లు కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. ఇక, పెద్దపల్లి నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, ఊట్ల వరప్రసాద్‌లతో పాటు మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ పేరును కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శులకు అవకాశం ఇవ్వాలా వద్దా అనే విషయంలో ఇంకా అధిష్టానం నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ అవకాశం ఇవ్వాలని నిర్ణయిస్తే నాగర్‌కర్నూలు నుంచి సంపత్‌కు అవకాశమివ్వనున్నారు. సిట్టింగ్‌ను కొనసాగించాలనుకుంటే మాత్రం నంది ఎల్లయ్యకే మరోసారి అవకాశం దక్కనుంది. 
 
దాదాపు ఖరారు 
హైదరాబాద్, సికింద్రాబాద్, జహీరాబాద్, మహబూబాబాద్‌ ,కరీంనగర్, మెదక్, చేవెళ్ల పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల విషయంలో దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఫిరోజ్‌ఖాన్‌ (హైదరాబాద్‌), అంజన్‌కుమార్‌యాదవ్‌ (సికింద్రాబాద్‌), కలకుంట్ల మదన్‌మోహన్‌రావు (జహీరాబాద్‌), పోరిక బలరాం నాయక్‌ (మహబూబాబాద్‌), పొన్నం ప్రభాకర్‌ (కరీంనగర్‌), గాలి అనిల్‌కుమార్‌ (మెదక్‌), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల)ల పేర్లు ఖరారయ్యాయని, ఈ పేర్లు అధికారికంగా ప్రకటించడమే మిగిలిందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు