6 ప్యాక్‌ ఎలక్షన్‌

11 May, 2019 05:25 IST|Sakshi

ఏడు రాష్ట్రాలు, 59 స్థానాల్లో రేపే పోలింగ్‌

యూపీ, ఢిల్లీ, బిహార్, మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ పోరు

గత ఎన్నికల్లో 44 స్థానాలు గెలుచుకున్న బీజేపీ

ఎన్నికల బరిలో 43 మంది బీజేపీ సిట్టింగ్‌ ఎంపీలు

ఎన్నికలు ముగింపు దశకు వచ్చేసరికి నరాలు తెగే ఉత్కంఠ ఊపిరాడనివ్వడం లేదు. కేంద్రంలో గద్దెనెక్కే దెవరు? మోదీ మరోసారి మ్యాజిక్‌ చేస్తారా? కాంగ్రెస్‌ కాస్తయినా పుంజుకుంటుందా? ముచ్చటగా మూడో కూటమి కొత్త రాజకీయ సమీకరణలకు బాటలు వేస్తుందా? ఇప్పుడందరి మదిలోనూ ఇవే ప్రశ్నలు. ఆరో దశలో ఏడు రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది.  అన్ని పార్టీలకూ ఈ విడతే అత్యంత కీలకం. ముఖ్యంగా కమలం పార్టీ కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఈ 59 నియోజకవర్గాల్లో 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. మరోసారి ఆ స్థాయి విజయం బీజేపీకి దక్కుతుందా? ఏకంగా 43 మంది సిట్టింగ్‌ ఎంపీలనే బరిలోకి దింపడంతో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొని ఎంతవరకు నిలబడగలదు? కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోరు ఉన్న నియోజకవర్గాల్లో హస్తం పార్టీ హవా చూపిస్తుందా?

ఇప్పటివరకు అయిదు దశల్లో 424 నియోజకవర్గాల్లో పోలింగ్‌ పూర్తయింది. ఇంకా 118 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఆదివారం జరగబోయే ఆరోదశలో పై చేయి సాధించడానికి అన్ని పార్టీలు తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయి.  ఈ దశలో ఎవరు నెగ్గితే వారే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. బిహార్, హరియాణా, జార్ఖండ్, మధ్యప్రదేశ్,   ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు గతంలో మాదిరిగా లేవు. 2014 ఎన్నికల్లో ఢిల్లీ రాష్ట్రాన్ని క్లీన్‌ స్వీప్‌ చేసిన బీజేపీ బిహార్, హరియాణాలో ఎవరి అంచనాలకు అందని విధంగా దూసుకుపోయింది.

ఇక యూపీలో విజయభేరి ఢిల్లీ పీఠానికి బాటలు వేసింది. కానీ ఈ అయిదేళ్లలో రాజకీయంగా, వ్యవస్థాగతంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోవడం, ఒకట్రెండు సీట్లకే పరిమితమైన చోట క్షేత్రస్థాయిలో పట్టు బిగించడం, పాత శత్రువులే కొత్త మిత్రులుగా మారడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంతో ఆగర్భ శత్రువులు కూడా ఏకం కావడం వంటి పరిణామాలు రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయో ఎవరి అంచనాలకు అందడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి. ఈ దశలో అత్యధిక స్థానాలు దక్కించుకోవడానికి మోదీ,షా ద్వయం అన్ని         రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
 
మొత్తం రాష్ట్రాలు: 7
పోలింగ్‌ జరిగే నియోజకవర్గాలు: 59
బరిలో ఉన్న అభ్యర్థులు: 979

పశ్చిమ బెంగాల్‌
నియోజకవర్గాలు : 8
తామ్‌లుక్, కంథీ, ఘటాల్, ఝార్‌గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకూరా, బిష్ణుపూర్‌
గత ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎనిమిది స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. అప్పట్లో సైడ్‌ ప్లేయర్‌గా ఉన్న బీజేపీ ఈసారి ప్రధాన ప్రత్యర్థిగా మారి హోరాహోరి పోరాటానికి తెరతీసింది. వీటిలో నాలుగు నియోజకవర్గాల్లో ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం అత్యధికంగా ఉండే జార్ఖండ్‌కు సరిహద్దుల్లో ఉండే జంగల్‌మహల్‌ ప్రాంతంలో ఎన్నికలూ జరుగుతున్నాయి. ఒకప్పుడు సీపీఎంకి కంచుకోటగా ఉండే ఈ ప్రాంతాల్లో ఆ పార్టీ నామమాత్రపు పోటీని కూడా ఇవ్వలేకపోతోంది.

బీర్బహ సోరెన్

ఆదివాసీలను ఆకర్షించడానికి మమత దీదీ ఏకంగా 52 పథకాల్ని ప్రవేశపెట్టారు. మరోవైపు ఆరెస్సెస్‌ ఈ ప్రాంతంలో బలంగా విస్తరించింది. ఆదివాసీలను ఆకర్షించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ 150 ఏకలవ్య విద్యాలయాలను నిర్వహిస్తూ వారిలో అక్షరాస్యత పెంచుతోంది, ఝార్‌గ్రామ్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి స్కూలు టీచర్‌గా పనిచేస్తున్న బీర్బహ సోరెన్, బీజేపీ అభ్యర్థి, ఇంజనీర్‌ అయిన కునార్‌ హేమంబరం మధ్య గట్టి పోటీ నెలకొంది. మమత ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి అమలు జరగడం లేదన్న అసంతృప్తి ఆదివాసీల్లో ఉంది. అదే ఇప్పుడు బీజేపీ విజయావకాశాలను పెంచుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  

జార్ఖండ్‌
నియోజకవర్గాలు: 4
 గిరిడీహ్, ధన్‌బాద్, జంషెడ్‌పూర్, సింగ్‌భూమ్‌
ఈ దశలో పోలింగ్‌ జరిగే నాలుగు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో బీజేపీయే గెలుపొందింది. 2014 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అధికారం దక్కించుకుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి ఆశించినంత స్థాయిలో జరగలేదు. ఇక బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేవలం ప్రధాని మోదీ ఇమేజ్‌పైనే ఆశలు పెట్టుకొని బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మోదీ హవాను అడ్డుకోవడానికి విపక్ష పార్టీలైన కాంగ్రెస్, జేఎంఎం, మాజీ సీఎం బాబూలాల్‌ మరాండీకి చెందిన జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా ప్రగతిశీల్‌ (జేవీఎంపీ), ఆర్జేడీ మహాకూటమిగా ఏర్పడి సవాల్‌ విసురుతున్నాయి.


చమాయ్‌ సోరెన్, బిద్యుత్‌ బరణ్‌ 

ధన్‌బాద్‌ నియోజకవర్గంపై 2009 నుంచి కాషాయం జెండా ఎగురుతోంది. సిటింగ్‌ ఎంపీ పశుపతినాథ్‌ సింగ్‌నే బీజేపీ మళ్లీ బరిలో దింపింది. ఆయనపై కాంగ్రెస్‌ పార్టీ  మాజీ క్రికెటర్, బీజేపీ నుంచి ఫిరాయించిన  కీర్తీ ఆజాద్‌కు టికెట్‌ ఇవ్వడంతో పోరు రసవత్తరంగా మారింది. మరోముఖ్యమైన స్థానం జంషెడ్‌పూర్‌. ఇది జనరల్‌ సీటు అయినప్పటికీ మహాకూటమి అభ్యర్థిగా జేఎంఎం నుంచి ఆదివాసీ చమాయ్‌ సోరెన్‌కు పోటీకి నిలిపారు. అభ్యర్థి ఎంపికతోనే మహాకూటమి సగం విజయం సాధించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బీజేపీ సిటింగ్‌ ఎంపీ, కుర్మి సామాజిక వర్గానికి చెందిన బిద్యుత్‌ బరణ్‌ మహతోకే టికెట్‌ ఇచ్చింది. కార్మికుల మద్దతు కలిగిన సోరెన్‌ మైనార్టీలను కూడా ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంటే, మహతో కేవలం మోదీ పాపులారిటీనే నమ్ముకొని విజయంపై ధీమాగా ఉన్నారు.  

ఢిల్లీ
నియోజకవర్గాలు: 7
చాందినీ చౌక్, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ (ఎస్‌సీ), దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ
గత ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసిన రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి. కానీ ఈ అయిదేళ్లలో వచ్చిన మార్పులు, రోజురోజుకూ మారిపోయే ఢిల్లీ ఓటరు మూడ్‌ చూస్తుంటే గత ఎన్నికల మాదిరిగా కమలదళం అన్ని స్థానాలు దక్కించుకోలేదేమోనన్న అంచనాలున్నాయి.  ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్‌కున్న క్రేజ్‌తో ఆ పార్టీ గట్టి పోటీయే ఇస్తోంది. ఆప్‌ ఓటర్లందరూ ఒకప్పుడు కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన వారే. కాషాయం ఓటు బ్యాంకు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అందుకే బీజేపీ త్రిముఖ పోటీలో తమదే పై చేయి అన్న ధీమాతో ఉంది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తూర్పు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్, ఆప్‌ అభ్యర్థి, విద్యావేత్త ఆతిషి మధ్య హోరాహోరి పోరు నెలకొంది.

హర్షవర్ధన్, జేపీ అగర్వాల్‌

పాఠశాలల వ్యవస్థను సంస్కరించడంతో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఓటర్లు ఆతిషి వైపు మొగ్గు చూపించే అవకాశాలున్నాయి. ఇక ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి, 81 ఏళ్ల వయసున్న  షీలాదీక్షిత్‌ పోటీ చేస్తూ ఉండడంతో ఈ స్థానంపై ఆసక్తి పెరిగింది. అంత వయసులోనూ ఆమె ప్రచారాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఆశలు కల్పించారు.  ముస్లిం ఓటర్ల మద్దతుతో షీలా విజయం సాధిస్తారన్న నమ్మకంలో కాంగ్రెస్‌ ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి సిటింగ్‌ ఎంపీ, భోజ్‌పురీ గాయకుడు, నటుడు మనోజ్‌ తివారీ బరిలో ఉన్నారు. ఆప్‌ నుంచి దిలీప్‌ పాండే పోటీ పడుతున్నారు. చాందినీ చౌక్‌ నియోజకవర్గంలో శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి హర్షవర్ధన్‌పై కాంగ్రెస్‌ పార్టీ నాలుగుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన జేపీ అగర్వాల్‌ను పోటీకి నిలిపింది. ఆప్‌ నుంచి పంకజ్‌ గుప్తా బరిలో ఉన్నారు. హర్షవర్ధన్‌ 1993–98 మధ్య ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా పల్స్‌ పోలియోను విజయవంతంగా అమలుచేశారు.

మధ్యప్రదేశ్‌
నియోజకవర్గాలు: 8
మొరెనా, భిండ్, గ్వాలియర్, గుణ, సాగర్, విదిష, భోపాల్, రాజ్‌గఢ్‌
పదిహేనేళ్ళ తర్వాత బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ ఓట్ల శాతంలో మాత్రం బీజేపీకన్నా ఒకడుగు వెనకే ఉంది. 2014లో మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాలకు గాను 27 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగురవేసిన బీజేపీకిగానీ, 2018 ఎన్నికల్లో అవిశ్రాంతంగా పోరాడి తృటిలో బయటపడిన కాంగ్రెస్‌కి గానీ ఈ ఎన్నికల్లో గెలుపు నల్లేరుమీద నడకేం కాదు.  దశాబ్దకాలం పాటు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ గెలుపు భోపాల్‌లో ప్రతిష్టాత్మకంగా మారింది. మాలెగాం బాంబు పేలుడు కేసులో జైలుపాలై  అనారోగ్యం పేరుతో బెయిలుపై బయటకు వచ్చిన సాధ్విని బీజేపీ బరిలోకి దింపింది. 

వీరేంద్ర కుమార్, కిరణ్‌ అహిర్వార్‌ 

బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ ఉమాభారతి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఖజురహోలో ఈసారి బీజేపీ నుంచి వీ.డీ శర్మ తన విజయావకాశాలను పరీక్షించుకుంటున్నారు. స్థానిక రాజకుటుంబీకురాలు కవితాసింగ్‌ని కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. హోశంగాబాద్‌ 1989 నుంచి బీజేపీకి మంచి పట్టున్న లోక్‌సభ స్థానం. మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్‌ పట్వా కూడా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్‌ బీజేపీ అభ్యర్థి ఉదయప్రతాప్‌ సింగ్‌. దామోహ్‌లో బీజేపీ నుంచి తిరిగి ప్రçహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ పోటీ చేస్తోంటే, కాంగ్రెస్‌ నుంచి ప్రతాప్‌ సింగ్, ప్రహ్లాద్‌ సింగ్‌ని ఢీకొనబోతున్నారు. గతంలో రెండుసార్లు విజయం సాధించిన వీరేంద్ర కుమార్‌నే తిరిగి బీజేపీ టీకంగఢ్‌లో పోటీకి దింపింది. ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ బీజేపీ వీరేంద్ర కుమార్‌ తిరిగి ఈ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ టికెట్‌పై కిరణ్‌ అహిర్వార్‌ తలపడుతున్నారు.  

బిహార్‌  
నియోజకవర్గాలు: 8
వాల్మీకీనగర్, తూర్పు చంపారణ్, పశ్చిమ చంపారణ్, శివహార్, వైశాలి, మహారాజ్‌గంజ్, సివాన్, గోపాల్‌గంజ్‌
గత ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాల్లో గెలుపొందితే, దాని మిత్రపక్షం లోక్‌ జనశక్తి పార్టీ ఒక్క స్థానంలో గెలుపొందింది. అయితే ఈ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. జనతాదళ్‌ (యునైటెడ్‌) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ గత ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని విభేదించి ఎన్నికల్లో భంగపడ్డారు. ఇప్పుడు బీజేపీ పూర్తిగా నితీశ్‌కున్న ఇమేజ్‌ మీదే ఆధారపడి ఎన్నికల బరిలోకి దిగింది.  ఆర్‌జేడీ, కాంగ్రెస్, వికాస్‌శీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ (వీఐపీ), హిందూస్తాన్‌ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం)లతో కూడిన మహాగఠ్‌బంధన్‌ గట్టి సవాలే విసురుతోంది.

ముఖేశ్‌ సహాని

వీఐపీ పార్టీ అధినేత ముఖేశ్‌ సహాని తాను మల్లా (జాలరి) కుమారుడినంటూ గర్వంగా ప్రకటించుకొని ప్రచారం చేస్తున్నారు. ఈ సారి ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాల్లో యాదవులు, ముస్లింలు, మల్లా ఓటర్లు బీజేపీకి అతి పెద్ద సవాల్‌ విసురుతున్నారు. ధనబలం, కండబలం ఇవే ఈ దశ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించబోతున్నాయి. మొత్తం 127 మంది అభ్యర్థులు బరిలో ఉంటే వారిలో 44 మంది కోట్లకు పడగలెత్తారు. మరో 43 మంది అభ్యర్థులు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు.  వాల్మీకీనగర్‌ నుంచి పోటీ పడుతున్న దీపక్‌ యాదవ్‌ 59.46 కోట్లతో అత్యంత ధనిక అభ్యర్థిగా ఉంటే, సగటు ఆస్తులు చూసుకుంటే బీజేపీ అభ్యర్థులు ముందు వరసలో ఉన్నారు.  

ఉత్తరప్రదేశ్‌
నియోజకవర్గాలు: 14
సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, ఫూల్పూర్, అలహాబాద్, అంబేడ్కర్‌నగర్, శ్రావస్తి, దొమరియాగంజ్, బస్తీ, సంత్‌కబీర్‌నగర్, లాల్‌గంజ్, ఆజంగఢ్, జౌన్‌పూర్, మచిలీషెహర్, భాడోహి
ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ప్రాంతంలోని 14 స్థానాలకు ఆరో దశలో పోలింగ్‌ జరుగుతోంది. ఈ స్థానాలున్న తూర్పు ప్రాంతం బాగా వెనుకబడి ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కోడలు, కేంద్ర మంత్రి మేనకాగాంధీ (బీజేపీ) సుల్తాన్‌పూర్‌ నుంచి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత, మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఆజమ్‌గఢ్‌ నుంచి పోటీలో ఉన్నారు.  2014 ఎన్నికల్లో ఆజమ్‌గఢ్‌ తప్ప మిగిలిన 13 సీట్లను బీజేపీ (ప్రతాప్‌గఢ్‌లో అప్నాదళ్‌ గెలుపుతో కలిపి) కైవసం చేసుకుంది. 2018 ఉప ఎన్నికలో ఫూల్పూర్‌  స్థానాన్ని ఎస్పీ గెలుచుకుంది. బీఎస్పీ మద్దతుతో ఈ నియోజకవర్గంలో ఎస్పీ విజయం సాధించడంతో మూడు పార్టీల మహా కూటమికి అంకురార్పణ జరిగింది. తొలి ప్రధాని నెహ్రూ మూడుసార్లు, ఆయన చెల్లెలు విజయలక్ష్మీ పండిత్‌ రెండుసార్లు లోక్‌సభకు ఫూల్పూర్‌ నుంచి ఎన్నికయ్యారు. కిందటి ఎన్నికల్లో సుల్తాన్‌పూర్‌ నుంచి ఇందిర మనవడు, బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ విజయం సాధించగా ఈసారి ఆయన తల్లి మేనక పోటీచేస్తున్నారు.

మేనకాగాంధీ, అఖిలేశ్‌ యాదవ్‌

ఇక్కడ బీఎస్పీ అభ్యర్థితోపాటు, కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎంపీ సంజయ్‌సింగ్‌ పోటీకి దిగారు. ఎస్పీ అగ్రనేత ములాయంసింగ్‌ యాదవ్‌ కిందటిసారి  ఆజమ్‌గఢ్‌ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఈసారి ఆజమ్‌గఢ్‌లో అఖిలేశ్‌పై భోజ్‌పురీ నటుడు, గాయకుడు దినేశ్‌లాల్‌ యాదవ్‌ ‘నిర్హౌవా’ను బీజేపీ నిలబెట్టింది. అలహాబాద్‌ సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ శ్యామాచరణ్‌ గుప్తా ఎస్పీలో చేరడంతో కాంగ్రెస్‌ మాజీ  సీనియర్‌ నేత, యూపీ కేబినెట్‌ మంత్రి రీటా బహుగుణ జోషీ బీజేపీ తరఫున పోటీకి దిగారు. ఈ స్థానంలో ప్రధాన పార్టీల తరఫున ఫిరాయింపుదారులే పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఇక్కడ బీజేపీ మాజీ నేత యోగేశ్‌ శుక్లాకు దక్కింది. ఎస్పీ తరఫున జేడీయూ మాజీ నేత రాజేంద్రసింగ్‌ పటేల్‌ పోటీకి దిగారు.  

బీసీలు, దళితులు, ముస్లింల మద్దతు అధికంగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ కలిసిపోటీచేయడం వల్ల ఈ పార్టీల అభ్యర్థులు బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. 2014లో ఈ 14 నియోజకవర్గాల్లో ఒక ప్రతాప్‌గఢ్‌ తప్ప మిగిలిన స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీకి పడిన ఓట్లు కలిపితే బీజేపీకి దక్కిన ఓట్లను మించిపోతాయి. ఈ రెండు కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ పూర్తిగా జరుగుతుందా? అనేది కీలకాంశంగా మారింది. రాష్ట్రంలోని మిగిలిన స్థానాల్లో మాదిరిగానే యాదవేతర బీసీలు, జాటవేతర దళితులు, ఎస్సీ, బీసీ వర్గాల్లో బాగా వెనుకబడిన కులాలు మళ్లీ బీజేపీకే మద్దతిస్తాయనే ఆశతో పాలకపక్షం నేతలు ఉన్నారు.  

హరియాణా
నియోజకవర్గాలు: 10
ఫరీదాబాద్, గుర్‌గావ్, హిసార్, రోహ్‌తక్, కర్నాల్, అంబాలా, సోనిపత్, సిర్సా, భివానీ–మహేంద్రగఢ్, కురుక్షేత్ర  
హరియాణా రాజకీయాలంటేనే ముగ్గురు లాల్స్‌ గుర్తుకొస్తారు. బన్సీలాల్, దేవీలాల్, భజన్‌లాల్‌ వారి కుటుంబాలే దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకొని నడిపించారు. జనాభాలో 27శాతం ఓటర్లు ఉన్న జాట్లు  ఎవరికి మద్దతు ఇస్తే వారికే అధికారం దక్కడం ఆ రాష్ట్ర ఆవిర్భావం నుంచి జరుగుతోంది. గత ఎన్నికల్లో ఆ సంప్రదాయాన్ని తిరగరాసి బీజేపీ పది నియోజకవర్గాలకు గాను ఏడింట్లో విజయకేతనం ఎగురవేసింది. జాట్‌ వ్యతిరేక పంజాబీ ఓటర్లను కూడగట్టి కొత్త సామాజిక సమీకరణలకు తెర తీసింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారాన్ని దక్కించుకుంది. ఈ సారి  అదే కార్డుని ప్రయోగిస్తూ జాట్‌ అభ్యర్థులపై పంజాబీ బ్రాహ్మణ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది.

దుష్యంత్‌ , భవ్య బిష్ణోయి

రెండేళ్ల క్రితం జాట్‌ ఆందోళనల ప్రభావంతో సమాజంలో జాట్లు, జాటేతరుల అన్న చీలిక వచ్చింది.  హరియాణాలో ఈ సారి హిసార్‌ స్థానంపైనే అందరి దృష్టి ఉంది. ఈ రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో ఉంచుకొని శాసిస్తున్న మూడు కుటుంబాలకు చెందిన వారసులు పోటీ చేస్తున్న స్థానమిది. ఐఎన్‌ఎల్‌డీ వ్యవస్థాపకుడు దేవీలాల్‌ ముని మనవడు, జేపీపీ పార్టీ అధినేత దుష్యంత్‌ చౌతాలా సిట్టింగ్‌ ఎంపీ. గత ఎన్నికల్లో ఐఎన్‌ఎల్‌డీ తరఫున పోటీ చేసి నెగ్గిన దుష్యంత్‌ ఈ సారి సొంత పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఇక బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బ్రిజేంద్ర సింగ్‌ కుమారుడు బీరేంద్ర సింగ్‌పోటీ చేస్తుంటే, కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయి పోటీలో ఉన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు