హస్తానికి చేదు అనుభవమేనా..

7 Apr, 2019 13:37 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: మెదక్‌ లోక్‌సభ స్థానం ఆవిర్భావం నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచింది. విపత్కర పరిస్థితిలో ఇందిరాగాంధీ వంటి వారికి ఆశ్రయం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించింది. అదేవిధంగా మల్లికార్జున్, లక్ష్మీబాయి, హనుమంతరావు, బాగారెడ్డి వంటి మహా నాయకులకు వరుస విజయాలు అందించి జాతీయ కాంగ్రెస్‌ పార్టీలోనే మెదక్‌ అంటే ఒక వెలుగు వెలిగింది. గత

అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 
ఒకటి రెండు మినహా చివరి వరకు నువ్వా? నేనా? అన్న విధంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ పడ్డారు. కానీ లోక్‌సభ ఎన్నికల ప్రారంభం నుంచి అభ్యర్థి గాలి అనిల్‌ కుమార్‌కు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సహకారం అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కీలక నాయకులు చెయ్యిజారి పోవడంతో పోటీ చేసి చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వస్తుందని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. 

మూడు నెలల్లో భారీ మార్పులు.. 
గడిచిన మూడు నెలల్లో మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని కాంగ్రెస్‌ పార్టీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్, అభ్యర్థులు ఉన్నారు.  అయితే  ఆ ఎన్నికల్లో టీజేఎస్‌తో  పొత్తు మూలంగా సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోని కాంగ్రెస్‌ నాయకులను అయోమయంలో నెట్టింది. దీనికి పర్యావసానంగా దుబ్బాక నియోజకవర్గం నుంచి కీలక నాయకులు, మాజీ మంత్రి ముత్యంరెడ్డి కంటతడి పెట్టి కాంగ్రెస్‌ను వీడారు. చివరి నిమిషంలో కాంగ్రెస్‌ టికెట్‌ తెచ్చుకున్న మద్దెల నాగేశ్వర్‌రెడ్డి ఓడిపోయిన నాటి నుంచి నియోజకవర్గం మొఖం చూడలేదనే విమర్శలు ఉన్నాయి.

అదేవిధంగా గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌కే గట్టి పోటీ ఇచ్చిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో గజ్వేల్‌లో కూడా కాంగ్రెస్‌కు భారీగా గండి పడింది. పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వరకు కాంగ్రెస్‌లోనే ఉండి, ఒక దశలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో ఉంటారని వార్తలు వచ్చిన మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరింది. దీంతో మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాలపై కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఆశకూడా పోయింది.  ఇలా ఒకొక్కరు కాంగ్రెస్‌ను వీడిపోవడం, పార్టీలోని నాయకులు పెద్దగా ప్రచారంలో తిరగడంలేదనే విమర్శలు వస్తున్నాయి.  ఈ  సంఘటనలతో ప్రస్తుత అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌పై పడుతోంది. 

సంప్రదాయ ఓటు బ్యాంకుపై ప్రభావం.. 
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. ఇలా 20శాతానికి పైగా ఎవ్వరు పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేసే ఆనవాయితీ ఉంది. అయితే ఇందుకు అభ్యర్థి ప్రచారం దోహదపడుతుంది. కానీ ఈ సారి కాంగ్రెస్‌ అభ్యర్థి కేవలం పటాన్‌చెరు, సంగారెడ్డి ప్రాంతాలకే పరిమితమై ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన ప్రాంతా ల్లో కానీసం కాంగ్రెస్‌కు ఓటు వేయమని అడిన వారే కరువయ్యారని కాంగ్రెస్‌ నాయకులు వాపోతున్నారు. అసలు ఎన్నికలే స్తబ్ధతగా ఉన్నాయని, ప్రజలు ఓటు వేసేందుకు ముం దుకు రావడమే కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల ప్రభావం కాంగ్రెస్‌ సాంప్రదాయ ఓటు బ్యాంకుపై పడుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు