ఉద్యోగుల్లారా.. జర భద్రం..!

3 Apr, 2019 10:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నారాయణఖేడ్‌: ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో ప్రభుత్వోద్యోగులు తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవనే విషయాన్ని గుర్తించాలి. ఈ సమయంలో ప్రభుత్వోద్యోగులు రాజకీయ పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొనడం, నేతలను సత్కరించేందుకు అత్యుత్సాహం చూపుతుంటారు. ఇలాంటి వారికి ముకుతాడు వేసే దిశగా ఎన్నికల సంఘం 23(ఐ) నిబంధనను అమల్లోకి తెచ్చింది. 1949 సెప్టెంబర్‌ 17 నుంచి ఈ నిబంధన అమలులో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ నిబంధన ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. ఏదో ఒక పార్టీకి ఓటేయాలని, ఫలానా అభ్యర్థికి మద్దతివ్వాలని కొందరు బంధువులను, ఇతరులను ప్రభావితం చేస్తే, మరికొందరు సామాజిక మాధ్యమాల్లో అత్యుత్సాహం కొద్దీ పోస్టులు పెడుతుంటా రు. తెలిసీ తెలియక ఇలాంటి పనులు చేస్తే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. రాజకీయ నాయకుల మీద ఎంత అభిమానం ఉన్నా మనసులోనే దాచుకోవాలి తప్ప బహిర్గత పరిస్తే చర్యలు తీసుకుంటారన్న విషయాన్ని గుర్తించాలి. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ జర భద్రంగా ఉండటం మంచిది. 

జెండాలు కడితే జరిమానా..!
ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పార్టీలు, అభ్యర్థులు కచ్చితంగా పాటించాలి. ఏమాత్రం ఉల్లంఘించినా చర్యలు తప్పవు. ఇళ్లపై పార్టీ జెండాలు ఎగరేసినా, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టినా.. ఎన్నికల కోడ్‌ కారణంగా అధికారులు ఆ జెండాలను వచ్చి తొలగిస్తారు. తొలగించడమే కాక.. దానికయ్యే ఖర్చునూ వసూలు చేస్తారు. ఎన్నికల అధికారి ‘అనుమతి’ తీసుకుంటే అది ఏ పార్టీకి చెందిందో ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికలఖర్చు కిందకు వస్తుంది. ఎవరైనా తెలియకుండా జెండాలు, ఫ్లెక్సీలు కడితే సొంతంగా తొలగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అవకాశంఉంది.  

మరిన్ని వార్తలు