ఎవరికి ఉపకారి.. ఎవరికి ‘వికారి’..!

6 Apr, 2019 12:25 IST|Sakshi
ఉగాది ఉషస్సులు (ప్రతీకాత్మక చిత్రం)

కొత్త ఆశలు.. నేతల ఊహాలు  

ఉగాది.. ఉషస్సు.. ఏ రాశి ఫలిస్తుందో..?

రాశి ఫలాలపై అభ్యర్థుల తరఫున నాయకుల ఆరా

తెలుగు వారికి కొత్త సంవత్సరం ఉగాది. ఈ నెల 6న(నేడు) ఉగాది పండగ జరుపుకోనున్నారు. వికారినామ సంవత్సరంలో విజయాలు చేకూరాలని.. సకల శుభాలు కలగాలని అందరికంటే ముందుగా వివిధ రాజకీయ పార్టీల శ్రేణులు కోరుకుంటున్నారు. తాము మద్దతు ఇచ్చే అభ్యర్థులే గెలవాలని వేడుకుంటున్నారు. ఏటా ఉగాది పండగను రైతులే అత్యంత వైభవంగా జరుపుకునేవారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలతో ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకులంతా ఉగాదిపై ఆసక్తి కనబరుస్తున్నారు. పల్లెల్లో పండగ ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. ఈ ఎన్నికల కాలంలో ఉగాది పర్వదినం కలిసిరావడం, పండగ తర్వాత ఐదు రోజులకే పోలింగ్‌ జరగడంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.      

సాక్షి, సిరిసిల్ల: కాలచక్రం గిర్రున తిరుగుతోంది. కాలగమనంలో మరో తెలుగు ఏడాది కరిగిపోయింది. విలంబినామ సంవత్సరానికి వీడ్కోలు పలికాం. కొత్త ఆశలు.. కొంగొత్త ఊసులతో ఉగాది పర్వదినాన ‘వికారి’నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. యుగానికి ఆదిఉగాది. తెలుగు సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న వేళ..‘ఆశలు చిగురించాలి.. ఆశయాలు నెరవేరాలి’. తీపి,పులుపుల మకరందం జీవితంలో అందరూ ఆస్వాదించాలి. తెలుగు సంవత్సరాది ఇంటింటా ఆనందాలు.. సంపదలు నింపాలి.. వికారినామ సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ జిల్లాలో పార్లమెంట్‌ ఎన్నికల వేడి సుర్రుమంటుంది. ఎన్ని‘కల’ బరిలో దిగిన నేతలంతా కొత్త పంచాంగంలో రాశిఫలాలను చూసుకుంటూ.. ఉగాది పచ్చడిని ఇష్టంగా ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. ఈ వికారి నామ సంవత్సం ఎవరికి ఉపకరిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. 

షడ్రుచుల వేళవింపు 
ఉగాది పర్వదినం రోజు షడ్రుచులను అందరూ ఆస్వాదిస్తారు. షడ్రుచులు అంటే.. చేదు, పులుపు, తీపి, వగరు, కారం, ఉప్పులతో కూడుకున్న ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. పంచాంగ పఠనం విని రాశిఫలాలు చూసుకుంటారు. ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఉగాది వేడుకల్లో పాల్గొంటూ.. పనిలో పనిగా ప్రచారాన్ని సాగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విలంబినామ సంవత్సరానికి వీడ్కోలు పలికి వికారినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. షడ్రుచుల ఉగాది పచ్చడిని తిని పంచాంగాన్ని విని భవిష్యత్‌ ఆశలతో.. కొత్త ఊసులతో నేతలంతా పార్లమెంట్‌లో అడుగు పెట్టాలని లక్ష్యంతో ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. 

రాజయోగం ఎవరికో..! 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎన్నికల వేడి రాజుకుంది. గెలుపు లక్ష్యంతో ఎవరికి వారు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ ఓటరు మారాజు ఎవరిని దీవిస్తాడో.. ఎవరికి రాజయోగం కల్పిస్తాడో పంచాంగ శ్రవణం చేసే వేదమూర్తులకు అంతుచిక్కడం లేదు. ఉగాది పర్వదినం పూట.. రాశిఫలాల వారిగా ఆదాయ.. ఖర్చులను చెప్పె ఉగాది పంచాంగంలోనూ ఎన్నికల ఫలితాల ఊసు లేదు. కరీంనగర్‌ పార్లమెంట్‌ బరిలో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. పెద్దపల్లిలో 17 మంది, నిజామాబాద్‌లో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

నిజామాబాద్‌లో పసుపు రైతులు తమ నిరసన గళాన్ని నామినేషన్ల రూపంలో తెలియజేశారు. నిజామాబాద్‌లో ఎన్నికల ఏర్పాట్లు ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది. అన్ని పార్లమెంట్‌ స్థానాల్లో అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమాతో ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఎవరికి రాజయోగం పడుతుందో.. ఎవరికి చేదు, వగరు, కారం ఫలితాలు వస్తాయో వేచిచూడాలి. ఎన్నికలు రోజు తరుముకొస్తున్న వేళ.. ఉగాది పర్వదినం రావడం నేతలందరికీ కలిసొచ్చే అంశమే. రాజయోగాన్ని పరీక్షించుకోవడంతో పాటు.. ఉగాది పూట ప్రచార పంచాంగాన్ని వినిపించవచ్చు.

భవిష్యత్‌పై ఆశలు
ఏటా ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఈ ఏడాది మాత్రం ఈ పంచాంగ శ్రవణానికి మరింత ప్రత్యేకత చేకూరనుంది. గ్రామాల్లో గ్రామస్థాయి నాయకులు, మండలాల్లో మండలస్థాయి నాయకులు, నియోజకవర్గంలో తాలూకా స్థాయి నాయకులు వికారినామ సంవత్సరం రోజున తాము బలపరుస్తున్న అభ్యర్థుల భవిష్యత్‌పై పంచాంగ బలాలను చూయించనున్నారు. పంచాంగ శ్రవణం పార్టీల ఆధ్వర్యంలో జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే పంచాంగ శ్రవణం జరపడం అనంతరం ప్రచారం చేసుకోవడం రెండు జరిగిపోతాయని నాయకులంతా దృష్టి సారిస్తున్నారు. పార్టీల నాయకుల జన్మ నక్షత్రాలు, రాశుల ఆధారంగా వారి భవిష్యత్‌ తెలుసుకోనున్నారు. మంచి ముహూర్తంలో నామినేషన్‌లు వేసిన అభ్యర్థులకు వికారినామ సంవత్సర విజయాలు అందించాలని నాయకులంతా గ్రామగ్రామాన ఎదురుచూస్తున్నారు. 

కొత్త... పాత నేతల పోరుబాట.. 
ఉగాది పూట కొత్త కుండ.. చింతపండు.. మామిడికాయలు.. వేపపూత, కొత్త బెల్లంతో కలిసిన షడ్రుచుల మేళవింపు పరిపాటి. ఈ సారి ఎన్నికల్లో కొత్త నేతలు.. పాత నేతల మధ్య పోరు సాగుతుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల సమయం పతాక స్థాయికి చేరింది. ఎన్నికలకు ఐదు రోజులే ఉండగా.. ప్రచారానికి మూడే రోజులు ఉంది. కరీంనగర్‌ బరిలో ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌ సిట్టింగ్‌ ఎంపీగా, కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ మాజీ ఎంపీగా విస్తృత పరిచయాలు ఉన్నాయి.

బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ మాత్రం కరీంనగర్‌లో కమలాన్ని వికసించేందుకు మోదీ మంత్రాన్ని జపిస్తున్నారు. పెద్దపల్లి బరిలో అందరూ కొత్తవారే కావడం విశేషం. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బి.వెంకటేశ్‌ నేత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఏ.చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థిగా ఎస్‌.కుమార్‌ ఉన్నారు. వీరంతా కొత్త వారే కావడంతో ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారో చూడాలి. నిజామాబాద్‌ బరిలో సిట్టింగ్‌ ఎంపీ కె.కవిత ఉండగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కి గౌడ్‌ మాజీ ఎంపీగా పరిచయాలు ఉన్నాయి. ఇక బీజేపీ అభ్యర్థి డి.అరవింద్‌ రాజకీయంగా పట్టున్న వ్యక్తి కావడం విశేషం. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఎవరికి వారు ఆశల పల్లకిలో ఊరేగుతుండగా.. ఉగాది పూట ఏ రాశికి రాజయోగం ఉందో.. ఏ రాశి గురువు బలం ఉందో.. వికారి నామసంవత్సరం.. ఎవరికి ఉపకరిస్తుందో వేచి చూడాల్సిందే...! ఇక పదండి.. ఉగాది పచ్చడి స్వీకరించి.. పంచాంగాన్ని ఆలకిద్దాం.. రాశిఫలాలను చూసుకుందాం.

మరిన్ని వార్తలు