కొనసాగుతున్న ఆరో దశ పోలింగ్‌

12 May, 2019 07:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనలు మినహా సార్వత్రిక ఎన్నికల ఆరోవిడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు ఆదివారం పోలింగ్‌ నిర్వహించారు.  ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరిగింది. సమస్యాత్మాక ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్‌ ముగిసింది. ఆరో విడతలో భాగంగా బిహార్‌లోని 8, ఢిల్లీలోని 7, హరియాణాలోని 10, జార్ఖండ్‌లోని 4, మధ్యప్రదేశ్‌లోని 8, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 14, పశ్చిమ బెంగాల్‌లోని 8 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ దశ ఎన్నికల్లో మొత్తంగా 979 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 

►సాయంత్రం 6 గంటల వరకు 59.70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో 80.13శాతం, ఢిల్లీలో 55.44శాతం, హరియాణాలో 62.14శాతం, ఉత్తరప్రదేశ్‌లో 50.82 శాతం, బిహార్‌లో 55.04శాతం, జార్ఖండ్‌లో 64.12శాతం, మధ్యప్రదేశ్‌లో 60.12శాతం పోలింగ్‌ నమోదైంది.

►సాయంత్రం 5 గంటల వరకు 54.42 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో 72.51శాతం, ఢిల్లీలో 46.50శాతం, హరియాణాలో 56.64శాతం, ఉత్తరప్రదేశ్‌లో 46.88 శాతం, బిహార్‌లో 51.52శాతం, జార్ఖండ్‌లో 58.08శాతం, మధ్యప్రదేశ్‌లో 57.62శాతం పోలింగ్‌ నమోదైంది.

►భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన భార్య ఉషాతో కలిసి ఢిల్లీలోని నిర్మన్‌ భవన్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. 

►మధ్యాహ్నం 4గంటల వరకు దేశ వ్యాప్తంగా 50.74శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రాలపరంగా చూస్తే.. బీహార్ 44.40%, హర్యానా 51.80%, మధ్యప్రదేశ్ 52.62%, ఉత్తర ప్రదేశ్ 43.26%, పశ్చిమ బెంగాల్ 70.51%, జార్ఖండ్ 58.08%, ఢిల్లీ 45.52% పోలింగ్‌ నమోదైంది.

►వాయు సేనాధిపతి మార్షల్‌ బీఎస్‌ ధనోవా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని నిర్మన్‌ భవన్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. 

►మధ్యాహ్నం మూడు గంటల వరకు దేశ వ్యాప్తంగా 46.52 శాతం పోలింగ్ నమోదైంది. ఇక రాష్ట్రాల వారిగా చూస్తే.. బీహార్ 43.86% ,హర్యానా 47.57%, మధ్యప్రదేశ్ 44.69%, ఉత్తర ప్రదేశ్ 40.96%, పశ్చిమ బెంగాల్ 63.09%, జార్ఖండ్ 54.09%, ఢిల్లీ 36.73శాతంగా నమోదైంది.

►ఒంటి గంట వరకుదేశ వ్యాప్తంగా 39.16శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రాల వారిగా ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్‌ వివరాలు
బిహార్‌ : 35.22 శాతం 
హర్యానా : 37.70 శాతం
మధ్యప్రదేశ్‌ : 41.36శాతం
ఉత్తర ప్రదేశ్‌ : 34.16శాతం
ఢిల్లీ : 28.69శాతం
పశ్చిమ బెంగాల్‌ : 52.31శాతం
జార్ఖండ్‌ : 46.64శాతం

  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలో కామరాజ్‌ లైన్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.  
  • నటి తాప్సీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. 

  • కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈసీ) సునీల్‌ ఆరోరా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని నిర్మన్‌ భవన్‌లో కుటుంబ సమేతంగా ఓటు వేశారు

  • పోలింగ్‌ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చేసుకున్నాయి. రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ బీజేపీ-తృణమూల్‌ కార్యకర్తలు ఆరోపణలు చేసుకుంటున్నారు. బంకురా జిల్లాలో పోలింగ్‌ కేంద్రం 254 వద్ద ఇరుపార్టీల కార్యకర్తలు కోట్లాటకు దిగడంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. కొంతమంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. 
  • సీపీఎం సీనియర్‌ నేత ప్రకాశ్‌ కారట్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని సంచార్‌ భవన్‌ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. 

  • కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ విద్యాలయలంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో భర్త రాబర్ట్‌ వాద్రాతో కలిసి ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు. 
  • యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని నిర్మన్‌ భవన్‌లో గల పోలింగ్‌ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. సోనియాతో పాటు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కూడా ఉన్నారు. ఆమె యూపీలోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

  • టీమిండియా మాజీ సారథి, లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోనిలోని మథురా రోడ్‌లో గల పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఆయనతో పాటు భార్య రోమి, కూతురు ఆమియా కూడా ఓటింగ్‌లో పాల్గొన్నారు.  
  • ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యూఢిల్లీలోని పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. సాధారణ పౌరుడిలా క్యూలైల్లో నిలబడి ఓటింగ్‌లో పాల్గొన్నారు. 

  • ​​​కేంద్ర విదేశాంగశాఖ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మా స్వరాజ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. 
  • ఢిల్లీలోనే అత్యంత కురువృద్ధుడైన బచ్ఛాన్‌ సింగ్‌ (111)తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. వెస్ట్‌ ఢిల్లీ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. కనీసం నిలబడలేని స్థితిలో ఉండికూడా ఎండలను తట్టుకుని ఓటేసి ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటిచెప్పారు. ఆయనకు పలువుకు అధికారులు అభినందనలు తెలిపారు. 
  • కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఔరంగజేబు లైన్‌లో సెంకడరీ పాఠశాలలో రాహుల్‌ ఓటువేశారు. ఆయన యూపీలో అమేథిలో స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 

  • భారత రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ తన ఓటు తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ సర్వేదయ విద్యాలయ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. భార్యతో కలిసి కోవింద్‌ పోలింగ్‌లో పాల్గొన్నారు. 

  • ఆమ్‌ఆద్మీ పార్టీ ఈస్ట్‌ ఢిల్లీ అభ్యర్థి అతీష్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదేళ్ల ఆప్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధికే ప్రజలు ఓటు వేస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. 
  • ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, మనీష్‌ సిసోడియా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు. 

  • బీజేపీ నార్త్‌-ఈస్ట్‌ ఢిల్లీ లోక్షసభ నియోజకవర్గ అభ్యర్థి మనోజ్‌ తివారి తన ఓటు తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. క్యూలైల్లో నిలుచుని ఓటు వేశారు. 
  • ఢిల్లీమాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షీలా దీక్షిత్‌ తన ఓటు తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. నార్త్‌-ఈస్ట్‌ ఢిల్లీ లోక్షసభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ పోలింగ్‌ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. 

  • కాంగ్రెస్‌ న్యూఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి అజయ్‌ మాకెన్‌ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో త్రిముఖ పోటీ ఏమీ లేదని.. అసలు పోటీఅంతా బీజేపీ, కాంగ్రెస్ మధ్యేనని అన్నారు. ఈ పోరులో తమ విజయం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. మాకెన్‌ 2004, 09లో ఇక్కడి నుంచి విజయం సాధించారు. బీజేపీ తరఫున న్యూఢిల్లీ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మీనాక్షీ లేఖీ బరిలో ఉన్నారు.

  • టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఈస్ట్‌ ఢిల్లీ అభ్యర్థి గౌతం గంభీర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని రాజేందర్‌ నగర్‌లో గంభీర్‌ ఓటువేశారు. సాధారణ ఓటర్లలా క్యూలైల్లో నిలుచుని తన భార్యతో కలిసి పోలింగ్‌లో పాల్గొన్నారు. 
  • భోపాల్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సాద్వీ ప్రజ్ఞాసింగ్‌ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆమెపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. 

  • టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి తన ఓటు హక్కును వినియోంచుకున్నారు. ఆరో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హర్యానాలోని గురుగ్రామ్‌లో విరాట్‌ ఓటువేశారు. సాధారణ  ఓటర్లలా క్యూలైల్లో నిలుచుని తన ఓటును వినియోగించకున్నారు. 

>
మరిన్ని వార్తలు