నాడు లోక్‌సభ హోదా.. నేడు అసెంబ్లీ గోదా

4 Apr, 2019 09:44 IST|Sakshi

గద్వాల, ఇబ్రహీంపట్నం.. ఒకప్పుడు లోక్‌సభ స్థానాలు

నేడు శాసనసభ స్థానాలుగా ఉనికిలోకి..

గద్వాల, వికారాబాద్, ఇబ్రహీంపట్నం.. ఇవన్నీ ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్లు. కానీ, ఒకప్పుడివి లోక్‌సభ స్థానాలుగా వెలుగొందాయి. 1952లో తొలి పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత జనాభా ప్రాతిపదికన పలుమార్లు పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఈ క్రమంలో కొన్ని స్థానాలు కనుమరుగై పోగా, మరికొన్ని కొత్తగా వచ్చి చేరాయి. ఆ క్రమంలో గద్వాల, వికారాబాద్, ఇబ్రహీం పట్నం స్థానాలు లోక్‌సభ జాబితా నుంచి తప్పుకున్నాయి.=- పోలంపల్లి ఆంజనేయులు,సాక్షి ప్రతినిధి– కరీంనగర్‌

గద్వాల పోయె.. కర్నూలు వచ్చె
మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని గద్వాల 1962లో ఐదేళ్ల కాలం మాత్రమే లోక్‌సభ నియోజకవర్గంగా ఉంది. ఎస్సీ రిజర్వేషన్ల ప్రకారం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో 1967లో ఈ స్థానం రద్దయి నాగర్‌కర్నూలు నియోజకవర్గం ఏర్పడింది. 1962లో గద్వాల నుంచి డి.కె.సత్యారెడ్డిపై గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి జె.రామేశ్వర్రావు ఆ స్థానం రద్దవడంతో 1967 నాటికి మహబూబ్‌నగర్‌ వెళ్లారు. 1967లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఎం.కిష్టయ్య మీద ఒకసారి, 1971, 1977లో వరుసగా డి.కె. సత్యారెడ్డిపై రెండుసార్లు విజయం సాధించారు రామేశ్వర్రావు. సత్యారెడ్డి ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డి.కె.అరుణ కుటుంబానికి చెందిన వారే.

లష్కర్‌ కోసం.. పట్నం పోయింది
ఇబ్రహీంపట్నం లోక్‌సభ నియోజకవర్గం కూడా ఐదేళ్లు మాత్రమే కొనసాగింది. 1952లో తొలి లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇబ్రహీంపట్నం పేరుతో పార్లమెంట్‌ నియోజకవర్గం తెరపైకి వచ్చినా, 1957 నుంచి రద్దయిపోయి సికింద్రాబాద్‌ నియోజకవర్గం ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం కొనసాగిన ఐదేళ్ల పాటు కాంగ్రెస్‌ నేత ఎస్‌.ఎ.ఖాన్‌ ఎంపీగా కొనసాగారు.

వికారాబాద్‌.. మహిళకు కిరీటం
వికారాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటై 1967 నుంచి రద్దయింది. 1952లో ఎస్‌.ఎ.ఎబినెజర్‌ గెలిచారు. ఆ తర్వాత ఆ స్థానం నుంచి 1957, 1962లో సంగం లక్ష్మీబాయి విజయం సాధించారు. లక్ష్మీబాయి హైదరాబాద్‌ స్టేట్‌ నుంచి ఎన్నికైన తొలి యాదవ మహిళా పార్లమెంట్‌ సభ్యురాలు. వికారాబాద్‌ 2009లో రద్దయి, చేవెళ్ల నియోజకవర్గం ఏర్పాటైంది.

2009లో రద్దయిన స్థానాలివి
నల్లగొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం 1962లో ఏర్పాటై 2004 ఎన్నికల వరకు కొనసాగింది. ఈ నియోజకవర్గం నుంచి బి.ఎన్‌.రెడ్డి, బద్దం నర్సింహారెడ్డి, సూదిని జైపాల్‌రెడ్డి వంటి మహామహులు ఎంపీలుగా గెలిచారు. 2009లో ఈ నియోజకవర్గం భువనగిరిగా ఆవిర్భవించింది.
తొలి తెలుగు ప్రధాని పీ.వీ.నరసింహారావును 1980లో పార్లమెంట్‌కు పంపించిన హన్మకొండ స్థానం కూడా 2009లో రద్దయింది. ఈ స్థానంలో 1984లో బీజేపీ నుంచి పోటీ చేసిన సి.జంగారెడ్డి ఎవరూ ఊహించని పి.వి.నరసింహారావునే ఓడించారు. అప్పటి పార్లమెంట్‌లో బీజేపీ తరపున జంగారెడ్డితో పాటు అటల్‌ బిహారీ వాజ్‌పేయి మాత్రమే సభ్యులుగా ఉండడం గమనార్హం.
ఆంధ్ర–తెలంగాణ వారధిగా 1967 నుంచి కొనసాగిన భద్రాచలం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం కూడా 2009లోనే రద్దయింది. ఖమ్మం జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో ఉన్న ఈ స్థానం నుంచి చివరిగా 2004లో సీపీఎం తరపున మిడియం బాబూరావు గెలుపొందారు. 2009లో అప్పటి వరంగల్‌ జిల్లా పరిధిలోని మహబూబాబాద్‌(ప్రస్తుత జిల్లా కేంద్రం) ఎస్టీ నియోజకవర్గంగా మారిపోయింది. మహబూబాబాద్‌ నియోజకవర్గం 1957లో జనరల్‌ సీటుగా ఏర్పాటై 1967లో రద్దయింది. మళ్లీ లోక్‌సభ నియోజకవర్గంగా రూపొందింది.
సిద్దిపేట ఎస్‌సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం 2009లో రద్దయి జహీరాబాద్‌గా మారింది. 1967లో ఏర్పాటైన సిద్దిపేట నుంచి మూడుసార్లు జి.వెంకటస్వామి(కాకా), ఐదు సార్లు నంది ఎల్లయ్య, రెండుసార్లు ఎం.రాజయ్య విజయం సాధించి పార్లమెంట్‌కు వెళ్లారు. ఇక జి.విజయ రామారావు, సర్వే సత్యనారాయణ ఒక్కో దఫా విజయం సాధించారు.  2009లో జహీరాబాద్‌ జనరల్‌ సీటు ఏర్పాటు కావడంతో 2009లో సురేష్‌ షెట్కార్‌(కాంగ్రెస్‌), 2014లో బీ.బీ.పాటిల్‌ (టీఆర్‌ఎస్‌) గెలుపొందారు.

మరిన్ని వార్తలు