లోక్‌సభ నుంచి శాసనసభకు..

13 Sep, 2018 03:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యే సీట్లకు ఫుల్లు గిరాకీ ఏర్పడింది. గత ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసిన చాలా మంది నేతలు ఈసారి అసెంబ్లీ సీట్లపై కన్నేశారు. ఈసారి అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శాసనసభకు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యోచిస్తున్నారు. ఈ ఆలోచనతోనే తమ జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలపై గురిపెట్టి అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీకి పోటీ చేసి ఓడినా మళ్లీ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో లోక్‌సభ బరిలో ఉండవచ్చనే ఆశతో ఆయా నేతలు ఇప్పుడు శాసన సభ సీట్లపై గురిపెట్టినట్లు తెలుస్తోంది.  

చూద్దాం... ఓసారి... 
అయితే, గత ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది నేతలు అసెంబ్లీ సీట్లపై దృష్టి సారించారు. వీరిలో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో వరంగల్‌ లోక్‌సభ నుంచి బరిలోకి దిగిన సర్వే సత్యనారాయణ ముందున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి అంశం తెరపైకి వచ్చిన పక్షంలో తాను అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కంటోన్మెంట్‌ (ఎస్సీ) సీటు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ సీటును తొలుత సర్వే అల్లుడు క్రిశాంక్‌కు కేటాయించి చివరి క్షణంలో మార్పు చేశారు. ఈ సారి కూడా క్రిశాంక్‌ పేరే ఇప్పటివరకు వినిపించినా.. తాజాగా సర్వే పేరు బలంగా తెరపైకి వస్తుండటం గమనార్హం.

నల్లగొండ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరైన రాజగోపాల్‌రెడ్డి కూడా మునుగోడు అసెంబ్లీ స్థానంపై పట్టుపడుతున్నారు. గత ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభకు పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆయన ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇదే కోవలోకరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కూడా ఉన్నారు. అయితే, తాను లోక్‌సభకే పోటీచేస్తానని అంటున్నా.. అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీ బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. తొలుత వేములవాడ నుంచి బరిలో ఉంటారని భావించినా.. అక్కడి నుంచి ఆది శ్రీనివాస్, కొనగాల మహేశ్‌ సీటు కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు.

మహేశ్‌ రాష్ట్రస్థాయితో పాటు తనకు ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలతో సీటు తనకే వచ్చేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, అసెంబ్లీ బరిలో దిగాల్చి వచ్చినా వేములవాడ నుంచి పోటీ చేయనని పొన్నం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనివార్యమైతే కరీంనగర్‌ అసెంబ్లీ నుంచి బరిలో ఉండవచ్చని సమాచారం. గత ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్‌ నుంచి పోటీ చేసిన ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి కూడా రాజేంద్రనగర్‌ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈయనకు ఈ సీటు దాదాపు ఖరారయిందనే ప్రచారం గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.

సెటిలర్ల దగ్గరా.. ఖమ్మం ఖిల్లా మీదా..
తాజాగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పేరు కూడా అసెంబ్లీ జాబితాలోకి వచ్చి చేరింది. సెటిలర్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లోని ఏదో ఒక నియోజకవర్గంలో ఆమెను నిలబెట్టాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు ఖమ్మం అసెంబ్లీ బరి నుంచి కూడా ఆమె రంగంలో ఉండే అవకాశముందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జహీరాబాద్‌ లోక్‌సభ నుంచి బరిలో ఉన్న సురేశ్‌షెట్కార్‌ ఈసారి నారాయణ్‌ఖేడ్‌ అసెంబ్లీ స్థానాన్ని, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ మహబూబాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. వీరితో పాటు గతంలో ఎంపీలుగా పోటీ చేసిన మరో ముగ్గురు, నలుగురు నేతలు కూడా అసెంబ్లీ స్థానాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడం గమనార్హం. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోసం ఆ పార్టీ రక్తంలోనే ఉంది

అన్ని రంగాల్లో కేంద్రం విఫలం 

మేనిఫెస్టోలు ఎక్కడ సారూ?

‘కారు’ సీట్లు ఖరారు 

సేనలు ఫైనల్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమయం లేదు

మేం ముగ్గురమయ్యాం

మరో స్టార్‌ కిడ్‌ ఎంట్రీ

గాయపడ్డారు

సక్సెస్‌కి సూత్రం లేదు

శ్రీకాంత్‌ నా లక్కీ హీరో