‘ట్రిపుల్‌ తలాక్‌’కు లోక్‌సభ ఓకే

26 Jul, 2019 04:06 IST|Sakshi

మహిళల ఆత్మగౌరవం, లింగ సమానత్వం కోసమే తెస్తున్నామన్న కేంద్రం

ట్రిపుల్‌ తలాక్‌ చెప్పే పురుషుడికి మూడేళ్ల వరకూ జైలుశిక్ష

అధికార బీజేపీ, విపక్ష పార్టీల మధ్య వాడివేడిగా సాగిన చర్చ

బిల్లును స్థాయీసంఘానికి పంపాలని ప్రతిపక్షాల డిమాండ్‌

ఒప్పుకోని బీజేపీ.. సభ నుంచి విపక్ష పార్టీల వాకౌట్‌

న్యూఢిల్లీ: ముస్లిం మతస్తులు పాటిస్తున్న ట్రిపుల్‌ తలాక్‌ సంప్రదాయాన్ని శిక్షార్హం చేస్తూ రూపొందించిన బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదముద్ర వేసింది. ఇన్‌స్టంట్‌ ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కేంద్రం ముస్లిం మహిళల(వివాహ హక్కుల రక్షణ) బిల్లు–2019ను తీసుకొచ్చింది. కాగా, ఈ బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే ఇతర పార్టీలు వ్యతిరేకించాయి. ఈ బిల్లును పరిశీలించేందుకు వీలుగా స్థాయీ సంఘానికి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయగా, కేంద్రం అంగీకరించలేదు. ఈ సందర్భంగా ఇటు బీజేపీ, అటు విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది.

ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టరాదన్న ప్రతిపక్షాల డివిజన్‌ను 302–82 తేడాతో లోక్‌సభ తిరస్కరించింది. అలాగే ట్రిపుల్‌ తలాక్‌ చెప్పే ముస్లిం పురుషులకు మూడేళ్లవరకూ జైలుశిక్ష విధించే సవరణకు లోక్‌సభ 302–78 మెజారిటీతో ఆమోదం తెలిపింది. ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ తమ ఎంపీలకు విప్‌ జారీచేసింది. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై స్పందించేందుకు మహిళా ఎంపీలైన పూనమ్‌ మహాజన్, అపరజితా సేన్, మీనాక్షి లేఖీలను మోహరించింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశాయి. 16వ లోక్‌సభ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ఆమోదించినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందకపోవడం, ఆర్డినెన్స్‌ గడువు ముగిసిపోవడంతో కేంద్రం మరోసారి బిల్లును ప్రవేశపెట్టింది.

మొహమ్మద్‌ ప్రవక్తే వ్యతిరేకించారు..
సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా ట్రిపుల్‌ తలాక్‌ కేసులు నమోదయ్యాయని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘2017, జనవరి నుంచి ఇప్పటివరకూ 574 ట్రిపుల్‌ తలాక్‌ కేసులు నమోదుకాగా, ఆర్డినెన్స్‌ జారీచేశాక 101 కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపుల నిరోధక చట్టం లేదా గృహహింస చట్టం కింద హిందువులు, ముస్లింలు జైలుకు వెళితే ఎలాంటి ఇబ్బంది లేదు.

కానీ ట్రిపుల్‌ తలాక్‌ విషయంలోనే అభ్యంతరాలు ఎందుకు? ట్రిపుల్‌ తలాక్‌ను నియంత్రించేందుకే ఇందులో మూడేళ్ల జైలుశిక్షను చేర్చాం. ఈ ఆచారాన్ని మొహమ్మద్‌ ప్రవక్త కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లును ఆపేయాలన్న దురుద్దేశంతోనే స్థాయీ సంఘానికి పంపాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. ట్రిపుల్‌ తలాక్‌పై 20 ఇస్లామిక్‌ దేశాల్లో నియంత్రణ ఉంది. భారత్‌లాంటి లౌకికవాద దేశంలో ఎందుకుండకూడదు?’ అని ప్రశ్నించారు. ఈ బిల్లును మహిళల ఆత్మగౌరవం, లింగ సమానత్వం కోసమే తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.

ముస్లిం పురుషులే లక్ష్యం: కాంగ్రెస్‌
ట్రిపుల్‌ తలాక్‌కు జైలుశిక్ష పడేలా చట్టాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు చెప్పలేదని కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ తెలిపారు. ముస్లిం మహిళలతో పాటు భర్తలు వదిలేసిన హిందూ, పార్సీ మహిళలకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. ముస్లింలతో పోల్చుకుంటే హిందువుల్లో విడాకుల కేసులు ఎక్కువని మరో కాంగ్రెస్‌ నేత మొహమ్మద్‌ జాఫ్రి చెప్పారు. ముస్లిం పురుషులను జైలుకు పంపించడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ అన్నది అనాగరికమేననీ, అయితే కేంద్రం తెచ్చిన బిల్లుపై తాము సుముఖంగా లేమని సీపీఎం నేత ఏ.ఎం.షరీఫ్‌ అన్నారు.  

డిప్యూటీ స్పీకర్‌పై ఆజంఖాన్‌ అనుచిత వ్యాఖ్యలు
వివాదాలకు కేరాఫ్‌గా మారిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత ఆజంఖాన్‌ గురువారం నోరు జారారు. లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై చర్చ సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై ఆజంఖాన్‌ మాట్లాడుతుండగా, కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు.  సహనం కోల్పోయిన ఆజంఖాన్‌ నఖ్వీవైపు చూస్తూ..‘మీరు అటూఇటూ కాని మాటలు మాట్లాడవద్దు’ అని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్‌ రమాదేవి స్పందిస్తూ..‘మీరు కూడా అటూఇటూ చూడకుండా స్పీకర్‌ స్థానాన్ని ఉద్దేశించి మాట్లాడండి’ అని కోరారు. వెంటనే ఆజంఖాన్‌ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో సభలో  గందరగోళం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేయగా, ఆజంఖాన్‌ తిరస్కరించారు. రమాదేవి తనకు సోదరిలాంటివారనీ, తప్పుగా మాట్లాడుంటే రాజీనామా చేసేందుకైనా సిద్ధమన్నారు. ఆయన వ్యాఖ్యలను డెప్యూటీ స్పీకర్‌ రికార్డుల నుంచి తొలగించారు. మరోవైపు ఆజంఖాన్‌కు ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ మద్దతుగా నిలిచారు. ఆజంఖాన్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ ఖండించింది.

వివాహవ్యవస్థ నాశనమవుతుంది: ఒవైసీ
కేంద్రం తీసుకొచ్చిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఇస్లామ్‌లో 9 రకాల తలాక్‌ పద్ధతులు ఉన్నాయి. ఒకవేళ ఈ చట్టం ప్రకారం ముస్లిం భర్త జైలుకు వెళితే ఆయన భార్య పోషణను ఎవరు చూసుకోవాలి? మీరు(కేంద్ర ప్రభుత్వం) వివాహ వ్యవస్థనే నాశనం చేయాలనుకుంటున్నారు. ముస్లిం మహిళలను రోడ్డుపై పడేయాలనుకుంటున్నారు. ముస్లిం మహిళల హక్కులపై అంత ప్రేమున్న బీజేపీ ప్రభుత్వం 2013 ముజఫర్‌పూర్‌ అల్లర్లలో అత్యాచారాలకు గురైన ముస్లిం మహిళలకు ఎందుకు న్యాయం చేయట్లేదు. ఈ అకృత్యాలకు సంబంధించి ఇప్పటివరకూ దోషులకు శిక్షపడలేదు. జల్లికట్టును నిషేధిస్తూ చట్టాన్ని తెచ్చిన మీరు ముస్లింల మూకహత్యలను నిరోధిస్తూ చట్టం తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారు. మహిళల హక్కులపై నిజంగా బీజేపీకి అంత ప్రేముంటే ప్రత్యేక విమానంలో తమ మహిళా ఎంపీలను శబరిమలకు తీసుకెళ్లాలి’ అని ఒవైసీ చురకలు అంటించారు.

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ప్రస్థానం
► 2016, ఫిబ్రవరి 5: ట్రిపుల్‌ తలాక్, నిఖా హలా ల, బహుభార్యత్వాల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లలో కక్షిదారులకు సహకరించాల్సిందిగా సుప్రీం కోర్టు అప్పటి అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గిని కోరింది.

► మార్చి 28: మహిళలకు సంబంధించి పెళ్లి, విడాకులు తదితర అంశాలపై అతున్నత స్థాయి కమిటీ నివేదికను సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

► అక్టోబర్‌ 7: ట్రిపుల్‌ తలాక్‌ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసింది. లైంగిక సమానత్వం, లౌకికవాదం ఆధారం గా ఈ ట్రిపుల్‌ తలాక్‌పై పరిశీలన జరపాలని కోరింది.

► 2017, ఫిబ్రవరి 16: ట్రిపుల్‌ తలాక్, నిఖా హలాల పిటిషన్లపై విచారణ జరపడానికి సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.

► మార్చి 27: ట్రిపుల్‌ తలాక్‌ విషయం న్యాయస్థానం పరిధిలోకి రాదని, ఆ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోడానికి వీల్లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది.

► మే 18: ట్రిపుల్‌ తలాక్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వు చేసింది.

► ఆగస్టు 22: ట్రిపుల్‌ తలాక్‌ చట్టవిరుద్ధమంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు దీన్ని చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై చట్టం  చేయాలని ధర్మాసనం కేంద్రానికి సూచించింది.

► డిసెంబర్‌: ట్రిపుల్‌ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ రూపొందించిన ‘ముస్లిం మహిళల బిల్లును లోక్‌సభ ఆమోదించింది.

► 2018, ఆగస్టు 9: కేంద్రం ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు సవరణలు చేసింది. నిందితులకు బెయిలు పొందే అవకాశం కల్పిస్తూ ఈ సవరణలు చేశారు.

► ఆగస్టు 10: ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.అయితే, బిల్లు సభ ఆమోదం పొందలేదు.

► సెప్టెంబర్‌ 19: ట్రిపుల్‌ తలాక్‌పై రూపొందిం చిన ఆర్డినెన్సును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ట్రిపుల్‌ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా ఈ ఆర్డినెన్సును రూపొందించారు.

► డిసెంబర్‌ 31: రాజ్యసభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును మళ్లీ ప్రతిపక్షం అడ్డుకుంది. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని డిమాండు చేసింది.

మరిన్ని వార్తలు