అవిశ్వాస తీర్మానాలపై స్పీకర్ అధికారాలేమిటి?

26 Mar, 2018 20:36 IST|Sakshi

లోక్‌సభలో మంగళవారమైనా అవిశ్వాస తీర్మానాల నోటీసులను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అనుమతిస్తారా? అనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సర్కారు ప్రత్యేక హోదా నిరాకరించినందుకు నిరసనగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై మొదట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ నెల 16న అవిశ్వాస తీర్మానాల నోటీసులను విడివిడిగా ఇచ్చాయి. శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే కూడా కేంద్ర సర్కారుపై ‘అవిశ్వాస’ నోటీసు ఇచ్చారు. సోమవారం మరో జాతీయ పార్టీ సీపీఎం నేత పి.కరుణాకరన్‌ మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్‌సభ సెక్రటేరియట్‌కు సమర్పించారు. 

మొదటి రెండు నోటీసులు ఇచ్చిన రోజు నుంచి లోక్‌సభలో క్రమం తప్పకుండా గందరగోళ పరిస్థితులున్నాయనే కారణంతో స్పీకర్‌ వాటిని ప్రవేశపెట్టే విషయమై సభ అనుమతి కోరే ప్రయత్నం చేయలేదు. సభ సజావుగా ఉంటేనే అవిశ్వాస తీర్మానాల అనుమతి కోసం ఇచ్చిన నోటీసులకు అవసరమైన 50 మంది సభ్యుల మద్దతు ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవడం సాధ్యమౌతుందని స్పీకర్‌ మొదట్నించీ చెబుతూనే ఉన్నారు. దాదాపు నాలుగేళ్ల నరేంద్ర మోదీ సర్కారుపై అవిశ్వాసం ప్రకటించడానికి ఇచ్చిన నోటీసులను స్పీకర్‌ సభ ముందు ఉంచకుండా ఇన్నాళ్ల పాటు వాయిదా వేస్తూ రావడం సబబు కాదనే వాదనలు ముందుకొస్తున్నాయి. ఈ విషయంపై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ పదవి నిర్వహించిన ముగ్గురు ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకుందాం.

స్పీకర్‌దే బాధ్యత: పీడీటీ ఆచారి
అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చాక అదే రోజు వాటిని లోక్‌సభలో స్పీకర్‌ చేపట్టాలని 14, 15వ లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ పీడీటీ ఆచారి అభిప్రాయపడ్డారు. అవిశ్వాస తీర్మానం నిబంధనల ప్రకారమే పద్ధతిగా ఉన్నదీ, లేనిదీ పరిశీలించడం ఒక్కటే సభాపతి బాధ్యత అనీ, తర్వాత తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చేది సభేగాని స్పీకర్‌ కాదని ఆయన తన తాజా వ్యాసంలో వివరించారు. ‘‘ మరే ఇతర వ్యవహారానికైనా సభ ముందుకు రావడానికి పూర్వం స్పీకర్‌ అనుమతి అవసరం. అవిశ్వాస తీర్మానం నోటీస్‌ విషయంలో స్పీకర్‌ అది తనకు అందిన వెంటనే దాన్ని సభ అనుమతి కోసం చేపట్టాలి. ఈ ప్రక్రియ ప్రారంభించి పూర్తిచేయకుండా మరే ఇతర విషయాలను (బిల్లులు, తీర్మానాలు) సభ చేపట్టి పూర్తిచేయకూడదు’’ అని ఆచారి పేర్కొన్నారు. 

‘‘అధికారంలో ఉన్న ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి ప్రతి లోక్‌సభ సభ్యుడికి హక్కు ఉంది. ఏ సభ్యుడు లేదా సభ్యురాలు ఇచ్చే నోటీసు సక్రమంగా ఉన్నదీ, లేనిదీ మాత్రమే స్పీకర్‌ చూడాలి. చర్చను చేపట్టడానికి అనుమతించడానికి లేదా అనుమతించక పోవడానికి స్పీకర్‌కు అధికారం లేదనే నిబంధనలు చెబుతున్నాయని’’  ఆచారి అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై మొదటి అవిశ్వాస తీర్మానం నుంచి కిందటి తీర్మానం నోటీసు వరకూ జరిగింది పరిశీలిస్తే ఈ ప్రక్రియనే సభాపతులందరూ అనుసరించారని స్పష్టమౌతోందని ఆయన తెలిపారు.

అవిశ్వాస నోటీసు అందగానే సభ ముందుంచాలి: సుభాష్‌ కశ్యప్‌
అవిశ్వాస తీర్మానం నోటీసు అందిన వెంటనే దాన్ని సభ ముందు పెట్టి, దానికి 50 మంది సభ్యుల మద్దతు ఉన్నదీ, లేనిదీ పరీక్షించడం పార్లమెంటరీ సంప్రదాయమని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌  చెప్పారు. ‘‘అయితే, సభలో గందరగోళ పరిస్థితులుంటే నోటీసుకు అనుకూలంగా ఎంత మంది ఉన్నదీ లెక్కించడం కష్టమే. ఇదో సాంకేతిక సమస్య. సభలో రభస కారణంగా నోటీసును చేపట్టకపోవడానికి ఏ ఒక్క వ్యక్తినీ నిందించలేం. ఎంపీలు స్పీకర్‌ మాట వినే మూడ్‌లో ఉండాలి. కానీ, తీర్మానాన్ని తప్పకుండా చేపట్టడమే సంప్రదాయం’’ అని ఆయన స్పష్టం చేశారు. 

అవిశ్వాస తీర్మానం అత్యంత గంభీర అంశం: ఎస్‌.సీ.మల్హోత్రా 
సభలో గొడవ జరుగుతోందనే కారణంతో పది రోజులుగా అవిశ్వాస తీర్మానాల నోటీసులను స్పీకర్‌ చేపట్టకపోవడాన్ని గతంలో లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన మరో ప్రముఖుడు ఎస్‌.సీ.మల్హోత్రా సమర్ధించారు. ‘‘ ఏ విషయం చేపట్టాలన్నా సభలో పరిస్థితి బావుండాలి. అవిశ్వాస తీర్మానం వంటి అత్యంత గంభీర అంశానికి ఇది మరీ అవసరం. ప్రస్తుత ప్రతిష్టంభనకు రాజకీయపక్షాల నేతలు ప్రధాన బాధ్యులు. తర్వాత ప్రభుత్వం, స్పీకర్‌కు అందులో వాటా ఉందని’’ ఆయన అన్నారు. అవిశ్వాస నోటీసులను సభ చేపట్టకుండా పాలకపక్షం మరి కొన్ని ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్మయితే సభలో రభస జరుగుతోందనే నెపంతో నిరవధికంగా అవిశ్వాస తీర్మానం నోటీసును పరిశీలనకు చేపట్టకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చివరికి ఎటు పోతుందనే కీలక ప్రశ్న తలెత్తుతోంది.
(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

మరిన్ని వార్తలు