ముందస్తుకు సంకేతమా?

19 Jul, 2018 02:39 IST|Sakshi

అవిశ్వాసంపై చర్చకు బీజేపీ అంగీకరించడంపై ఊహాగానాలు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టడానికి కేంద్రం అంగీకరించడంతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరిపే విశేష అధికారం ప్రధానికే ఉన్నా, చివరి నిమిషం లెక్కలను బేరీజు వేసుకుని ఆ దిశగా అడుగేసే అవకాశాలున్నాయి. 2019 సాధారణ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించడానికి ఇంకా 7–8 నెలల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో మోదీ ఆలోచన ఏంటో ఊహించడం కష్టమని, ఏదైనా జరగొచ్చని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఒకరు వెల్లడించారు. మరోవైపు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతో పాటే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలను బీజేపీ వర్గాలు తోసిపుచ్చాయి. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులపై చర్చ తప్ప, ముందస్తు ఎన్నికలపై ఆలోచించడం లేదని కేంద్ర మంత్రి ఒకరు తెలిపారు.

జాగ్రత్తగా పరిశీలిస్తున్న కాంగ్రెస్, లెఫ్ట్‌..
ఇటీవల ప్రధాని మోదీ వరుసగా యూపీలో పర్యటించిన సంగతిని విపక్షాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు బీజేపీ అన్ని అవకాశాలను సిద్ధం చేసుకుంటోందా? అని కాంగ్రెస్, లెఫ్ట్‌లో అంతర్మథనం మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రచారం, ప్రచారకర్తకు ఎదురయ్యే సమస్యలు ముందుగానే తెలుస్తాయని లెఫ్ట్‌ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీకి తగిన రాజకీయ అస్త్రాలు ఉన్నట్లయితే ఇతర పార్టీలు స్పందించేందుకూ అవకాశం ఇచ్చేదని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ‘సంపర్క్‌ కే సమర్థన్‌’ పేరిట ప్రముఖులతో సమావేశమై ఎన్డీయే ప్రభుత్వ విజయాలను వివరిస్తున్నారు. సుమారు 100 మంది సిట్టింగ్‌ ఎంపీలు ఈసారి అవకాశం కోల్పోవచ్చని అమిత్‌ షా పర్యటనల్లో తెలిసినట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆరెస్సెస్‌ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు