చంద్రబాబు కోర్టుకు వెళ్తారు : లోకేశ్‌

13 Sep, 2018 14:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతీ అంశంలోనూ ఆంధ్రప్రదేశ్‌ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తారన్న విషయం ఇప్పటికే  ఎన్నోసార్లు బహిర్గతమైంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు... తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర విభజన న్యాయంగా జరుగలేదని,  ఈ విషయంలో తప్పంతా కాంగ్రెస్ పార్టీదేనని తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత అధికారం చేజిక్కించుకునేందుకు మరో జాతీయ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యమవుతుందంటూ ఉద్యమం ఉధృతమైన వేళ.. హోదా కంటే ప్యాకేజీ ద్వారానే లాభం చేకూరుతుందంటూ చంద్రబాబు ఏపీ ప్రజలను వంచించారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తూండటంతో.. బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకున్నామంటూ బాబు మరో కొత్త నాటకానికి తెరలేపారు. మరోసారి అధికారం చేజిక్కుంచుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీతో అనైతిక పొత్తుకు సిద్ధపడ్డారు. తాజాగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరోసారి తెలంగాణ ప్రజలకు తమ పార్టీ పట్ల నమ్మకం కలిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈ సారి ఆ బాధ్యత చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి లోకేశ్‌ బాబు తలకెత్తుకున్నారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, ముందస్తు ఎన్నికల విషయమై వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఓ కేసు విషయమై ధర్మాబాద్‌ కోర్టుకు చంద్రబాబు హాజరుకావాలంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో లోకేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ధర్మాబాద్‌ కోర్టుకు వెళ్తారు...
మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2010లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు.. మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే ఈ కేసు విషయమై మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనుందని ఓ హిందీ పత్రిక గురువారం కథనాన్ని వెలువరించింది.

తెలంగాణ ప్రయోజనాల కోసమే..
ఈ విషయంపై స్పందించిన లోకేశ్‌ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఆనాడు పోరాటం చేశారని వ్యాఖ్యానించారు. ధర్మాబాద్‌ పోరాటంలో టీడీపీ తెగువ ప్రజలు చూశారని,  ప్రజల సంక్షేమం పట్ల చంద్రబాబుకు ఎంతో నిబద్ధత ఉందన్నారు. ఆనాడు అరెస్టు చేసినా చంద్రబాబు వెనక్కి తగ్గలేదని, అన్యాయంగా అరెస్టు చేసినందుకు బెయిలు కూడా తిరస్కరించారని తెలిపారు. ఒకవేళ నిజంగానే నోటీసులు పంపిస్తే చంద్రబాబు కోర్టుకు హాజరవుతారని పేర్కొన్నారు. దీంతో ఏ విషయాన్నైనా సరే తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ నేతలకు ఎవరూ సాటి రాలేరంటూ విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు