‘నమో’ జపానికి ఈ ఎన్నికలే ఆఖరు

26 Apr, 2019 03:04 IST|Sakshi
వేదికపై మాయావతికి నమస్కరిస్తున్న డింపుల్‌

కన్నౌజ్‌: ‘నమో నమో’అని జపించే వారికి ఇవే ఆఖరి ఎన్నికలని, ఈ లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో మోదీ పేరు వినపడదని బహుజన సమాజ్‌ పార్టీ చీఫ్‌ మాయావతి అన్నారు. ఈ ఎన్నికల్లో తమ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్, ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు అజిత్‌ సింగ్‌తో కలిసి కన్నౌజ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి అఖిలేష్‌ సతీమణి డింపుల్‌ ఎస్పీ–బీఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

డింపుల్‌ను తన కోడలిగా సంబోధించిన మాయావతి.. ఆమెను మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఉత్తరప్రదేశ్‌లో తమ కూటమి దేశానికి కొత్త ప్రధానిని అందిస్తుందని అఖిలేష్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశాలు అంటే బీజేపీకి భయమని.. అందుకే మోదీసహా ఆ పార్టీ నేతలు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లకు హాజరుకాకుండా పారిపోతున్నారన్నారు. జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే వారు ఇలా తప్పించుకు తిరుగుతారని ఎద్దేవా చేశారు. అందుకే బీజేపీ పేరును ‘భాగ్తీ జనతా పార్టీ’గా మార్చాలని తెలుపుతూ ట్వీట్‌ చేశారు.   


మాయావతి సభ ముందు ఎద్దు వెంటపడటంతో తప్పించుకోబోయి పడిపోయిన పోలీస్‌

మరిన్ని వార్తలు