ప్రభుత్వం వర్సెస్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌

27 Dec, 2017 09:28 IST|Sakshi
ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌(ఎడమ), ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(కుడి)

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టదలుచుకున్న ‘హోం డెలివరీ’ పథకానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) అనిల్‌ బైజల్‌ పథకం అమలుకు నో చెప్పడంతో ఢిల్లీ ప్రభుత్వం షాక్‌కు గురైంది. దీంతో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఎల్‌జీపై ట్విట్టర్‌ వేదికగా విరుచుకుపడ్డారు.

ప్రభుత్వం ఎన్నో ప్రయాసలకు ఒనగూర్చి ప్రజలకు మంచి చేద్దామనుకుంటే అనిల్‌ బైజల్‌ అడ్డుతగులుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు సక్రమమైన పాలన అందించడం ఎల్‌జీకి ఇష్టం లేదని అన్నారు. అందుకే అవినీతి రహిత పాలనను అందించాలనుకుంటున్న ప్రభుత్వానికి అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ప్రజా అవసరాలు కలిగి ఉన్న విషయాల్లో ఎల్‌జీ అధికారాలు ఉండటం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు.

ఈ సమస్య వల్ల కేజ్రీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం వద్ద మళ్లీ కోల్డ్‌ వార్‌ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పథకాన్ని తిరస్కరించలేదని, కేవలం పునః సమీక్షించమని కోరినట్లు ఎల్‌జీ కార్యాలయం మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఏంటీ ‘హోం డెలివరీ’ పథకం
హోం డెలివరీ పథకాన్ని నెల రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న బేసిక్‌ సర్వీసుల నుంచి పథకాల వరకూ ప్రజల ఇళ్లకు వెళ్లి సర్వీసులు అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. కేజ్రీవాల్‌ పథకాన్ని ప్రకటించిన అనంతరం ఢిల్లీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న 40 రకాల సర్వీసుల్లో 35 సర్వీసులను హోం డెలివరీ పథకం కిందకు తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఆన్‌లైన్‌ సర్వీసులు ఉన్నాయి కదా..?
ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులో ఉండగా హోం డెలివరీ పథకం ప్రాముఖ్యం ఏంటని ఎల్‌జీ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆన్‌లైన్‌ సర్వీసులు ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయని పేర్కొంది. హోం డెలివరీ పథకం వల్ల ప్రజలు గంటల కొద్దీ ప్రభుత్వ కార్యాలయాల్లో నిల్చొవాల్సిన బాధ తప్పుతుందని చెప్పింది.

>
మరిన్ని వార్తలు