బందరు బాద్‌షా ఎవరో?

29 Mar, 2019 08:01 IST|Sakshi
వల్లభనేని బాలశౌరి, కొనకళ్ల నారాయణరావు

మచిలీపట్నం పార్లమెంటరీ  ముఖచిత్రం

సాక్షి,మచిలీపట్నం :  మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలో స్థూలంగా వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అవనిగడ్డ, మచిలీపట్నం ప్రాంతాల్లో మత్స్యకారుల జనాభా అధికం. 1952 నుంచి 16 సార్లు ఎన్నికలు జరగ్గా, తొమ్మిది సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీ గెలిచాయి. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కోసారి ప్రాతినిధ్యం వహించారు. మచిలీపట్నం లోకసభకు తొలిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి సనక బుచ్చికోటయ్య ఎంపీగా ఎన్నికయ్యారు.

1957లో కాంగ్రెస్‌ అభ్యర్థి మండలి వెంకట కృష్ణారావు, 1962లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మండల వెంకటస్వామి విజయం సాధించారు. ఈ నియోజకవర్గ పరిధిలో గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు గెలుపొందారు. మరోసారి ఆయననే టీడీపీ బరిలోకి దించింది. మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి వైఎస్సార్‌సీపీ నుంచి బరిలో ఉన్నారు.

అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితి..
పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెచ్చుమీరిన అంతర్గత విభేదాల వల్ల టీడీపీ బలహీనపడింది. దీంతో ఈసారి ఎంపీగా గెలవడం కష్టమని భావించిన కొనకళ్ల నారాయణ పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చివరి వరకూ ప్రయత్నించినా కుదర్లేదు. పైగా పార్లమెంటు పరిధిలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంశీపై సొంత సామాజికవర్గంలోని వ్యతిరేకత ఏర్పడింది.

బలమైన కేడర్‌ ఉన్న దాసరి జైరమేష్, బాలవర్ధన్‌రావు వైఎస్సార్‌సీపీలో చేరడం టీడీపీకి భారీ దెబ్బ. గుడివాడ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను టీడీపీ బరిలోకి దించింది. స్థానికేతరుడైన అవినాష్‌ను ఈ నియోజకవర్గ ఓటర్లు ఆదరించే పరిస్థితి లేదు. బలమైన నాయకుడైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొడాలినాని ముందు అవినాష్‌ తేలిపోయారు. ఇక పెడనలో మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్‌ టీడీపీ టికెట్‌ కోసం బాగా ప్రయత్నించారు.

చివరకు కాగిత కృష్ణప్రసాద్‌కు అక్కడ టీడీపీ టికెట్‌ ఇవ్వడంతో వేదవ్యాస్‌ వర్గం ఎన్నికల్లో సహకరించే పరిస్థితి లేదు. ఇక్కడ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి జోగిరమేష్‌ దూసుకుపోతున్నారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి కొల్లురవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిందేమీ లేదనే విమర్శలున్నాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య(నాని) నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

అవనిగడ్డలో టీడీపీ నేత అంబటి శ్రీహరి ప్రసాద్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు కుమారుడి అవినీతి అక్రమాలతో బాగా చెడ్డపేరు వచ్చింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌ బరిలో ఉన్నారు. పామర్రు(ఎస్సీ)లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను టీడీపీ బరిలోకి దించింది. దీంతో ఓ సామాజిక వర్గం అలకబూనింది. అవినీతి అక్రమాలకు పాల్పడటంతో ఆమె పట్ల ప్రజల్లోనూ వ్యతిరేకత ఏర్పడింది.

ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌ పోటీగా బరిలోకి దిగారు. పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ బరిలో మరోసారి టీడీపీ అభ్యర్థిగా బోడెప్రసాద్‌ బరిలో ఉన్నారు. కాల్‌మనీ వ్యవహారం, దౌర్జన్యాలు నియోజకవర్గ పరిధిలో మితిమీరిపోయాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు.

రాజన్న మాట.. అభివృద్ధి బాట
దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులకు బీజం వేశారు. కృష్ణా డెల్టా ఆధునీకీకరణ పనుల్లో భాగంగా బందరు కాలువ డ్రయినేజీ పనులు చేపట్టారు. నూజివీడులో 2008లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేశారు. గన్నవరం మండలంలోని కేసరపల్లిలో ఏపీఐఐసీ, ఎల్‌అండ్‌టీ సంయుక్త సౌజన్యంతో నిర్మించిన ఐటీపార్కు మొదటి టవర్‌లో 14 కంపెనీలు పూర్తిస్థాయిలో కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి.

ప్రస్తుతం 1,500 మంది ఐటీ విద్యార్థులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఆ ప్రాంత ప్రజల దశాబ్ధాల కల అయిన బందరు పోర్టు ఏర్పాటుకు 2008 ఏప్రిల్‌ 23న రూ. 1,500 కోట్లతో ఆయన శంకుస్థాపన చేశారు. వైఎస్సార్‌ మరణించడంతో మళ్లీ బందరు పోర్టు వ్యవహారం మరుగునపడింది. తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు బందరు పోర్టును నిర్మిస్తామని గొప్పగా ప్రకటించారు. అయితే పోర్టు పేరుతో 1.05 లక్షల ఎకరాల రైతుల భూములు తీసుకొని కార్పొరేట్, విదేశీ కంపెనీలకు ధారదత్తం చేయడానికి ఎత్తుగడ వేశారు. – ఎం. రామ్మోహన్‌ సాక్షి, అమరావతి బ్యూరో

వల్లభనేని బాలశౌరి (వైఎస్సార్‌సీపీ)
2004లో కాంగ్రెస్‌ నుంచి తెనాలి లోక్‌సభ(2009 ప్రాదేశిక పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పుడు లేదు) ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. ఈయన వ్యాపారవేత్త. ఆయన ఎన్నో కళాశాలలను నెలకొల్పారు. రక్షణ, వాణిజ్య విభాగం పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా సేవలు అందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

కొనకళ్ల నారాయణరావు(టీడీపీ)
ఈయన ఎంపీగా ఉన్న సమయంలోనే రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చింది. ఆ సమయంలో ఆయన సరిగా వాదన వినిపించలేదని అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఏనాడు బందరు పోర్టు పనుల గురించి మాట్లాడకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలున్నాయి.

మొత్తం ఓటర్లు 14,29,861
పురుషులు 7,01,396
మహిళలు 7,28,355
ఇతరులు 110

మరిన్ని వార్తలు