మడకశిర ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక రద్దు 

28 Nov, 2018 05:02 IST|Sakshi
ఈరన్న , తిప్పేస్వామి

తీర్పు వెలువరించిన హైకోర్టు ధర్మాసనం  

మడకశిర ఎమ్మెల్యేగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిప్పేస్వామి ఎన్నికైనట్లు హైకోర్టు ప్రకటన  

సాక్షి, హైదరాబాద్‌/పలమనేరు: అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే కె.ఈరన్నకు(తెలుగుదేశం పార్టీ) హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. మడకశిర ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికను రద్దు చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఈరన్న తనపై ఉన్న కేసుల వివరాలను, భార్య ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాలను పొందుపరచకపోవడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. ఇలా చేయడం వాస్తవాలను దాచిపెట్టడమేనని తేల్చిచెప్పింది. ఇందుకు గాను ఆయన ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేగా కొనసాగేందుకు ఎంతమాత్రం అర్హుడు కాదని స్పష్టం చేసింది. ఈరన్న ఎన్నికను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈరన్నపై పోటీ చేసి ఓడిపోయిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మోపురగుండు తిప్పేస్వామి మడకశిర ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తాళ్లూరి సునీల్‌ చౌదరి మంగళవారం సంచలన తీర్పును వెలువరించారు. 

2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కె.ఈరన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిప్పేస్వామిపై విజయం సాధించారు. ఈరన్న ఎన్నికల అఫిడవిట్‌లో తనపై ఉన్న కేసుల వివరాలను, భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్ని దాచిపెట్టి నామినేషన్‌ వేశారని, ఈ నేపథ్యంలో ఈరన్న ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ తిప్పేస్వామి 2014 జూన్‌ 28న హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ (ఈపీ) దాఖలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్‌లో తనపై ఉన్న కేసులు, కుటుంబ సభ్యుల వివరాలను తెలియజేయాలని తిప్పేస్వామి కోర్టుకు నివేదించారు. 

ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదు  
ఉద్దేశపూర్వకంగా తాను ఇలా చేయలేదని, నామినేషన్‌ పత్రాన్ని పూరించే వ్యక్తులు చేసిన తప్పిదం వల్లే కేసు వివరాలను పొందుపరచలేదని కె.ఈరన్న హైకోర్టుకు వివరణ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తనకు చివరి నిమిషంలో బీ ఫాం ఇచ్చిందని, అందువల్ల ఎన్నికల అఫిడవిట్‌లో అన్ని వివరాలను ప్రస్తావించిందీ లేనిదీ చూసుకోలేదని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసే నాటికి తన భార్య ప్రభుత్వ ఉద్యోగి అని, ఆ తరువాత ఆమె విధులకు హాజరు కావడం మానేశారని, అనంతరం రాజీనామా చేశారని, అందువల్ల ఆమెకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచలేదని పేర్కొన్నారు. కర్ణాటకలోని కొడగ్‌ పోలీస్‌స్టేషన్‌లో తనపై 2002లో నమోదైన కేసు సాధారణ కేసని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్ట పరిధిలోకి రాదని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్రను తెలుసుకునేందుకే కేసుల వివరాలను పొందుపరచాలన్న నిబంధన పెట్టారని, తాను నేర చరితుడను కాదని నియోజకవర్గ ప్రజలకు తెలుసని ఈరన్న చెప్పారు.

ఈరన్న వాదనను తోసిపుచ్చిన కోర్టు  
తిప్పేస్వామి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి మంగళవారం తీర్పును వెలువరించారు. ఈరన్న వాదనలన్నింటినీ న్యాయమూర్తి తోసిపుచ్చారు. నామినేషన్‌ దాఖలు చేసే నాటికి ఇవ్వాల్సిన వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. తెలిసిన వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనకపోవడాన్ని వాస్తవాలను దాచిపెట్టడం గానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఈ కేసులో ఈరన్న కూడా ఇదే రీతిలో వ్యవహరించారని, కొడగ్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలు, భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించలేదన్నారు. ఇలా వాస్తవాలను దాచిపెట్టినందుకు ఈరన్న ఎన్నికను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాక నిబంధనల మేరకు పిటిషనర్‌ తిప్పేస్వామి మడకశిర ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ప్రకటిసున్నట్టు తెలిపారు. 

ఎట్టకేలకు న్యాయమే గెలిచింది: తిప్పేస్వామి 
మడకశిర ఎమ్మెల్యే ఈరన్న ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడంతో ఎట్టకేలకు న్యాయమే గెలిచిందని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి పేర్కొన్నారు. ఆయన మంగళవారం చిత్తూరు జిల్లా పలమనేరులో మీడియాతో మాట్లాడారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈరన్నపై పలు క్రిమినల్‌ కేసులున్నాయని, వాటిలో ఆయనకు శిక్ష కూడా పడిందని, ఆ విషయాన్ని అఫిడవిట్‌లో చూపకుండా ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తాను తెలియజేశానని అన్నారు. తన ఫిర్యాదును అప్పటి ఎన్నికల అధికారి పరిగణనలోకి తీసుకోలేదని, దాంతో హైకోర్టులో ఎన్నికల వ్యాజ్యం దాఖలు చేశానన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈరన్న ఎన్నిక చెల్లదంటూ తీర్పుచెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఈరన్న ఎన్నిక రద్దుతో రెండోస్థానంలో ఉన్న తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టేనని పేర్కొన్నారు. కోర్టు నుంచి తీర్పు ప్రతి అందగానే స్పీకర్‌ను కలుస్తానని తెలిపారు. తిప్పేస్వామి అభిమానులు పలమనేరులో  బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు