అభివృద్ధే నా లక్ష్యం

1 Apr, 2019 11:41 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్రజలకు శ్రీరామరక్ష

టీడీపీ వైఫల్యాలు, భూకబ్జాలే మా ప్రచార అస్త్రాలు

వైఎస్‌ జగన్‌ సీఎం కావడం చారిత్రక అవసరం

మదనపల్లె వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మహమ్మద్‌ నవాజ్‌ బాషా

చిత్తూరు, మదనపల్లె : మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని మహమ్మద్‌ నవాజ్‌ బాషా స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి విధేయత కలిగిన కార్యకర్తగా, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందిన మైనారిటీ కోటా కింద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవాజ్‌ బాషా తెరపైకి వచ్చారు. నవాజ్‌బాషాకు సీటు కేటాయింపుపై జిల్లాలోని ముస్లిం వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ పడుతున్న నవాజ్‌ బాష సాక్షితో పంచుకున్న అంతరంగం.

ప్రశ్న: రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఎలా ?
జవాబు: చిన్నప్పటి నుంచీ లీడర్‌షిప్‌ అంటే నాకు చాలా ఇష్టం. చదువుకునేటప్పుడు క్లాస్‌ లీడర్‌గా, స్నేహితుల్లో ఏ అవసరమొచ్చినా ముందుండి చూసుకునేవాణ్ణి. కష్టపడే తత్వం. పేదలకు సహాయపడాలన్న తపన. పదిమందిని ఆదుకోవచ్చన్న కారణంతోనే రాజకీయాలపై ఆసక్తి పెరిగింది.

ప్రశ్న: సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారా ?
జవాబు మనకు ఉన్నంతలో తోటివాళ్లకు సహాయపడాలని, పదిమందికి మంచి చేసినప్పుడే అల్లా మనల్ని చల్లగా చూస్తాడని మానాన్న చెప్పేవారు. ఆయన చెప్పిన మాటలు నా మనస్సులో అలాగే నిలిచిపోయాయి. ప్రతి సంవత్సరం పేద పిల్లలకు పుస్తకాల పంపిణీ, డిగ్రీ, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు ఫీజు చెల్లింపు, ప్రతి సంవత్సరం కుటుంబం ఆధ్వర్యంలో జరిగే ఉచిత సామూహిక వివాహాలకు సహాయం అందించడం. ఇవన్నీ ఎవరికీ తెలియకుండా చేయడం జరిగింది. సందర్భం రావడంతో తప్పక చెబుతున్నా.

ప్రశ్న: స్థానికంగా మీరు గుర్తించిన సమస్యలు..
జవాబు ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా పేరుమోసిన మదనపల్లె మార్కెట్‌యార్డులో రైతులకు కనీస వసతులు లేవు. గిట్టుబాటు ధర లభించక అనేకమార్లు రోడ్లపై టమాటాలు వేసి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. రామసముద్రం మండలంలో తాగునీటి సమస్య. బోర్లు వేసేందుకు డార్క్‌ఏరియా నిబంధనలు. నిమ్మనపల్లె మండలంలో కనిపిస్తున్న కరువు ఛాయలు, విద్య, వైద్యం అందని గ్రామాలు, నీరుగట్టువారిపల్లె చీరలకు గుర్తింపు, చేనేతలకు సబ్సిడీ పుస్తకాలు, గుర్తింపుకార్డులు లేకపోవడం, మగ్గాల ఇళ్లకు కమర్షియల్‌ పన్నులు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య అ«ధ్వాన్న పరిస్థితులు.

ప్రశ్న: ఎలా పరిష్కరిస్తారు ?
జవాబు టమాటా రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కోల్డ్‌స్టోరేజ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి ధర లేని సమయంలో నిల్వ చేసుకునే సదుపాయాలు కల్పిస్తాం. రామసముద్రంలో డార్క్‌ ఏరియా నిబంధనను తొలగించి, హంద్రీ–నీవా జలాలను తరలించే ప్రయత్నం చేస్తాం. పట్టణంలో వెళ్తున్న బాహుదాను హంద్రీ–నీవాకు అనుసంధానం చేసి మండలంలోని చెరువులన్నింటికీ నీటిని తరలించే ఏర్పాటు చేస్తాం. సమ్మర్‌స్టోరేజీల్లో హంద్రీ–నీవా నీటిని నిల్వ చేసి పైపులైన్‌ ద్వారా సరఫరా చేసి నీటిఎద్దడి లేకుండా చూస్తాం.

ప్రశ్న: గెలుపునకు దోహదపడే అంశాలేవి ?
జవాబు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, జన్మభూమి కమిటీ సభ్యుల దౌర్జన్యాలు, నీరు–చెట్టు, ప్రతి పనిలోనూ అవినీతి, సామాన్య ప్రజలకు చేరువ కాని సంక్షేమ పథకాలు తదితరాలను అస్త్రాలుగా ఉపయోగించుకుని ప్రజల్లోకి వెళ్తాం. పేదప్రజల సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ పెట్టిన నవరత్నాలను ఇంటింటికీ తెలియజేస్తాం. జగనన్న ముఖ్యమంత్రి అయితే రాజన్న పాలన తీసుకువస్తారనే నమ్మకాన్ని కలగజేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో జగనన్న ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరం.

మరిన్ని వార్తలు