‘కుమారస్వామికి ఆఫర్‌ ఇచ్చింది మేమే’

21 May, 2018 14:57 IST|Sakshi
సాక్షి టీవీతో మాట్లాడుతున్న మధు యాష్కీ

సాక్షి, న్యూఢిల్లీ: కామన్ మినిమమ్ ప్రొగ్రామ్ ఆధారంగా కర్ణాటకలో తమ ప్రభుత్వం కొనసాగుతుందని కర్ణాటక కాంగ్రెస్ సహాయ ఇన్‌చార్జి, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీతెలిపారు. కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చింది తామేనని, తమ పార్టీ సీఎం పదవి అడగబోదని వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మళ్లీ కాంగ్రెస్ సీఎం అనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. మంత్రివర్గ కూర్పు దామాషా పద్ధతిలో ఉంటుందన్నారు. దూరదృష్టితో తమ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం సజావుగా నడించేందుకు సమన్వయ కమిటీని నియమించనున్నట్టు చెప్పారు. ఐదేళ్ళ పాటు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొవాలంటే కాంగ్రెస్‌ త్యాగం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కుమారస్వామికి సీఎం సీటు ఎర కాదని మధు యాష్కీ స్పష్టం చేశారు. బీజేపీని అడ్డుకోవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీని కలిసేందుకు కుమారస్వామికి ఢిల్లీకి వచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ఆయన చర్చించనున్నారు. బుధవారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్‌ను కుమారస్వామి ఆహ్వనించనున్నారు.

మరిన్ని వార్తలు