మోదీ గులాం కేసీఆర్‌!

8 Oct, 2018 01:11 IST|Sakshi

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ ధ్వజం

సాక్షి, జగిత్యాల:  ప్రధాని నరేంద్ర మోదీ గులాం కేసీఆర్‌ అని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ అన్నారు. మైనార్టీల గురించి ఏనాడూ పట్టించుకోని ఎంఐఎం పార్టీ సైతం కేసీఆర్‌కు తోడైందని విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత.. ఐదేళ్లు పాలించమని రాష్ట్ర ప్రజ లు అధికారం అప్పగిస్తే.. పాలన చేతకాక తొమ్మిది నెలల ముందే అస్త్ర సన్యాసం చేసిన అసమర్థుడు కేసీఆర్‌ అని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించడం ద్వారా తెలంగాణలో గడీల పాలనను అంతం చేయాలని ప్రజలను కోరారు.  సకల జనుల ఆకాంక్షను అర్థం చేసుకున్న సోనియా గాంధీ నాడు మిగులు బడ్జెట్‌తో ఇచ్చిన  రాష్ట్రాన్ని నేడు కేసీఆర్‌ అప్పుల పాలు చేశారని విమర్శించారు.  

కవితపై ప్రశ్నల వర్షం..
ఒకప్పుడు ఓ అపార్ట్‌మెంటులో ఉన్న చెల్లెమ్మ (ఎంపీ కవిత) ఇప్పుడు రూ.40 కోట్ల విలువ చేసే విల్లాకు ఎలా మారారో సమాధానం చెప్పాలని మధుయాష్కీ అన్నారు. ‘నువ్వు బతుకమ్మ పేరిట బతుకు నేర్చుకున్నవ్‌. నీ జీవితాన్ని బంగారుమయం చేసుకున్నవ్‌. నీ జాగృతి చిట్టా విప్పు’ అని డిమాండ్‌ చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుంట్ల కబంద హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని, ఆ బాధ్యతను ప్రజలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు