బీ–ఫాం వచ్చినట్టు తెలుసు.. గెలిచినట్టు తెలియదు!

20 Mar, 2019 09:22 IST|Sakshi
మధుసూదన్‌రెడ్డి దంపతులు (ఫైల్‌)

సాక్షి, ఆదిలాబాద్‌: తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ పిలుపునకు పదవిని తృణప్రాయంగా వదిలేసిన ఉద్యమకారుల్లో తక్కల మధుసూదన్‌రెడ్డి ఒకరు. 2004 నుంచి 2008 వరకు టీఆర్‌ఎస్‌ నుంచి ఆదిలాబాద్‌ ఎంపీగా ఉన్నారు. 2008లో కేసీఆర్‌ పిలుపునకు కట్టుబడి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఆయన ఓటమి పాలయ్యారు. అప్పట్లో ఆయన జీవితంలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో జనరల్‌ రిజర్వేషన్‌ కేటగిరీలో ఉన్న ఆదిలాబాద్‌ నుంచి టి.మధుసూదన్‌రెడ్డి పేరును కేసీఆర్‌ ఖరారు చేశారు. 2004 మార్చి 7న ఆదిలాబాద్‌ నుంచి తన భార్య టి.భూలక్ష్మితో కలిసి బీ–ఫాం తీసుకునేందుకు హైదరాబాద్‌ వెళ్తున్న మధుసూదన్‌రెడ్డి దంపతులు ప్రయాణిస్తున్న కారును తూప్రాన్‌ వద్ద లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో భూలక్ష్మి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు.

వాస్తవానికి మధుసూదన్‌రెడ్డి బీ–ఫాంలో ప్రపోజల్‌లో ఆయన భార్య పేరు ఉండేది. అయితే ప్రమాదంలో గాయపడి ఆమె ఆస్పత్రిలో కోమాలో ఉండిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లోనే గుండె దిటవు చేసుకుని మధుసూదన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. ఆయనకు టికెట్‌ దక్కిన విషయం మాత్రమే అంతకు ముందు భార్య భూలక్ష్మికి తెలుసు. ఆ తర్వాత ఆయన ఎంపీగా గెలుపొందడం, 2008 వరకు పదవిలో ఉన్న విషయాలేవీ ఆమె ఎరుకలో లేవు. ప్రమాదం జరిగిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆమె కోమాలోనే ఉండిపోయారు. అప్పటి వరకు ఆయన భార్యకు సేవలందిస్తూనే ఉన్నారు. 2007 ఏప్రిల్‌ 7న ఆమె కన్ను మూశారు. తన రాజకీయ ఉన్నతిని సతీమణి చూడలేకపోయిందనే వ్యధ మధుసూదన్‌రెడ్డిలో ఉండిపోయింది. 1983 నుంచి 1986 వరకు ఆదిలాబాద్‌ జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2008 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఎంపీగా ఓడిపోయినా.. న్యాయవాద వృత్తిని కొనసాగించారు. 2015 ఏప్రిల్‌లో ఆయన దివంగతులయ్యారు.

మరిన్ని వార్తలు