పోలీసుల వేధింపులు.. మహిళా ఎమ్మెల్యే కంటతడి

26 Jun, 2018 19:51 IST|Sakshi
నీలిమా అభయ్‌ మిశ్రా

భోపాల్‌ : పోలీసులు వేధిస్తున్నారంటూ మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో బీజేపీ మహిళా ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో తన గోడును విన్నవించుకుంటూ స్పీకర్‌ ముందు బోరుమన్నారు. వివరాల్లోకి వెళితే.. రివా జిల్లాకు చెందిన నీలిమా అభయ్‌ మిశ్రా అనే బీజేపీ మహిళా నేత సిమరియా నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

గత కొంత కాలంగా సొంత పార్టీకి చెందిన సీనియర్‌ నేత ప్రోద్భలంతో  తన కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నరని స్పీకర్‌ ఎదుట వాపోయారు. స్పందించిన స్పీకర్‌ హోమంత్రిని వివరణ కోరారు. హోంమంత్రి మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీతో చర్చించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

కాగా ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ మండిపడింది. సొంత పార్టీ ఎమ్మెల్యేకే అలా అయితే ఇక సామాన్యుల పరిస్థితి ఎంటని ప్రశ్నించింది. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణలేదంటూ అసెంబ్లీలో నినాదాలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేకే ఇలా జరగడం పట్ల బీజేపీ సిగ్గుపడాలని విమర్శించింది. ఒక మహిళా ఎమ్మెల్యేకు ఇలా జరగడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ పేర్కొంది.

కాగా హోంమంత్రి భూపేంద్రసింగ్‌ మిశ్రా కూర్చునే సీటు వద్దకు వెళ్లి మాట్లాడారు. బాధితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా మిశ్రా వద్దకు వెళ్లి ఓదార్చారు.   

మరిన్ని వార్తలు