మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌

1 Jul, 2020 16:23 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో శివరాజ్‌సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్‌ విస్తరణపై ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపిన ముఖ్యమంత్రి కేంద్ర నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో మంత్రుల జాబితాను సిద్ధం చేశారు. అయితే ప్రస్తుత గవర్నర్‌ లాల్జీటాండన్‌ అనారోగ్యం బారినపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన స్థానంలో  ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనందీబేన్‌ పటేల్‌కు మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె గురువారం బాధ్యతలు స్పీకరించనున్నారు. అనంతరం మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు. (మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేల షాక్‌!)

కేబినెట్‌ విస్తరణ నేపథ్యంలో మంత్రిపదవి కోసం చాలామంది ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి కమల్‌నాథ్‌ సర్కార్‌ కూలిపోవడానికి కారణమైన జోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సైతం పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే వీరిలో కేబినెట్‌ బెర్త్‌ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది శాసనసభ్యులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో మార్చి నెలలో కాంగ్రెస్‌ సర్కార్‌ పడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం​ ఊహించని పరిణామాలతో అదే నెల 23న తిరుగుబాటు సభ్యుల మద్దతులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు కరోనా క్లిష్ట కాలంలోనూ మంత్రివర్గ విస్తరణ అవసరమా అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శలకు దిగుతోంది.

మరిన్ని వార్తలు