కమల్‌నాథ్‌ రాజీనామా

21 Mar, 2020 00:48 IST|Sakshi
భోపాల్‌లో భేటీ సందర్భంగా మాట్లాడుతున్న శివరాజ్‌సింగ్, కమల్‌నాథ్‌

బలపరీక్షకు ముందే తప్పుకున్న మధ్యప్రదేశ్‌ సీఎం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి కమల్‌నాథ్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ లాల్జీ టాండన్‌కి కమల్‌నాథ్‌ తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్టు రాజ్‌భవన్‌ అధికారులు వెల్లడించారు. దీంతో గత కొద్దిరోజులుగా మధ్యప్రదేశ్‌లో నెలకొన్న నాటకీయ పరిణామాలకు తెరపడింది.

కమల్‌ నాథ్‌ రాజీనామాతో 15 నెలల కాంగ్రెస్‌ పాలన అర్థాంతరంగా ముగిసే పరిస్థితి ఏర్పడింది. 22 మంది శాసనసభ్యుల రాజీనామా చేయడంతో బలపరీక్షకు సుప్రీంకోర్టు శుక్రవారం సమయమిచ్చింది. కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌పార్టీ శుక్రవారం సాయంత్రం ఐదుగంటలకు అసెంబ్లీలో తన మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు గడువునిచ్చిన మరునాడే కమల్‌నాథ్‌ రాజీనామాకు ఉపక్రమించారు.  

గవర్నర్‌కి సమర్పించిన రాజీనామా పత్రంలో  ‘నా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజాస్వామిక విలువలతో కూడిన, స్వచ్ఛమైన రాజకీయాలు నెరపాను. వాటికే ప్రాముఖ్యతనిచ్చాను. ఐతే గత రెండు వారాల్లో ప్రజాస్వామ్య విలువలకు స్వస్తిపలికే సరికొత్త అధ్యాయానికి బీజేపీ తెరతీసింది’ అని కమల్‌నాథ్‌ ఆరోపించారు. గవర్నర్‌కి రాజీనామా సమర్పించిన కమల్‌నాథ్‌ మధ్యప్రదేశ్‌కి కాబోయే నూతన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తన తోడ్పాటునందిస్తానని తెలిపారు.

ఈ రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కి అందజేయడానికి ముందు కమల్‌నాథ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపన్ని ప్రజాస్వామిక విలువలను ఖూనీ చేసిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌ రాజకీయ సంక్షోభానికి జ్యోతిరాదిత్య సింధియా కారకుడంటూ నిందించారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో ఆయనకు అనుకూలంగా 22 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బలపరీక్షకు సిద్ధం కమ్మంటూ సుప్రీంకోర్టు కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి గురువారం గడువునిచ్చింది.

230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్‌ శాసనసభలో 16 మంది కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ప్రజాపతి ఆమోదించడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.   విశ్వాసపరీక్ష కోసం మధ్యాహ్నం రెండు గంటలకు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశమైంది. కమల్‌నాథ్‌ రాజీనామాతో రాష్ట్ర అసెంబ్లీ వాయిదాపడింది. ఒంటిగంట ప్రాంతంలో కమల్‌నాథ్‌ గవర్నర్‌కి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్టు తెలిపిన స్పీకర్‌ ఎన్‌.పి. ప్రజాపతి, కమల్‌నాథ్‌ రాజీనామాతో ఆ ఆవశ్యకత లేదని వెల్లడించారు.

మరిన్ని వార్తలు