‘రేపటిలోగా బలం నిరూపించుకోవాల్సిందే’

16 Mar, 2020 20:12 IST|Sakshi

భోపాల్‌ : రాజకీయ సంక్షోభం నెలకొన్న మధ్యప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం కమల్‌నాథ్‌ రేపటిలోగా(మంగళవారం) అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని గవర్నర్‌ లాల్జీ టాండన్‌ మరోసారి ఆదేశించారు. ఈ మేరకు కమల్‌నాథ్‌కు ఆయన సోమవారం ఓ లేఖ రాశారు. కాగా, గవర్నర్‌ గత ఆదేశాల ప్రకారం కమల్‌నాథ్‌ సోమవారం శాసనసభలో విశ్వాస పరీక్ష ఎదుర్కొవాల్సి ఉండింది. అయితే సోమవారం ఉదయం ప్రారంభమైన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలను.. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా స్పీకర్‌ మార్చి 26వ తేదీకి వాయిదా వేశారు. దీంతో నేడు శాసనసభలో కమల్‌నాథ్‌ బలపరీక్ష జరగలేదు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌  బలపరీక్ష నిర్వహించాలని మరోసారి ఆదేశించారు. ఒకవేళ ప్రభుత్వ యత్రాంగం బలపరీక్షను నిర్వహించకపోతే.. కమల్‌నాథ్‌ అసెంబ్లీలో మెజారిటీ లేనట్టుగా భావించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో పలువురు తమ పదవులకు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. కాంగ్రెలో కీలక నేతగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడంతో ఇది మరింత ముదిరింది. మరోవైపు రాజీనామా చేసిన మొత్తం 22 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకూ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు. దీంతో మధ్యప్రదేశ్‌ శాసనసభలో సభ్యుల సంఖ్య ప్రస్తుతం 222కు పడిపోయింది.  

చదవండి : కమల్‌నాథ్‌ బలపరీక్షకు బ్రేక్‌

మధ్యప్రదేశ్‌ హైడ్రామా : సుప్రీంను ఆశ్రయించిన బీజేపీ

మరిన్ని వార్తలు