ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. దిమ్మతిరిగే ట్విస్ట్‌

14 Jun, 2018 12:07 IST|Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడులో దినకనర్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం భిన్నాభిప్రాయాలతో వేర్వేరు తీర్పులను వెలువరించారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో స్పష్టమైన తీర్పు వెలువరించకపోవడంతో ఈ కేసులో అనిశ్చితి తొలగిపోలేదు. దీంతో ఈ కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. దినకరన్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్‌ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్‌ నిర్ణయం చెల్లబోదని జస్టిస్‌ సెల్వం వేరుగా తీర్పునిచ్చారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టు అయింది.

18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు పళనిస్వామి ప్రభుత్వ మనుగడకు విషమ పరీక్షగా మారిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు ఎలా వచ్చినా పళనిస్వామి ప్రభుత్వానికి సంకటం తప్పదన వాదన వినిపించింది. గత సెప్టెంబర్‌లో పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అధికార అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్‌ రద్దుచేసిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే విప్‌కు వ్యతిరేకంగా శశికళ అక్క కొడుకైన దినకనర్‌కు మద్దతు తెలుపడంతో స్పీకర్‌ వారిపై అనర్హత వేటు వేశారు. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని స్పీకర్‌  ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే, స్పీకర్‌ నిర్ణయంపై వేటు పడిన ఎమ్మెల్యేలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పీకర్‌ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో మద్రాస్‌ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వీరి సభ్యత్వాల రద్దును ఆమోదిస్తూ హైకోర్టు తీర్పునిస్తే.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశముంది. అనేక ఒడిదుడుకుల మధ్య అధికారంలో కొనసాగుతున్న పళనిస్వామి ప్రభుత్వం ఈ ఉప ఎన్నికల్లో గట్టెక్కడం సవాలేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ స్పీకర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించి హైకోర్టు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎత్తివేసినా పళని ప్రభుత్వానికి సంకటమే. ఈ నేపథ్యంలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వేర్వేరు తీర్పులు వెలువరించడంతో పళనిస్వామి ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించినట్టు అయింది.

ఎక్కువమంది సభ్యుల మద్దతు పళని సర్కారుకు ఉన్నా.. తగినంత మెజారిటీ మాత్రం లేదు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 117. ప్రస్తుతం అధికార అన్నాడీఎంకేకు 114మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరో 18మంది ఎమ్మెల్యేలు దినకరన్‌కు మద్దతుగా.. పళని ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. వీరి అనర్హత వేటును ఉపసంహరిస్తే.. తిరిగి వీరు పళని ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్‌ వ్యూహాలకు అనుగుణంగా పనిచేసే అవకాశముంది. పళనిని సీఎం పదవి నుంచి దింపేసి.. దళిత ముఖ్యమంత్రిని పీఠం ఎక్కించాలని దినకరన్‌ ప్రస్తుతం డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టు తీర్పు మరోసారి తమిళనాట రాజకీయ సంక్షోభాన్ని సృష్టించే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు