మహారాష్ట్ర ప్రచారంలో తెలుగు వెలుగులు

20 Oct, 2019 16:28 IST|Sakshi

సాక్షి, షోలాపూర్‌: తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు జాతీయ పార్టీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులను ఎన్నికల ప్రచారంలోకి దింపాయి. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే ప్రాంతాలలో పర్యటిస్తూ తమ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాలంటు కోరారు. శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచార పర్వం ముగిసే వరకు అనేక మంది తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా మహారాష్ట్రలో అక్టోబరు 21వ తేదీ సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో  బీజేపీ తెలంగాణకు చెందిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ  నాయకులు నటుడైన మాజీ మంత్రి బాబు మోహన్, నిజమాబాదు ఎంపి ధర్మపురి అరవింద్, ధరం గురువా రెడ్డి, పొంగులేటి సుధాకర్‌ రెడ్డిలతోపాటు కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌ రెడ్డి, హస్య నటుడు బ్రహ్మానందం, సీతారాం ఏచూరి  తదితర నాయకులు గత కొన్ని రోజులుగా ప్రచారం చేశారు.  బై, భివండీలతోపాటు పశ్చిమ మహారాష్ట్రలని షోలాపూర్, పుణే మొదలగు ప్రాంతాలపై వీరు ప్రత్యేక శ్రద్ద చూపించారు.  దీంతో తెలుగు వారుండే పలు ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న అనుభూతి కలిగిందని  చెప్పవచ్చు. ఫ్లకార్డుల నుంచి వేదికపై బ్యానర్లు తదితరాలన్ని దాదాపు తెలుగులోనే దర్శనమిస్తున్నాయి. 

మహేశ్‌ కోటెకు మద్దతుగా బ్రహ్మానందం, స్నేహా ఉల్లాస్‌
షోలాపూర్‌ సిటీ సెంట్రల్‌ నియోజక వర్గం నుంచి పోటీచేస్తున్న శివసేన తిరుగుబాటు ఇండిపెండెంట్‌ అభ్యర్ధి మహేశ్‌ కోటేకు మద్దతుగా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, నటీ స్నేహా ఉల్లాస్‌ ఎన్నికల ప‍్రచారంలో పాల్గొన్నారు. నిన్న మధ్యాహ్నం వీరిద్దరు పట్టణంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 70 ఫీట్ల రోడ్‌ నుంచి ప్రారంభమైన ఈ రోడ్‌ షో తుకారాం చౌక్, అశోక్‌ చౌక్, పద్మశాలి చౌక్, మౌలాలి చౌక్, సివిల్‌ కోర్టు మీదుగా సాగింది. సినీ నటీ నటులను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్న మన తెలుగు అభ్యర్ధి మహేశ్‌ కోటేను గెలిపించాలని ఇరువురు కోరారు. 

ముగిసిన ఎన్నికల ప్రచారం
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా వాడివేడిగా సాగిన ప్రచారపర్వం నిన్నటితో ’(శనివారం)తో ముగిసింది. చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే ప్రచారాలు ముగిశాయి. అక్టోబరు 21వ తేదీ జరగనున్న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం  8,97,62,706 మంది ఓటర్లున్నారు. ఇతర ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 95, 473  పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా 1.8 లక్షల ఈవీఎంలను వినియోగించనున్నారు. ఈ సారి సుమారు 13 రోజులు మాత్రమే ప్రచారాలకు సమయం లభించింది. 

బహుముఖ పోటీ?
రాష్ట్రంలో నియోజకవర్గాలన్నింటిలో త్రిముఖ, బహుముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత సంవత్సరం ఒంటరిగా బరిలోకి దిగిన ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలు, శివసేన, బీజేపీల కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరోవైపు వంచిత్‌ బహుజన్‌ ఆఘాడి, ఎమ్మెన్నెస్, ఎంఐఎం, ఎస్‌పీ, బీఎస్‌పీలతోపాటు ఇతర స్థానిక పార్టీలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ, బహుముఖ పోటీ ఏర్పడింది. కొన్ని నియోజకవర్గాల్లో శివసేన, బీజేపీల కూటమి, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమిల మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

హామీల వర్షం..
అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన వివిధ పార్టీల మేనిఫేస్టోలలో హామీల వర్షం కురిపిచాయి. అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. స్వాతంత్ర వీర్‌ సావర్కర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వనుండటంతో మరాఠ్వాడా కోసం వాటర్‌ గ్రిడ్‌ ఇతర మౌళిక సదుపాయాలు, రూ. 10కే భోజనం, రూ. 1 కే వైద్యకీయ పరీక్షలు  మౌళిక సదుపాయాలు, సొంత ఇళ్లు, విద్యుత్‌ సమస్య, రైతుల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం తదితరాలు మేనిఫేస్టోలలో పొందుపరిచారు. 

పెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ?
రాష్ట్రంలో అత్యధిక సీట్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎన్నికలకు ముందు చేసిన సర్వేలన్ని కూడా ఇవే చెబుతున్నాయి. గత కొంత కాలంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతమైంది. లోకసభ ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నిండింది. దీంతో ఈసారి బీజేపీ మనోబలంపెరిగింది.  మరోవైపు శివసేన రెండవ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని కొందరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ ఈ సారి నాలుగో స్థానంలో నిలువగా ఎన్సీపీ రెండో స్థానంలో నిలుస్తుందని అంచనాలు వేశాయి.

ప్రచారం చేసిన ప్రముఖులు..
రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ప్రచారం చేశారు. ప్రముఖ పార్టీల జాతీయ నాయకులు ప్రచార సభలు జరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌ షా,  కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షులు శరద్‌ పవార్‌ తదితర అనేక మంది పాల్గొన్న సభలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే వీరందరు ఓట్లు ఎవరికి వేస్తారనేది వేచిచూడాల్సిందే. ఈ సారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కోసం కాంగ్రెస్‌ జాతీయ నాయకులు దూరంగా ఉండటం అందరినీ విస్మయం కలిగించింది. రాహుల్‌ గాంధీ ముంబైలో ఒక సభలో పాల్గొన్నప్పటికీ సోనియాగాంధీ, ప్రియంకా గాంధీలు మాత్రం ఎక్కడా కానరాలేదు. ప్రచారానికి వారిద్దరు దూరం ఉండటం గమనార్హం. ఈ సారి ఎన్నికల్లో దివంగత బాల్‌ ఠాక్రే మనుమడైన యువసేన అధ్యక్షులు ఆదిత్య ఠాక్రే ముంబై వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఠాక్రే కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా ఆయన పోటీ చేస్తుండటం ఈ ఎన్నికల విశేషం. 

భారీ వర్షంలో శరద్‌ పవార్‌ సభ...
సాతారాలో భారీ వర్షంలో కూడా ఎన్సీపీ అధ్యక్షులు శరద్‌ పవార్‌ సభ కొనసాగించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. సుమారు 80 ఏళ్ల వయసులో కూడా ఆయన వర్షంలోను ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడిన తీరు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సాతారాలో శుక్రవారం రాత్రి సభలో శరద్‌ పవార్‌ ప్రసంగం ప్రారంభించగానే భారీ వర్షం ప్రారంభమైంది. అయితే అనేక మంది వర్షం కారణంగా సభలను రద్దు చేసుకోగా శరద్‌ పవార్‌ మాత్రం భారీ వర్షంలోనే సభ కొనసాగించారు. దీనిపై యువసేన అధ్యక్షులు ఆదిత్య ఠాక్రే స్పందించారు. తన తాత దివంగత బాల్‌ ఠాక్రే మిత్రులైన శరద్‌ పవార్‌ నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉందన్నారు. మరోవైపు ఉక్కులాంటి నేతృత్వం మాకు లభించిందని అజిత్‌ పవార్‌ను కొనియాడారు. 

మరిన్ని వార్తలు