కాషాయానికి చెమటలు పట్టించారు!

25 Oct, 2019 09:03 IST|Sakshi

అధికార పార్టీలకు గట్టిపోటీనిచ్చిన కాంగ్రెస్‌ కూటమి

గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న ఇరుపార్టీలు 

బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 45 స్థానాలు కైవసం

పశ్చిమ మహారాష్ట్రలో జయభేరీ మోగించిన శరద్‌ పవార్‌ పార్టీ 

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు గురువారం తెరపడింది. మరోసారి ప్రజలు బీజేపీ, శివసేనల కూటమికే పట్టం కట్టారు. శివసేన, బీజేపీల కూటమికి 161 సీట్లతో పూర్తి మెజార్టీ లభించినా కాంగ్రెస్‌ కూటమి గట్టి పోటీ నిచ్చింది. ఓపీనియన్‌ పోల్స్, ఎగ్జిట్‌ పోల్స్‌కు కొంత భిన్నంగా మహారాష్ట్ర ఫలితాలు వెలువడ్డాయి. 220 పైగా సీట్లు దక్కుతాయన్న ధీమాను వ్యక్తం చేసిన కాషాయ కూటమికి కొంత ఆశాభంగం జరిగింది. గతంలో 122 సీట్లు దక్కించుకున్న బీజేపీ ఈ సారి కూడా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ 18 స్థానాలు తగ్గాయి. దీంతో ఈ సారి 105 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు గతంలో 63 స్థానాలు దక్కించుకున్న శివసేన కూడా ఈ సారి ఏడు స్థానాలు తగ్గిపోయినప్పటికీ 56 స్థానాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. అయితే మహాకూటమికి చెందిన మొత్తం ఏడుగురు మంత్రులు పరాజయం పాలయ్యారు. పర్లీలో శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే పరాజయం పాలయ్యారు. ఇక ఎన్సీపీ గతంలో కంటే అత్యధిక స్థానాలు గెలుచుకుని తన సత్తాను చాటుకుంది. కాగా, ఎన్సీపీ సీనియర్‌ నాయకులు ఇతర పార్టీల బాట పట్టినా పార్టీ చీఫ్‌ శరద్‌పవార్‌ అన్నీ తానై నడిపించడం గమనార్హం. 

కాంగ్రెస్, ఎన్సీపీల కూటమికి పెరిగిన స్థానాలు.. 
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీల కూటమికి గతంలోకంటే అధిక స్థానాలు లభించాయి. గతంలో కాంగ్రెస్‌కు 42 సీట్లు రాగా ఈసారి మూడు స్థానాలు పెరిగాయి. మరోవైపు ఎన్సీపీకి కూడా గతంలో 41 స్థానాలుండగా ఈ సారి 54 సీట్లను దక్కించుకుంది. ఇలా కాంగ్రెస్, ఎన్సీపీల కూటమికి 98 సీట్లు దక్కాయి. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీలు గట్టిపోటీనిచ్చాయని తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రాంతాలవారిగా పరిశీలిస్తే పశ్చిమ మహారాష్ట్ర మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లో బీజేపీ, శివసేనల కూటమి ఆధిక్యత సాధించింది.  

పశ్చిమ మహారాష్ట్రలో... 
ఎన్సీపీ అధ్యక్షులు శరద్‌ పవార్‌కు అధిక పట్టున్న పశ్చిమ మహారాష్ట్రలో అత్యధికంగా 27 స్థానాలు ఎన్సీపీకి దక్కాయి. కాంగ్రెస్‌ కూడా 11 స్థానాలు కైవసం చేసుకుంది. పశ్చిమ మహారాష్ట్రలో అత్యధికంగా 70 అసెంబ్లీ స్థానాలుండగా ఇక్కడ కాంగ్రెస్, ఎన్సీపీల కూటమికి 38 స్థానాలు, బీజేపీ 21, శివసేన ఐదు ఇలా కాషాయ కూటమికి 26 స్థానాలను దక్కించుకుంది.  పశ్చిమ మహారాష్ట్రలో విజయం సాధించినవారిలో పృథ్వీరాజ్‌ చవాన్, అజిత్‌ పవార్, చంద్రకాంత్‌ పాటిల్‌ తదితర ప్రముఖులున్నారు.
 
విదర్భలో... 
విదర్భలోని 62 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, శివసేనల కూటమి 31 స్థానాలు దక్కించుకుంది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీల కూటమికి 23 స్థానాలు లభించాయి. విదర్బ నుంచి పోటీ చేసి విజయం సాధించిన వారిలో దేవేంద్ర ఫడ్నవిస్‌తోపాటు పలువురు ప్రముఖులున్నారు.  
మరాఠ్వాడాలో... 
మరాఠ్వాడాలో మొత్తం 46 స్థానాలుండగా ఇక్కడి నుంచి బీజేపీ శివసేన కూటమి 28 స్థానాలు గెలుచుకుని ప్రథమ స్థానంలో నిలిచాయి. మరోవైపు కాగ్రెస్, ఎన్సీపీలు 16 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇతరులకు రెండు స్థానాలు లభించాయి.  మరాఠ్వాడాలో విజయం సాధించిన ప్రముఖులలో మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్, ఎన్సీపీ నేత ధనంజయ్‌ ముండేతోపాటు పలువురు ప్రముఖులున్నారు.  
ఉత్తర మహారాష్ట్రలో... 
35 స్థానాలున్న ఉత్తర మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల కూటమికి 19 స్థానాలు లబించగా మరోవైపు కాంగ్రెస్‌; ఎన్సీపీల కూటమి 12 స్థానాలలో విజయం సాధించింది. మరోవైపు ఇక్కడి నుంచి ఆరుగురు ఇతరులు విజయం సాధించారు.    
కొంకణ్‌లో... 
కొంకణ్‌లో థానేతో కలిపి మొత్తం 39 స్థానాలున్నాయి. ఇక్కడ మాత్రం శివసేన తన పట్టును నిలుపుకుంది. కొంకణ్‌లో 16 స్థానాలతో శివసేన అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు బీజేపీకి 10 స్థానాలు ఇలా శివసేన, బీజేపీల కూటమికి 26 స్థానాలు లభించగా కాంగ్రెస్‌ ఖాతా తెరవలేకపోయింది. అయితే ఎన్సీపీ మాత్రం ఐదు స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు ఇక్కడి నుంచి ఇతరులు ఏడుగురు విజయం సాధించడం విశేషం.  
ముంబైలో... 
ముంబైలోని 36 నియోజక వర్గాలలో ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై ఉత్కంఠత కొనసాగింది. ఇక్కడి నుంచి కూడా బీజేపీ 16, శివసేన 14 స్థానాలను దక్కించుకోగా కాంగ్రెస్‌ నాలుగు, శివసేన ఒక స్థానంలో విజయం సాధించింది. మరోవైపు ఇతరులు ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక్కడి నుంచి విజయం సాధించిన వారిలో ఆదిత్య ఠాక్రే, వర్షా గైక్వాడ్‌లతోపాటు పలువురు ప్రముఖులున్నారు.  

మరిన్ని వార్తలు