‘చిత్తుగా ఓడిపోతారు.. జాగ్రత్త!’

26 Jan, 2018 08:29 IST|Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ మరోసారి శివ సేన పార్టీ ‘ఒంటరి పోటీ’ వ్యాఖ్యలపై స్పందించారు. శివ సేన గనుక అలా చేస్తే బీజేపీ కంటే దారుణంగా ఓడిపోతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫడ్నవిస్‌ మాట్లాడుతూ... ‘‘2019 లోక్‌ సభ ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పదని శివ సేన మమల్ని (బీజేపీ) బెదిరిస్తున్నారు. కానీ, వాళ్లు అలా చెయ్యరనే భావిస్తున్నాం. మేం ఓడిపోతే ఓడిపోవచ్చు. కానీ, బీజేపీతో పోలిస్తే చిత్తుగా ఓడేది మాత్రం శివ సేననే. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే. అయినా రాజకీయాలంటేనే.. చెప్పేది ఒకటి-చేసేది ఒకటి కదా!. శివ సేన తొందరపాటు నిర్ణయాలు తీసుకోదనే భావిస్తున్నా’’అని తెలిపారు. 

కాగా, 2019లో జరగనున్న లోక్‌సభ, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగానే తాజాగా జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో శివసేన నిర్ణయించింది. బీజేపీ ప్రభుత్వం కేవలం పథకాల ప్రచారాలకు, ప్రకటనలకే డబ్బు ఖర్చు పెడుతోంది తప్ప చిత్తశుద్ధితో వాటిని అమలు చేయడం లేదనీ, ఇలాంటి పార్టీని అధికారం నుంచి దింపేయాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశంలో పిలుపునిచ్చారు కూడా. అయితే మిత్రపక్షం బీజేపీ మాత్రం ఈ కటీఫ్‌ను చాలా తేలికగా తీసుకుంది.

మరిన్ని వార్తలు