శివసేనలో చేరిన నిర్మలా గావిత్‌

22 Aug, 2019 09:16 IST|Sakshi

సాక్షి, ముంబై: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నిర్మలా గావిత్‌ బుధవారం ఉదయం శివసేన తీర్థ పుచ్చుకున్నారు. ఆమె మాతోశ్రీ బంగ్లాలో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉద్ధవ్‌ ఆమె చేతి మణికట్టుపై శివబంధన్‌ (కంకణం) దారం కట్టి పార్టీలోకి ఆహ్వానించారు. నాసిక్‌ జిల్లా ఇగత్‌పురికి చెందిన ఎమ్మెల్యే నిర్మలా గావిత్‌ పార్టీ పదవులకు రాజీనామా చేసిన అనంతరం ఉద్ధవ్‌తో పలుమార్లు ఫోన్‌లో సంప్రదించడం ప్రారంభించారు. దీంతో ఆమె త్వరలో శివసేనలో చేరుతుండవచ్చని అప్పుడే ఖరారైంది. చివరకు ఊహించిన విధంగానే ఆమె శివసేనలో చేరారు.  

ఎన్సీపీ నుంచి వలసలు?
నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన సాతారా లోక్‌సభా నియోజకవర్గం ఎంపీ ఉదయన్‌ రాజే బీజేపీలో చేరుతుండవచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ముంబైలోని ముఖ్యమంత్రి నివాసమైన వర్షా బంగ్లాలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఆయన భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడం సాధ్యమైతే ఎంపీ పదవికీ రాజీనామా చేయడానికి ఉదయన్‌ రాజే సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. సాతారా జిల్లాలో గత కొద్ది రోజులుగా ఎన్సీపీలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో ఉదయన్‌ రాజే సోదరుడు, సాతారా ఎమ్మెల్యే శివేంద్ర రాజే బీజేపీలో చేరారు. ఇప్పుడు ఉదయన్‌ రాజే ఫడ్నవీస్‌తో భేటీ కావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఒకవేళ ఉదయన్‌ రాజే కూడా బీజేపీలో చేరితే శివేంద్ర రాజే అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని బట్టి ఇరువురు సోదరుల మధ్య పడటం లేదని తెలుస్తోంది.

అలాగే కొల్హాపూర్‌కు చెందిన మాజీ ఎంపీ ధనంజయ్‌ మహాడిక్‌ కూడా ఈ నెల చివరలో బీజేపీలో ప్రవేశించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహాడిక్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు పనిచేయడంతో అసంతృప్తితో ఉన్నారు. ఒకవేళ మహాడిక్‌ పార్టీ నుంచి బయటపడితే ఎన్సీపీకి గట్టి దెబ్బ తగలనుంది. దీంతో ఆయన్ని మెప్పించే ప్రయత్నాలు చేయనున్నారు. అదేవిధంగా ఎన్సీపీకి చెందిన విధానపరిషత్‌ సభాపతి రామ్‌రాజే నాయిక్‌ నింబాల్కర్‌ కూడా బీజేపీ బాటలో ఉన్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రామ్‌రాజేతోపాటు అతని అల్లుడు రాహుల్‌ నార్వేకర్, ఫల్టణ్‌ ఎమ్మెల్యే దీపక్‌ చవాన్‌ కూడా బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఇదిలాఉండగా ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌కు అతి విశ్వాసపాత్రుడైన ఛగన్‌ భుజబల్‌ కూడా శివసేన బాటలో ఉన్నట్లు తెలిసింది. అదేవిధంగా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న అజీత్‌ పవార్‌ దగ్గరి బంధువు పద్మసింహ్‌ పాటిల్‌ çఘరాణే కూడా బీజేతో సంప్రదింపులు జర్పుతున్నట్లు తెలిసింది. అలాగే పద్మసింహ్‌ తనయుడు, ఎమ్మెల్యే రాణా జగ్‌జిత్‌సింహ్‌ కూడా బీజేపీలో చేరుతుండవచ్చని జోరుగా చర్చ జరగుతోంది. త్వరలో దీనిపై ఒక స్పష్టత రానుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.    

క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇదివరకే ఎన్సీపీకి చెందిన మాజీ మంత్రి మధుకర్‌ పిచడ్, వైభవ్‌ పిచడ్, సందీప్‌ నాయిక్, సచిన్‌ అహిర్, చిత్రా వాఘ్‌ తదితర నాయకులు బీజేపీ, శివసేనలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా పలువురు నాయకులు మళ్లీ ఎన్సీపీ నుంచి బయటపడి ఇతర పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వలస వల్ల ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు టెన్షన్‌లో పడిపోయారు. పార్టీలో ఎవరుంటారు..? ఎవరు బయటపడతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్సీపీ వర్గీయుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది.  

మరిన్ని వార్తలు