ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం; సోనియాకు లేఖ!

2 Nov, 2019 12:40 IST|Sakshi

ముంబై : బీజేపీ పంతం.. శివసేన మొండితనం.. ఎన్సీపీ నిర్ణయంతో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వ ఏర్పాటు అంశం కొలిక్కిరాలేదు. దీంతో పరిస్థితులు ఇలాగే కొనసాగితే... రాష్ట్రపతి పాలన విధిస్తామంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తుండగా... తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ హుసేన్‌ దల్వాయి సోనియా గాంధీకి రాసిన లేఖతో మహా రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. మిత్రపక్షం ఎన్సీపీ, శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేయాలని ఆయన పార్టీ అధ్యక్షురాలిని శనివారం కోరారు.

ఈ మేరకు... ‘ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం జరిగిందో మనం చూశాం. మన పార్టీ ఎమ్మెల్యేలను, ఇతర రాజకీయపార్టీల నేతలను బీజేపీ కొనుగోలు చేసింది. ఒకవేళ వాళ్లు మరోసారి అధికారంలోకి వస్తే ఇదే పునరావృతం చేస్తారు. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ- శివసేనల మధ్య సయోధ్య కుదరటం లేదు. కాబట్టి మన మిత్ర పక్షం ఎన్సీపీ, శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తద్వారా మన ఎమ్మెల్యేలను కాపాడటంతో పాటు పార్టీ పునాదులను కూడా బలోపేతం చేసుకోవచ్చు. ఒకే జాతి, ఒకే నాయకుడు, ఒకే పార్టీ, ఒకే ప్రాంతం అనే ఆరెస్సెస్‌ సిద్ధాంతానికి బీజేపీ కట్టుబడి ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే శివసేన అలా కాదు. బీజేపీ కంటే శివసేన ఎన్నోరెట్లు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటుంది అని దల్వాయి సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

కాగా ఇంతకుముందు మీడియాతో మాట్లాడిన దల్వాయి.. శివసేనపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. మరాఠా ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న శివసేన బీజేపీ కంటే ఎంతో ఉన్నతమైన సిద్ధాంతం కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో... ఎమర్జెన్సీ వేళ.. ప్రతిభా పాటిల్‌ రాష్ట్రపతి పోటీలో నిలిచినపుడు శివసేన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ శివసేన ప్రభుత్వ ఏర్పాటులో తమ సహాయం కోరితే తప్పక సానుకూలంగా స్పందిస్తామని పేర్కొన్నారు. కాగా 288 శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే కూటమిగా ఎన్నికలకు వెళ్లిన బీజేపీ- శివసేన మధ్య ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి పదవి విషయంలో విభేదాలు తలెత్తడంతో మహా రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా