శివసేనతో చేతులు కలపం : పవార్‌

24 Oct, 2019 14:52 IST|Sakshi

ముంబై : ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు భిన్నంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ మెరుగైన ఫలితాలు రాబట్టి పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పలువురు నేతలు పార్టీని వీడినా శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అధిక స్ధానాలను సాధించడం గమనార్హం. తాజా ట్రెండ్స్‌ ప్రకారం ఎన్సీపీ 50కి పైగా స్ధానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. 2014లో శివసేన కేవలం 41 స్ధానాలకే పరిమితమైంది. మరోవైపు పార్టీని వీడిన నేతలను ప్రజలు ఆమోదించలేదని చెప్పిన శరద్‌ పవార్‌ శివసేనతో చేతులు కలిపేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌-ఎన్సీపీ గెలుపు కోసం కార్యకర్తలు చెమటోడ్చి తాము చేయాల్సిందంతా చేశారని వ్యాఖ్యానించారు. అధికారం రావడం,కోల్పోవడం సహజమని, విధానాలకు కట్టుబడి ఉండటం కీలకమని అన్నారు. తమ పట్ల అభిమానం చూపిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. పార్టీని వీడిన నేతలు ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలమయ్యారని అన్నారు. శివసేనతో తమ పార్టీ చేతులు కలపదని, సేనతో దోస్తీ తమ విధానాలకు విరుద్ధమని పవార్‌ తేల్చిచెప్పారు.

మరిన్ని వార్తలు