పొలిటికల్‌ సూపర్‌ స్టార్‌..

27 Nov, 2019 03:24 IST|Sakshi

మహా థ్రిల్లర్‌కు డైరెక్షన్‌

కింగ్‌ మేకర్‌గా మరాఠా ఉక్కు మనిషి పవార్‌ 

సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో సతారాలో భారీ వర్షంలో తడుస్తూ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ చేసిన ప్రసంగం ప్రజలతో ఆయన ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పాటుకు బాటలు వేసింది. అప్పుడే చాలా మంది కొత్త ప్రభుత్వంలో పవార్‌దే కీలకపాత్రని భావించారు. బాలీవుడ్‌ అతిరథ మహారథులంతా ముంబైలోనే ఉన్నప్పటికీ మహారాష్ట్ర సూపర్‌ స్టార్‌ ఎవరయ్యా అంటే ఇప్పుడు అందరూ శరద్‌ పవార్‌ పేరే చెబుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికలకు తెరలేచిన దగ్గర్నుంచి పవార్‌ కేంద్రంగానే రాజకీయాలు నడిచాయి. నీటిపారుదల శాఖలో అవినీతికి సంబంధించి పవార్‌పై ఈడీ కేసుల్ని నమోదు చేసినప్పటికీ అదరలేదు, బెదరలేదు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా లపై నిప్పులు చెరిగినా, రాష్ట్రంలో కుస్తీ ఫెడరేషన్‌ ఒక్కటే ఉందని, అది తనదేనని ఫడ్నవీస్‌కు నవ్వుతూనే చురకలంటించినా ఆయనకే చెల్లింది.  

పవార్‌ ఎత్తులకు షా చిత్తు  
ఎన్సీపీని చీల్చేందుకు ప్రయత్నించిన అమిత్‌ షా ఎత్తులకు పై ఎత్తులు వేసి కేవలం 78 గంటల్లోనే కౌంటర్‌ ఇచ్చారు శరద్‌ పవార్‌. పార్టీ ఎమ్మెల్యేలు తన వెంట నడిచేలా చూసుకోవడంతో పాటు అజిత్‌ను బుజ్జగించడంలో సఫలమయ్యారు.  రెండు వారాలుగా ఉత్కంఠంగా సాగుతోన్న మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్‌ పవార్‌ ప్రధాని మోదీని కలుసుకోవడంతో అందరూ ఆయన వైపు అనుమానంగానే చూశారు. అజిత్‌ పవార్‌ చీలిపోయి బయటకు వచ్చాక కూడా ఆయన వెనుక శరద్‌ పవార్‌ ఉన్నారనే ప్రచారం జరిగింది. కానీ  ‘సంఖ్యా బలం లేకపోయినా ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అమిత్‌ షాకే చెల్లింది. మహారాష్ట్రలో ఆయన ఏం చేస్తారో చూడాలని ఉంది’’అంటూ  సవాల్‌ విసిరారు 

54 అంకెతో నేటికీ లింకు  
ప్రధాని కావాలని కలలు కన్న శరద్‌ పవార్‌కు 1991లో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. రాజీవ్‌గాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రాజకీయాలపై ఆసక్తి లేదంటూ సోనియా అధికారానికి దూరంగా ఉండిపోయారు. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న శరద్‌ పవార్‌కు 54 మంది ఎంపీల మద్దతు ఉంది. వారి మద్దతుతో ప్రధాని పీఠం అధిరోహించాలని భావించారు. కానీ అర్జున్‌ సింగ్‌ వర్గం అనూహ్యంగా పీవీ నరసింహారావుకి మద్దతు పలకడంతో ప్రధాని పీఠానికి పవార్‌ చేరువ కాలేకపోయారు. ఇప్పుడు అదే 54 మంది ఎమ్మెల్యేలతో ఆయన కింగ్‌ మేకర్‌గా మారారు.

ఇక చక్రం తిప్పేది పవారే  
అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్‌ పవార్‌ సహా ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ భారీ ఆధిక్యంతో గెలుపొందడంతో శరద్‌ పవార్‌ ప్రజల మూడ్‌ ఎలా ఉందో గ్రహించి, ఎన్నికల తర్వాత దానికి అనుగుణంగానే అడుగులు వేశారు. గద్దెనెక్కనున్న ఉద్ధవ్‌  ప్రభుత్వం కూడా పవార్‌ కనుసన్నల్లోనే నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు