లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది

4 Apr, 2020 11:30 IST|Sakshi
మహారాష్ట్ర మంత్రి డాక్టర్ నితిన్ రావత్ (ఫైల్ ఫోటో)

సాక్షి, ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  తాజా పిలుపుపై స్వపక్షాలనుంచి హర్షంతో పాటు, కాంగ్రెస్ నేత శశిథరూర్ లాంటి విపక్షనేతలనుంచి, విద్యుత్తు ఇంజనీర్లు, నిపుణుల నుంచి కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ నితిన్ రావత్ ఈ పిలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు(ఏప్రిల్ 5, ఆదివారం) రాత్రి  9 గంటలకు 9 నిమిషాలు లైట్లు ఆపివేయాలన్న సూచనపై పునరాలోచన చేయాలని లేదంటే అత్యసర సేవలకు విఘాతం ఏర్పడే అవకాశం వుందని ప్రజలను కోరారు. ఒకేసారి అన్ని లైట్లను స్విచ్ ఆఫ్ చేసే ముందు మనం పునరాలోచించాలనీ, ఇది గ్రిడ్ వైఫల్యానికి దారితీస్తుందని పేర్కొన్నారు. గ్రిడ్ వైఫల్యం  చెందితే అత్యవసర సేవలను ప్రభావితం చేస్తుందని చెప్పారు.  లాక్ డౌన్ కారణంగా, ఫ్యాక్టరీ యూనిట్లు లేనందున డిమాండ్ ఇప్పటికే 23,000 మెగావాట్ల నుండి 13,000 మెగావాట్లకు తగ్గింది... ఇక ప్రజలందరూ ఒకేసారి లైట్లను ఆపివేస్తే సరఫరాలో భారీ వ్యత్యాసంతో (భారీ లోడ్ అకస్మాత్తుగా పడిపోవడం) విద్యుత్తు గ్రిడ్ కుప్పకూలిపోవచ్చని రావత్  చెప్పారు. అంతేకాదు తిరిగిసేవలను పునరుద్ధరించడానికి 12-16 గంటలు పడుతుందన్నారు. ప్రస్తుత సంక్షోభంలో విద్యుత్తు చాలా ముఖ్యమైన అవసరమని ఆయన పేర్కొన్నారు.

అటు మోదీ పిలుపుపై  స్పందించిన మహారాష్ట్ర గృహనిర్మాణ మంత్రి జితేంద్ర ఇదొక మూర్ఖత్వపు సూచన, పిల్లతనం తప్ప మరొకటి కాదని అవద్ విమర్శలు గుప్పించారు. శశిథరూర్  సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానికి భవిష్యత్తుపైనగానీ, లాక్ డౌన్ తరువాత పరిస్థితులను  ఎలా అంచనా  వేయాలో తెలియదని, ఈ విషయంలో మోదీకి ఒక ‘విజన్’ అంటూ లేదని ఆయన ట్వీట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రీ కూడా ఇలాగే స్పందించారు. దేశానికి జీడీపీలో 8 నుంచి 10 శాతం విలువైన ఆర్ధిక ప్యాకేజీని  ముందు ప్రకటించాలని  ట్వీట్ చేసిన ఆయన లాక్ డౌన్ సందర్భంగా ఉపాధిలేక తస్వస్థలాల బాట పట్టిన వేలాది కార్మికులకు, శ్రామిక జీవులకు వెంటనే వేతనాలు మంజూరు చేయాలని హితవు చెప్పారు. ఫేక్ న్యూస్ ని అణచివేత పేరుతో  నిజమైన మాద్యమాలను నోరు నొక్కొద్దంటూ మహువా తీవ్రంగా హెచ్చరించారు.మరోవైపు ఇదే విషయంలో తెలంగాణా విద్యుతు ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే  పారిశ్రామిక డిమాండ్ భారీగా పడిపోయిన నేపథ్యంలో ఆకస్మికంగా అందరూ స్విచ్-ఆఫ్ చేస్తే  గ్రిడ్ కూలిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులకు అవసరమైన విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

కాగా కరోనావైరస్ మహమ్మారితో దేశంలో అలుముకున్న చీకటితో పోరాడటానికి  కొవ్వొత్తులు, మట్టి దీపాలు, లేదంటే కనీసం మొబైల్  టార్చి లైట్లను వెలిగించాలని, సామూహిక శక్తిని నిలపాలంటూ దేశ ప్రజలకు ఇచ్చిన ఒకవీడియో సందేశంలో ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.  (చదవండి : కరోనా సంక్షోభం: స్నాప్‌డీల్  డెలివరీ హామీ)

మరిన్ని వార్తలు