పార్లమెంటులో ‘మహా’ సెగలు

26 Nov, 2019 04:25 IST|Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై సోమవారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలనను ఎత్తేసీ ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు లోక్‌సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. మహారాష్ట్ర పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విపక్షాలు సభను హోరెత్తించాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యం ఖూనీని నివారించండి అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకొని ఎంపీలు వెల్‌లోకి దూసుకుపోయి నినాదాలు చేశారు. వెల్‌లోకి వచ్చిన కాంగ్రెస్‌ సభ్యులు, హిబి ఈడెన్, ప్రతాపన్‌లను వెనక్కి వెళ్లాలంటూ స్పీకర్‌ చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో సభ నుంచి బయటకు పంపేయాల్సిందిగా స్పీకర్‌ ఆదేశాలు జారీ చేయడంతో మార్షల్స్‌ రంగంలోకి దిగారు. మార్షల్స్‌కి, సభ్యులకి మధ్య తోపులాట జరిగింది. దీంతో స్పీకర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

భద్రతా సిబ్బంది చేయి చేసుకున్నారు: మహిళా ఎంపీల ఫిర్యాదు
మహారాష్ట్ర విషయంలో సభలో గందరగోళం నెలకొన్నప్పుడు భద్రతా సిబ్బంది తమపై చేయి చేసుకున్నారని కాంగ్రెస్‌ మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు . తమపై భద్రతా సిబ్బంది చేయి చేసుకున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీలు జోతిమణి, రమ్య హరిదాస్‌లు ఆరోపించారు.   మహారాష్ట్రలో అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. ఆమె వెంట పార్టీ నేతలు అహ్మద్‌ పటేల్, ఆనంద్‌ శర్మ, అధీర్‌ రంజన్‌ చౌధరి, శశిథరూర్‌లు కూడా నిరసన కార్యక్రమంలో నినాదాలు చేశారు.  

రాజ్యసభలోనూ అదే సీన్‌
రాజ్యసభ మహారాష్ట్ర అంశంపై దద్దరిల్లింది. కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలు, డీఎంకేలు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన రాత్రికి రాత్రి ఎందుకు ఎత్తివేశారని, దానిపై చర్చించాలంటూ పట్టు పట్టారు. చైర్మన్‌ వెంకయ్య రాష్ట్రపతి పాలన విధించడానికి ముందు, లేదంటే ఎత్తివేయడానికి ముందు సభ చర్చించాలని, ఎత్తివేశాక దానిపై చర్చ జరపలేమన్నారు. అయినా, సభలో గందరగోళం ఆగలేదు. ప్రజాస్వామ్యాన్ని హత్యచేస్తున్నారంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. మధ్యాహ్నం తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో డిప్యూట్‌ చైర్మన్‌æ మంగళవారానికి సభను వాయిదా వేశారు.

పార్లమెంటులో నేడు రాజ్యాంగ దినోత్సవం
భారతదేశ రాజ్యాంగ సభ తనదైన సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగాన్ని ఆమోదించుకుని సరిగ్గా ఏడు దశాబ్దాలు. 1949 నవంబర్‌ 26న మన దేశ రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడింది. ఆ తరువాత రెండు  నెలల అనంతరం 1950 జనవరి 26న ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1947 ఆగస్టు నెలలో వలస పాలన నుంచి విముక్తిపొందిన భారతదేశం.. రెండేళ్ళ అనంతరం తనదైన రాజ్యాంగాన్ని రూపొందించుకుని నవంబర్‌ 26న ఆమోదింపజేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతీ ఏటా రాజ్యాంగ దినోత్సవం– ‘సంవిధాన్‌ దివస్‌’  జరుపుకుంటున్నాం. 70ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో మంగళవారం ఉభయసభల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 

మరిన్ని వార్తలు