ఢిల్లీకి చేరిన ‘మహా’ పంచాయితీ

23 Nov, 2019 19:13 IST|Sakshi

సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసిన కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన

దేవేంద్ర ఫడ్నవిస్‌-అజిత్‌ పవార్‌ ప్రభుత్వ ఏర్పాటుపై ఫిర్యాదు

న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాలు ఢిల్లీని చేరాయి. దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. అక్టోబర్‌ 24న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ-శివసేన దోస్తీ తెగదెంపులు కావడంతో.. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో వారికి ఊహించని షాక్‌ తగిలింది. ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు.  డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు.
(చదవండి : శివసేన, ఎన్సీపీలతో కలిసే ఉన్నాం: కాంగ్రెస్‌)

శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ వారితో ప్రమాణం చేయించారు. ఎన్సీపీలో అజిత్‌ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ముంబై వర్గాల సమాచారం. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇక 29 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం ఇదివరకే పావులు కదిపింది. వారి మద్దతుతో బల పరీక్షలో నెగ్గాలని ప్రణాళిలకు రచిస్తోంది. 
(చదవండి : ఫడ్నవిస్‌కు బలముందా.. ఉత్కంఠగా బలపరీక్ష!)

మరిన్ని వార్తలు