పోలింగ్‌ ముమ్మరం దేనికి సంకేతం?

2 May, 2019 00:25 IST|Sakshi

దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో సోమవారం గతంతో పోల్చితే ముమ్మరంగా పోలింగ్‌ జరిగింది. ఓటర్ల అనాసక్తికి ఈ నగరం పెట్టింది పేరు. అలాంటిది ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాక జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇంత భారీగా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడం ఇదే మొదటిసారి. 1967 తర్వాత 2014లో తొలిసారి పోలింగ్‌ రికార్డు స్థాయిలో జరిగింది. బాలీవుడ్‌ నటి ఊర్మిళా మాటోండ్‌కర్‌(కాంగ్రెస్‌) పోటీచేస్తున్న ముంబై నార్త్‌ స్థానంపై అందరి దృష్టి నిలిచింది. ఇక్కడ 60 శాతం పోలింగ్‌ జరిగింది. ముంబై సౌత్‌ నియోజకవర్గంలో దశాబ్దాలపాటు అతి తక్కువ పోలింగ్‌ జరిగింది. ఈసారి కూడా నగరంలోని ఆరు నియోజకవర్గాల్లో అతి తక్కువ పోలింగ్‌ జరిగిన స్థానంగా నిలిచింది. కాని, గతంతో పోల్చితే మెరుగ్గా అంటే 51.2 శాతం ఓటర్లు ఓటేశారు. మొత్తంమీద నగరంలోని అన్ని స్థానాల్లోనూ 50 శాతానికి మించి పోలింగ్‌ జరగడం విశేషం.

గుజరాతీలున్న ప్రాంతాల్లో ముమ్మరంగా పోలింగ్‌
గుజరాతీలు అధిక సంఖ్యలో ఉన్న ముంబై నార్త్‌ నియోజకవర్గంలో 2014లో 53 శాతం పోలింగ్‌ జరగగా, ఇది 2019లో 60 శాతానికి పెరగడం విశేషం. నగరంలోని పశ్చిమ మలాడ్‌ నుంచి బొరివిలీ వరకూ విస్తరించిన ఈ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఊర్మిళ, బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ గోపాల్‌ షెట్టి మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. 2014లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ను గోపాల్‌ షెట్టి నాలుగున్నర లక్షల ఓట్ల మెజారిటీతో ఓడించారు. గుజరాతీలు అధిక సంఖ్యలో నివసించే కాండివిలి, బొరివిలీ, దహీసర్‌ ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ భారీగా జరిగింది. బొరివిలీలో పోలింగ్‌ 66.2 శాతం రికార్డయింది. కిందటిసారి 57.3 శాతం జనం ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అలాగే, గుజరాతీ, మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువ ఉన్న ములుంద్‌లో 63.7 శాతం పోలింగ్‌ జరిగింది. ఇలా మరాఠీలు, గుజరాతీలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడం బీజేపీ అభ్యర్థికి అనుకూలాంశమని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. మొదట కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఊర్మిళ పేరు ప్రకటించగానే గోపాల్‌షెట్టి గెలుపు అంత తేలిక కాదని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఈ నియోజకవర్గంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న మాల్వానీ వంటి ప్రాంతాల్లో పోలింగ్‌ 56.9 శాతం మించలేదు. కాంగ్రెస్‌కు ముస్లిం ఓట్లు పడతాయనే అంచనా ప్రకారం చూస్తే ఇక్కడ తక్కువ శాతం పోలింగ్‌ వల్ల ఊర్మిళకు నష్టదాయకమని అంచనా. నగరంలో మరాఠీలు, గుజరాతీలు అధిక సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు రావడం బీజేపీ–శివసేన కూటమికి లాభదాయకమని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

ముంబై సౌత్‌లోనూ ఇదే ట్రెండ్‌
కాంగ్రెస్‌ దివంగతనేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా కొడుకు, కాంగ్రెస్‌ అభ్యర్థి మిలింద్‌ దేవరా పోటీలో ఉన్న మరో కీలక నగర నియోజకవర్గం ముంబై సౌత్‌లోనూ మరాఠీ, గుజరాతీ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన జనం నివసించే ప్రాంతాల్లో పోలింగ్‌ బాగా జరిగింది. అలాగే, కాషాయ కూటమికి మద్దతు తక్కువ లభించే ముస్లింలు, దళితుల ప్రాంతాల్లో ఓటింగ్‌ తక్కువ స్థాయిలో జరిగింది. ఈ నియోజకవర్గంలో శివసేన సిట్టింగ్‌ సభ్యుడు అరవింద్‌ సావంత్‌ మళ్లీ పోటీకి దిగారు.

ఈ స్థానం పరధిలోకి వచ్చే భెండీ బజార్, మహ్మద్‌ అలీ రోడ్, డోంగ్రీ ప్రాంతాల్లో ముస్లింలు, మైనారిటీల జనాభా ఎక్కువ. ఈ ప్రాంతాల్లో పోలింగ్‌ 48.3 శాతమే జరిగింది. అయితే సంపన్నులు నివసించే మలబార్‌ హిల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో నగర సగటు పోలింగ్‌ (52 శాతం) కన్నా ఎక్కువగా అంటే 56 శాతం జరిగింది. మోదీ ప్రభంజనం కనిపించిన 2014లోనూ ఇక్కడ జనం అధిక సంఖ్యలో ఓట్లేశారు. ఫలితంగా బీజేపీ కూటమి లబ్ధి పొందింది. ఇదే స్థానంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో నివసించే బైకుల్లా సెగ్మెంట్‌లో పోలింగ్‌ 53.01 శాతం జరిగింది. ఈ పరిణామం మిలింద్‌ దేవరాకు అనుకూలాంశం కావచ్చని కూడా కొందరు విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

మధ్య తరగతి ఓటర్లు కాషాయ కూటమికి అనుకూలమా?
నగరంలో మరాఠీ, గుజరాతీ మధ్య తరగతి ప్రజలు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతాల్లో పోలింగ్‌ బాగా జరగడానికి బీజేపీ, శివసేన కార్యకర్తలు, నేతలు గట్టి కృషి చేసి విజయం సాధించారు. ఈ వర్గాలతో పోల్చితే దళితులు, ముస్లింలు, పేదలు పెద్ద సంఖ్యలో స్థిరపడిన ప్రాంతాల్లో పోలింగ్‌ తక్కువ జరిగింది. మధ్య తరగతి ఓటర్లు బీజేపీ–శివసేన కూటమికి అనుకూలంగా, ఎస్సీలు, మైనారిటీలు, బడుగువర్గాలు కాంగ్రెస్‌కు ఓటేస్తారనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ లెక్కన ఈ తరహా ఓటింగ్‌ సరళి శివసేన, బీజేపీకి కలిసొచ్చే అంశమని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమిలో ముఠా తగాదాల వల్ల కూడా కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటర్లుగా ముద్రపడిన ప్రాంతాల ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లడానికి అంత ఉత్సాహం చూపలేదని తెలుస్తోంది.

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావడమే భారీ పోలింగ్‌కు కారణమా?
ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంతో బీజేపీ–సేన మద్దతుదారులు కూడా పట్టుదలతో ఓటేయడానికి ముందుకొచ్చారని రాజకీయ విశ్లేషకుడు ఒకరు వివరించారు. ‘‘మోదీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) నేత రాజ్‌ ఠాక్రేను కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి ఎన్నికల ప్రచారంలోకి దింపడం వాస్తవానికి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. మోదీకి ఓటేయవద్దంటూ రాజ్‌ చేసిన ప్రసంగాలు కాషాయ కూటమి సానుభూతిపరుల్లో పట్టుదల పెంచాయి,’’ అని ఆయన తెలిపారు.

ఫలితంగా బీజేపీ–శివసేన కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. అనేక ప్రాంతాల్లో పోలింగ్‌ పెరగడంపై బీజేపీ నేతలు కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. ‘‘ సంపన్నులు నివసించే ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగంపై చైతన్యం బాగా పెరిగింది. దేశాన్ని రక్షించేది నరేంద్రమోదీ ఒక్కరేననే అభిప్రాయం మొదటిసారి ఓటేసే యువత, చదువుకున్న మధ్య తరగతి ఓటర్లలో బాగా పెరిగింది. ఈ వర్గాల్లో మతం, జాతి, కులం వంటి జనాన్ని విడదీసే అంశాలకు అతీతంగా మోదీకి మద్దతు పలకడానికి ఓటేశారు,’’అని చార్కోప్‌ బీజేపీ ఎమ్మెల్యే అతుల్‌ భట్ఖాల్కర్‌ చెప్పారు.

పేదలు సొంతూళ్లకు పోవడంతోనే తక్కువ పోలింగ్‌
మురికివాడలు, పేద ప్రజానీకం ఎక్కువ ఉన్న ప్రాంతాల జనం వారాంతపు సెలవులు ఎక్కువ రావడంతో సొంతూళ్లకు పోయారనీ, అందుకే ఇలాటి చోట్ల తక్కువ పోలింగ్‌ నమోదైందని వర్లీ శివసేన శాసనసభ్యుడు సునీల్‌ షిండే అభిప్రాయపడ్డారు. అయితే, పాలకపక్షాలైన బీజేపీ, శివసేన కుట్రల వల్లే తమకు ఎప్పటి నుంచో బలమున్న ప్రాంతాల్లో తక్కువ పోలింగ్‌ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ‘‘ ఎన్నికల అధికారులు దురుద్దేశంతోనే ఓటర్‌ స్లిప్పుల తయారీలో కావాలనే తప్పులు చేశారు.

అనేక మురికివాడల ఓటర్లకు ఇచ్చిన ఓటర్‌స్లిప్పుల్లో ఫోటోలు, పేర్లు తప్పులతో ప్రచురించారు. చిరునామాలు కూడా మారిపోయాయి. ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లిన పేదలు ఈ గందరగోళం వల్ల ఓట్లు లేవని చెబితే ఓటేయకుండా వెనక్కితిరగాల్సి వచ్చింది. ఇంకా, అనేక మంది ఓటర్లకు తమ ఇళ్లకు చాలా దూరంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాలను కేటాయించారు. ఈ కారణాల వల్ల పేదలు నివసించే ప్రాంతాల్లో పోలింగ్‌ తగ్గిపోయింది’’ అని మాల్వానీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అస్లమ్‌ షేక్‌ వివరించారు.

>
మరిన్ని వార్తలు