చెరో మూడు ఖాయం 

1 Feb, 2020 08:35 IST|Sakshi

రాజ్యసభ ఎన్నికలకు ఆఘాడి, బీజేపీ కసరత్తు

 రాష్ట్రం నుంచి ఏడుగురి పదవీకాలం ఏప్రిల్‌తో పూర్తి 

బలాలను బట్టి కూటమికి మూడు, బీజేపీకి మూడు వచ్చే అవకాశం

ఆ ఒక్కటిపై ఇరుపార్టీల్లో సందిగ్ధం 

సాక్షి,ముంబై: రాబోయే రాజ్యసభ ఎన్నికల కోసం మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏడుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌ 2న ముగియనుంది. గడువు పూర్తవనున్న రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఈ నెలలో నోటిఫికేషన్‌ వెలువడనుంది. పదవీకాలం పూర్తవుతున్న వారిలో ఆర్పీఐ అధ్యక్షుడు రామ్‌దాస్‌ ఆఠవలేతోపాటు సంజయ్‌ కాకడేలున్నారు. అదేవిధంగా బీజేపీకి చెందిన అమర్‌ సాబలే, కాంగ్రెస్‌ నేత హుసేన్‌ దల్వాయి, శివసేన నేత రాజ్‌కుమార్‌ దూత్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ç పవార్, అడ్వొకేట్‌ మాజీద్‌ మేమన్‌లు ఉన్నారు. అయితే మహావికాస్‌ ఆఘాడికి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ముగ్గురు ఎన్నిక కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఏడవ రాజ్యసభ సభ్యుడి ఎన్నిక కోసం గట్టిపోటీ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్థానం కూడా దక్కించుకునేందుకు మహావికాస్‌ ఆఘాడి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. 

ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిన సంగతి తెలిసిందే. గతంలో బీజేపీతో కలిసి ఉన్న శివసేన అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి రాష్ట్రంలో మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రస్తుతం శాసన సభ్యుల సంఖ్యను పరిశీలిస్తే బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44, ఎమ్మెన్నెస్‌ 1, సమాజ్‌వాదీ పార్టీ 1, బహుజన్‌ వికాస్‌ ఆఘాడి 3, ఇండిపెండెంట్లు కలసి మొంత్తం 288 మంది ఉన్నారు. రాష్ట్రంలో మహావికాస్‌ ఆఘాడి మిత్రపక్షాలతోపాటు ఇండిపెండెంట్లతో కలిసి 170 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

మరోవైపు బీజేపీ వద్ద ఇండిపెండెంట్లు మిత్రపక్షాలతో కలిపి 115 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. ఈ నేపథ్యంలో గడువు ముగియనున్న ఏడుగురు రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ఒక్కొక్కరికీ కనీసం 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం కానుంది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలకు ఒక్కో రాజ్యసభ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు బీజేపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అయితే ఏడవ రాజ్యసభ సభ్యుడి కోసం మాత్రం ఇండిపెండెంట్లు కీలకంగా మారనున్నారు. దీంతో ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతివ్వనున్నారనేది వేచి చూడాల్సిందే.   

>
మరిన్ని వార్తలు