వచ్చేది ఫెడరల్‌ ఫ్రంటే..

5 Apr, 2019 10:38 IST|Sakshi
సమావేశంలో ప్రసంగిస్తున్న హోం మంత్రి మహమూద్‌ అలీ

- హోం శాఖ మంత్రి మహమూద్‌అలీ 

సాక్షి, జహీరాబాద్‌: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. గురువారం రాత్రి జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్‌అలీ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు 100కు మించి సీట్లు రావని, బీజేపీకి 120కి మించి స్థానాలు వచ్చే అవకాశం లేదన్నారు. దీంతో కేంద్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కీలక పాత్రను పోషించడం ఖాయమన్నారు. ప్రాంతీయ పార్టీలతో జతకట్టి ఫెడరల్‌ ఫ్రంట్‌ అధికారం చేపట్టం ఖాయమన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. రాష్ట్రాన్ని ఏక ధాటిగా పాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా వెనుకబడిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు గాను 14 సంవత్సరాల పాటు కేసీఆర్‌ ఉద్యమాన్ని నిర్వహించారన్నారు.

రాష్ట్రం సాధించి అభివృద్ధిని సాధించడమే కాకుండా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. రైతులకు రైతు బంధు, 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్లు తదితర పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగు నింపారన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు టీఆర్‌ఎస్‌కు మద్ధతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఎంపీ బీబీ పాటిల్‌ జహీరాబాద్‌ ప్రాంతం అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారన్నారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, బ్రూవరీస్‌ సంస్థ ఛైర్మన్‌ దేవీ ప్రసాద్, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, పార్లమెంట్‌ ఇన్‌చార్జి భరత్‌కుమార్, టీఆర్‌ఎస్‌ నాయకులు మునిరుద్దీన్, ఎం.శివకుమార్, డి.లక్ష్మారెడ్డి, ఉమాకాంత్‌ పాటిల్, మంకాల్‌ సుభాష్, రాములు యాదవ్, తంజీం, వైజ్యనాథ్, మురళికృష్ణాగౌడ్,షేక్‌ ఫరీద్, నామ రవికిరణ్, వరలక్ష్మి పాల్గొన్నారు. పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. 

జహీరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తా
జహీరాబాద్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. జహీరాబాద్‌ నుంచి సదాశివపేట, సంగారెడ్డిల మీదుగా సికింద్రాబాద్‌కు కొత్త రైలు మార్గం మంజూరైందని, పనులు త్వరగా ప్రారంభం అయ్యేలా చూస్తానన్నారు. నిమ్జ్‌ పనులు సైతం వేగవంతంగా సాగేలా చూస్తానన్నారు. ఇప్పటికే జాతీయ రహదారుల నిర్మాణం పనులు జరిగేలా కృషి చేశానన్నారు. ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

మరిన్ని వార్తలు