ఎన్నికలు.. చివరిరోజు నామినేషన్ల వరద

8 Feb, 2018 12:42 IST|Sakshi
నాగాలాండ్ అసెంబ్లీ నియోజవర్గాలు

ఫిబ్రవరి 27న నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు

బుధవారం 253 మంది నేతల నామినేషన్లు

సాక్షి, కోహిమ: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలకు చివరి తేదీ దగ్గర పడుతున్నా ఉలుకు పలుకూ లేకుండా ఉన్న నేతలు చివరి రోజు మాత్రం నామినేషన్ వేశారు. బుధవారం (ఫిబ్రవరి 7) చివరిరోజు కాగా.. అదే రోజు నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, స్వతంత్రులు కలిపి 253 మంది నేతలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 27న నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. 

మంగళవారం అధికార నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ తొలి నామినేషన్ దాఖలు చేయగా, అదేరోజు సీఎం టీఆర్ జెలియాంగ్ తన నామినేషన్ పత్రాలు సమర్పించినట్లు సమాచారం. నాగాల తిరుగుబాటు గ్రూపులు గ్రేటర్ నాగాలాండ్ లేదా నాగాలిమ్ కోసం చేస్తున్న డిమాండ్లు, చర్చల కారణంగా మెజార్టీ నేతలు చివరిరోజు వరకూ నామినేషన్ వేయలేదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అభిజిత్ సిన్హా తెలిపారు. నామినేషన్ పత్రాలను గురువారం పరిశీలించనుండగా, ఉపసంహరణకు ఫిబ్రవరి 12 చివరితేదీ అని చెప్పారు.


ఉన్నతాధికారులతో నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ 

నాగాలాండ్, మేఘాలయాల్లో ఫిబ్రవరి 27న, త్రిపురలో ఫిబ్రవరి 18న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ మార్చి 3న ఎన్నికల లెక్కింపు జరుగుతుంది. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయాల్లో ఒక్కో రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఎన్నికల్లో ఈవీఎంలకు వీవీ ప్యాట్ మిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి ఇదివరకే స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు