హిందీ భాష అమలు.. కేంద్ర మంత్రులు ఫెయిల్‌

5 Oct, 2017 14:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  జాతీయ భాష హిందీని ఎలాగైనా సరే దేశప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా యత్నించింది. అయితే కొన్ని చోట్ల హిందీకి వ్యతిరేకంగా.. ముఖ్యంగా దక్షిణ భారతంలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గింది.  హమారీ మాతృభాష హిందీ హమారీ..  పెహ్‌చాన్ హై హమేఁ ఇస్‌పే గర్వ్ కర్నా చాహియే అంటూ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో వెంకయ్య నాయుడు ఓ మీటింగ్‌  వ్యాఖ్యలు కూడా చేశారు. అదే సమయంలో పార్లమెంటులో కూడా స‌భ్యులు హిందీలోనే మాట్లాడాల‌నే ప్యానెల్ విధించిన రూల్ ఆయ‌న గుర్తుచేసారు. 

కట్‌ చేస్తే... ఇప్పుడు మన మంత్రులు ఎంత సాధించారు? పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. కేబినెట్‌ లో ఇప్పుడున్న ఎక్కువ మంది మంత్రులు పూర్తి స్థాయిలో హిందీ భాషను అధికారికంగా ఉపయోగించటం లేదని విషయం తెలుస్తోంది. హోం శాఖ, నీతి ఆయోగ్‌, ఐబీ మంత్రిత్వ శాఖ ఇలా 20 శాఖల్లో నిర్వహించిన సమీక్షతో ఈ విషయం వెలుగు చూసింది. ఇక శాఖల వారీగా పరిశీలిస్తే... ఉమా భారతి జలవనరుల శాఖ ఒక్కటి మాత్రమే గరిష్టంగా హిందీ భాషను ఉపయోగిస్తోంది. ఫైల్‌ నోటింగ్‌లు దాదాపు 58 శాతం హిందీలోనే అవుతుండగా... ఆ శాఖకు సంబంధించి 44 మంది అధికారుల్లో 40 మంది పని వేళలో హిందీలోనే మాట్లాడుతున్నారు.

ప్రధానంగా ఆమె ఎక్కువగా హిందీలోనే మాట్లాడుతుండటంతో.. అధికారులు కూడా ఉమా భారతి బాటలోనే పయనిస్తున్నారని అర్థమౌతోంది. కీలకమైన హోం శాఖ విషయానికొస్తే... 112 సీనియర్‌ అధకారులు తమకు హిందీ వచ్చనే గతంలో చెప్పగా.. 49 మంది 30 శాతం కంటే తక్కువగా ఆ భాషను వినియోగించటం గమనార్హం. ఇక మిగిలిన వారిలో మరో 38 మంది 30 నుంచి 70 శాతం మాత్రమే హిందీ భాషను వినియోగిస్తున్నారని తేలింది. 55 శాతం ఫైల్‌ నోటింగ్స్‌ హిందీలోనే జరుగుతున్నప్పటికీ.. వాటికి బదులు ఆంగ్లంలోనే ఇస్తున్నారన్నది వెల్లడైంది. 

నీతి ఆయోగ్‌ లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. 59 మంది అధికారుల్లో ఒక్కరు కూడా హిందీలో మాట్లాడకపోవటం విశేషం. అదే సమయంలో 39 శాతం.. అది కూడా ఫైల్‌ నోటింగ్‌ కోసం హిందీని వినియోగిస్తున్నారు. ఇక తమ విభాగంలో సాంకేతిక సేవలకు చెందిన అధికారులు ఎక్కువగా ఉండటంతోనే హిందీని వినియోగించటం కష్టతరంగా ఉందని ఐబీ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫైల్‌ నోటింగ్‌ కోసం 35 శాతం వినియోగిస్తుండగా.. 98 మంది అధికారుల్లో 36 మంది 70 శాతం మేర హిందీని వినియోగిస్తున్నారు.  పర్యావరణ శాఖ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కావటంతో ఆ శాఖలోనూ హిందీయేతర కార్యకలాపాలే ఎక్కువ దర్శనమిస్తున్నాయి. మిగతా మంత్రిత్వ శాఖల్లోనూ, పైగా కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ తర్వాత పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. మొత్తానికి మంత్రులకు తగ్గట్లే ఆయా శాఖలు.. అందులోని అధికారులు కూడా హిందీ భాషను నిర్లక్ష్యం చేస్తూ..  ప్రజలకు మాత్రం స్పీచులు ఇస్తున్నారన్న మాట.

మరిన్ని వార్తలు