టీఆర్‌ఎస్‌ తుపానులో ప్రతిపక్షాలు గల్లంతు

19 Nov, 2018 01:57 IST|Sakshi
కంటతడి పెడుతున్న ముత్యంరెడ్డిని ఓదార్చుతున్న మంత్రి హరీశ్‌రావు

వారికి డిపాజిట్లు దక్కకుండా కృషి చేయాలి

కార్యకర్తలకు మంత్రి హరీశ్‌రావు పిలుపు

ముత్యంరెడ్డి చేరికతో పార్టీ మరింత బలోపేతం

విలపించిన పెద్దాయన.. ఓదార్చిన హరీశ్‌

20న గులాబీ గూటికి..

తొగుట: టీఆర్‌ఎస్‌ తుపానులో ప్రతిపక్షాలు కొట్టుకుపోవడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుటలో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చెరుకు ముత్యంరెడ్డి నివాసంలో దుబ్బాక తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలసి భేటీ అయ్యారు. ముత్యంరెడ్డితో వారు అరగంట సేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ చెరుకు ముత్యంరెడ్డి చేరికతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 10 సీట్లు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్‌ దక్కకుండా కార్యకర్తలు శ్రమించాలని ఆయన కోరా రు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షి తులై విపక్ష పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. అందరం కలసి బంగారు తెలంగాణ నిర్మించుకుందామని మంత్రి పిలుపునిచ్చారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్‌ కాకతీయ, భగీరథ ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారని పేర్కొన్నారు. దుబ్బాకలో ముత్యంరెడ్డి, రామలింగారెడ్డి పోటీ పడి అభివృద్ధి చేసేవారని కొనియాడారు.

అనుభవాన్ని ఉపయోగించుకుంటాం
టీఆర్‌ఎస్‌లో ముత్యంరెడ్డి చేరడం శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి ముత్యంరెడ్డి ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న పెద్దాయన సేవలను టీఆర్‌ఎస్‌ ఉపయోగించుకుంటుందని, సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని భరోసా ఇచ్చారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ముత్యంరెడ్డికి మంచి పట్టుందని, దుబ్బాక నియోజకవర్గంలో రామలింగారెడ్డి, ముత్యంరెడ్డి కలసి అభివృద్ధిలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు.

కేసీఆర్‌తో ముత్యంరెడ్డికి 30 ఏళ్ల పరిచయముందని, గతంలో ఇద్దరూ కలసి జిల్లా అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమన్వయంతో కలిసి పనిచేయాలని, పార్టీలో అందరికి గుర్తింపు ఉంటుందని హరీశ్‌రావు చెప్పారు. ముత్యంరెడ్డి తనకు అన్నలాంటి వారని, ఆయన సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని సోలిపేట పేర్కొన్నారు. బీజేపీ, టీజేఎస్, కాంగ్రెస్‌ పార్టీలను ప్రజలు విశ్వసించరని, వారికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.

20న గులాబీ గూటికి ముత్యంరెడ్డి
సాక్షి, సిద్దిపేట: ఈ నెల 20న ముత్యంరెడ్డి గులాబీ గూటికి చేరనున్నారు. టిక్కెట్‌ రాకపోవడంతో అసంతృప్తికి లోనైన ముత్యంరెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడే విషయమై తన అనుచరులతో చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు, తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు తొగుటలోని ముత్యంరెడ్డి ఇంట్లో ఆయనను కలసి.. టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అందుకు ఆయన అంగీకరించినట్లు తెలిíసింది. 20న కేసీఆర్‌ సమక్షంలో ముత్యంరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

కోదండరాంకే టికెట్‌ దక్కలేదు..
మెదక్‌ మున్సిపాలిటీ: మహాకూటమిలో తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు కోదండరాంకే టికెట్‌ దక్కలేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కనీసం సీట్లు తెచ్చుకోనోళ్లు ఎలా పరిపాలిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీకి.. టీడీపీకి ఓటేస్తే అమరావతికి పోతుందని, టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అభివృద్ధి పరం పర కొనసాగుతుందని పేర్కొన్నారు.

ముత్యంరెడ్డి కంటతడి..
ముత్యంరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ తనకు ద్రోహం చేసిందని ఆవేదనగా చెప్పారు. తన వద్ద డబ్బులు లేవని టికెట్‌ నిరాకరించారని బోరున విలపించారు. కాంగ్రెస్‌లో మంచికి, నీతి నిజాయితీలకు తావు లేదన్నారు. మంత్రి హరీశ్‌రావు, రామలింగారెడ్డిలు ఆయనను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ముత్యం రెడ్డి కన్నీరు పెట్టుకోవడాన్ని తట్టుకోలేక కార్యకర్తలు సైతం బోరున విలపించారు.

మరిన్ని వార్తలు