మంత్రి ఆది బెదిరింపులకు భయపడం

5 May, 2018 12:22 IST|Sakshi

కేశవరెడ్డి బాధితులకు న్యాయం జరిగేంత వరకు స్కూళ్ల ఎదుట నిరసన  

వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు రాజగోపాల్‌రెడ్డి

కర్నూలు, నంద్యాల: మంత్రి ఆదినారాయణరెడ్డి బెదిరింపులకు కేశవరెడ్డి బాధితులు భయపడబోరని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం కేశవరెడ్డి బాధితుల సమక్షంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2015 నుంచి నంద్యాల ఎన్‌జీఓ కాలనీలోని కేశవరెడ్డి పాఠశాల నిధులు ఏమవుతున్నాయో అంతుపట్టడం లేదన్నారు. విద్యార్థుల ఫీజులు, అడ్మిషన్ల ద్వారా పాఠశాలకు రూ.70కోట్లకుపైగా సమకూరిందని, ఆ డబ్బును ఎక్కడికి మళ్లిస్తున్నారో బాధితులకు చెప్పాలన్నారు. ఇందుకు సంబంధించి బాధితులు వెళ్లి ప్రశ్నిస్తే కేశవరెడ్డి వియ్యంకు డు, మంత్రి ఆదినారాయణరెడ్డి తన అనుచరులను నంద్యాలకు పంపి భయపెట్టాలని ప్రయత్నించారన్నారు.

వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా తర్వాత వదిలిపెట్టారని చెప్పిన రాజగోపాల్‌రెడ్డి .. ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వమే ఉండదనే విషయాన్ని గ్రహించాలని పోలీసులకు హితవు పలికారు. మంత్రి.. అధికారం, పోలీసుల అండ చూసుకుని    రెచ్చిపోతున్నారని, అయితే ఆయన స్వయంగా నంద్యాలకు వచ్చి కూర్చున్నా భయపడబోమని హెచ్చరించారు.  కేశవరెడ్డికి అప్పులిచ్చిన పాపానికి బాధితులు రోడ్డున పడాల్సి వచ్చిందని, ఇలాంటి వారు నంద్యాలలోనే 300 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ పాఠశాల ఎప్పుడు రద్దవుతుందో ఎవరికీ తెలియదని, ఎవరూ విద్యార్థులను చేర్పించవద్దని తల్లిదం డ్రులకు సూచించారు. అప్పులు చెల్లించి బాధితులకు న్యాయం చేసేంత వరకు కేశవరెడ్డి పాఠశాలల వద్ద నిరసన కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బాధితులు చాబోలు సీవీరెడ్డి, గోపాల్‌రెడ్డి, మురళీకృష్ణ, హరినాథరెడ్డి, సుబ్బరాయుడు, రామ్మోహన్‌రెడ్డి, కోలా దశరథరామిరెడ్డి, డి.రామిరెడ్డి, సంజీవరెడ్డి, సుజిత్, వైఎస్సార్‌సీపీ నాయకులు గోపాల్‌రెడ్డి, ద్వారం మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కేశవరెడ్డి పాఠశాల వద్ద ఆందోళన..
ఎన్‌జీఓ కాలనీ కేశవరెడ్డి పాఠశాల వద్ద బాధితులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.   ‘మాకు రావాల్సిన అప్పు చెల్లించి మీ అడ్మిషన్లు చేసుకోండి’ అని నినాదాలు చేస్తూ స్కూల్లోకి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు పోలీసుల ద్వారా ఎంతకాలం అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా