ఎంపీ, ఎమ్మెల్యే.. మంత్రి

22 Mar, 2019 09:08 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: అదృష్ట జాతకమంటే ఆయనదే అని అందరూ అనుకుంటున్నారు. రాజకీయ రంగ ప్రవేశంతోనే ఒక్కసారిగా ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా వరుసగా పదవులు వరించాయి మల్లారెడ్డిని. అనూహ్యంగా పార్లమెంట్‌ టికెట్‌ సాధించటంతో పాటు అతి పెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందిన చామకూర మల్లారెడ్డి ఐదేళ్ల పదవీకాలం పూర్తికాక ముందే మేడ్చల్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఆ వెంటనే కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రి అయ్యారు.

ఎంపీగా అయినా, ఎమ్మెల్యేగా అయినా పోటీ చేసిన తొలిసారే విజయం సాధించారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి 88,066 మెజారిటీతో విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థిగా మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడటం, టీడీపీ బలహీన పడటం వంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.  అలాగే, ముందస్తు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన శాసనసభపై మోజుతో మేడ్చల్‌ టికెట్‌ ఆశించారు. ఆ ఎన్నికల్లో 88,066 ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. అనూహ్యంగా రాష్ట్ర మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు.  

మరిన్ని వార్తలు