ఎన్నికల కమిషనర్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు

16 Mar, 2020 14:25 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎన్నికలు చివరిదశలో ఉన్న సమయంలో వాటిని వాయిదా వేయడాన్ని కుట్రగా అభివర్ణించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారన్నారు. ప్రజల మద్దతు ఉన్న నాయకుడిని ఎదురుకోలేక దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో విచక్షణాధికారం పేరుతో కుట్రలు పన్నారని... ఇప్పుడు కరోనాను బూచిగా చూపి ఎన్నికలు వాయిదా వేశారని దుయ్యబట్టారు.  గతంలో బాబు తన టెలికాన్ఫరెన్స్‌లో కరోనాపై విషప్రచారం చేయాలని సూచించారని విమర్శించారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న అధికారుల లిస్టు కేంద్రానికి పంపుతామని పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారు.. ముందు ఆయన ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.

అలాంటి వాళ్లే ఎన్నికల వాయిదా కోరుకుంటారు
‘151 ఎమ్మెల్యేలు గెలిచిన నాయకుడిపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ప్రజాబలం లేనివారు ఎన్నికల వాయిదా కోరుకుంటారు. ప్రజావిశ్వాసం ఉన్న మేము ఎన్నికలు కోరుకుంటున్నాము. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాము. ఆర్థికంగా  చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల వూబిలో నెట్టి బయటకెళ్లారు. తొమ్మిది నెలల్లో పాలనలను గాడిలో పెట్టి, ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి.. ప్రజల మద్దతుతో పాలన సాగిస్తున్నాము. నిధులు వస్తే ..పరిపాలన ఆర్థికంగా సజావుగా సాగుతోందని బాబు కుట్రలు పన్నారు. అటు కౌన్సిల్‌లోనూ, ఇటు ఎన్నికల కమిషన్‌లోనూ ఆయన వారసులు, ఏజెంట్లు వున్నారు. కనుకే ఎన్నికలు వాయిదా పడ్డాయి. అన్ని రాజకీయ పార్టీలు ఒకటే మాట మాట్లాడుతున్నాయి’ అని మల్లాది విష్ణు అసహనం వ్యక్తం చేశారు. 

చదవండి: ఎన్నికలు జరిపేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించండి

మరిన్ని వార్తలు