దేవదాయ శాఖ నిధుల మళ్లింపు అవాస్తవం

22 Jul, 2020 04:48 IST|Sakshi

వాటిని బ్రాహ్మణ కార్పొరేషన్‌కు వినియోగించడమన్నదే ఉండదు

బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: అమ్మఒడి పథకం కోసం దేవదాయ శాఖ నిధులు మళ్లించారంటూ బ్రాహ్మణ కార్పొరేషన్‌పై రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు ప్రచారం చేస్తున్నారని.. అవన్నీ పూర్తి అవాస్తవాలని బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ‘జగనన్న అమ్మఒడి పథకం అమలుకు ఏ దేవాలయానికి సంబంధించిన నిధులుగానీ, భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకలుగానీ, దేవదాయ శాఖ నిధులుగానీ ఉపయోగించలేదు.  రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపులు మాత్రమే ఉపయోగించాం. దీనిపై ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి ఈ విషయం గమనించాలి’.. అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రకటనలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే..

► గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 42,33,098 మందికి జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరింది. వీరిలో 8,89,113 మంది ఓసీలు కాగా అందులో 17,611 మంది బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన పిల్లలకూ లబ్ధి చేకూరింది.
► ఈ ఏడాది జనవరి 3న రూ.24.24 కోట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ జీఓ నెంబరు 20 ద్వారా దేవదాయ శాఖకు అదనపు నిధులు కేటాయించింది. అదే నెల 6న దేవదాయ శాఖ వాటిని బ్రాహ్మణ కార్పొరేషన్‌కు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జనవరి 17న మరోసారి రూ.2.16 కోట్లు ఇదే విధానంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు విడుదలయ్యాయి.  
► బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు పాలనాపరమైన ఉత్తర్వులు, ప్రభుత్వ బడ్జెట్, నిధుల మంజూరు, దేవదాయ శాఖ ద్వారానే వస్తాయి. ఈ వాస్తవాన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు గుర్తించాలి. 

అది దేవాలయాల సొమ్ము కాదు
దేవాలయాల సొమ్ము రూ.25 కోట్ల మేర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి తరలించిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆంధ్రప్రదేశ్‌ అర్చక సమాఖ్య కూడా ఒక ప్రకటనలో ఖండించింది. దేవదాయ శాఖలో ఒక భాగంగా ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను మంజూరు చేసిందని.. కానీ, కొంతమంది దానిని దేవాలయాల సొమ్ముగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబులు పేర్కొన్నారు. దేవాలయాల్లో పనిచేసే అర్చకులు ఒకొక్కరికి రూ.5వేల చొప్పున ఇచ్చిన సహృదయులు సీఎం వైఎస్‌ జగన్‌ అని వారు ప్రశంసించారు. 

మరిన్ని వార్తలు