పోలవరంపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు : మల్లాది

19 Jul, 2019 11:35 IST|Sakshi

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. శుక్రవారం శాసనసభలో టీడీపీ సభ్యులు ప్రవర్తనపైన ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పోలవరంపై చర్చ జరగకూడదని టీడీపీ భావిస్తోందన్నారు. టీడీపీ సభ్యులు సభలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. శాసనసభను పోలవరం పేరుతో టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నవంబర్‌ 1 నుంచి పోలవరం పనులు ప్రారంభిస్తామని సీఎం శాసనసభలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పోలవరంలో టీడీపీ ఇష్టానుసారం అవినీతి చేసిందని ధ్వజమెత్తారు.

పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే.. గత టీడీపీ ప్రభుత్వం స్వార్ధం కోసం వారి చేతుల్లోకి తీసుకుందని ఆరోపించారు. పోలవరం పనులు ఆగిపోయాయని టీడీపీ సభ్యులు ఆందోళన చేయడం సరికాదని అన్నారు. పోలవరంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసిందని.. 15 రోజులో ఆ కమిటీ నివేదిక ఇవ్వనుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టనున్నారని పేర్కొన్నారు. పోలవరంకు సంబంధించిన అన్ని అంశాలపై సీఎం స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు.

మరిన్ని వార్తలు